హిందూత్వ వాదుల అఖండ విజయం

24 May, 2019 14:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ గతంలోకన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధించడానికి కారణం ప్రజలు హిందూత్వ వాదానికి పట్టం గట్టడమేనని స్పష్టంగా అర్థం అవుతోంది. ‘వికాస్‌’ ప్రధాన నినాదంగా ప్రచారం చేయడం ద్వారా గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈసారి ఆ నినాదాన్ని పక్కన పడేసి ‘హిందూత్వ’ నినాదాన్ని పట్టుకోవడం వల్ల గతంలోకెల్లా బీజేపీకి ఈసారి ఎక్కువ సీట్లు వచ్చాయి. గత బీజేపీ హయాంలో పెరిగిన గోరక్షక దాడులు, మూక హత్యలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న ధరలు తదితర అంశాలన్నీ హిందూత్వ జాతీయవాదం ముందు తుడిచిపెట్టుకుపోయాయి. మూకుమ్మడి హత్యకు సంబంధించిన టెర్రరిస్టు కుట్ర కేసులో విచారణ ఎదుర్కొంటూనే బీజేపీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌పై అఖండ విజయం సాధించడం మామాలు విషయం కాదు. కరుడుగట్టిన హిందూత్వ వాదులు సాక్షి మహరాజ్, గిరిరాజ్‌ సింగ్, అనంతకుమార్‌ హెగ్డేలు గతంకన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధించడం అంటే హిందూత్వవాదానికి ప్రజలు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. 

అనంత్‌ కుమార్‌ హెగ్డే
కర్ణాటకలోకి ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి ఐదోసారి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన అనంత్‌కుమార్‌ హెగ్డే కేంద్రంలో వ్యాపారరంగంలో నైపుణ్యాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన కరడుగట్టిన ఆర్‌ఎస్సెస్‌ వాదే కాకుండా దాని విద్యార్థి సంస్థ ఏబీవీపీలో కూడా పనిచేశారు. ముస్లింలు, దళితులకు వ్యతిరేకండా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ఆయనకు అలవాటు. ఇస్లాం బతికున్నంతకాలం ప్రపంచంలో శాంతి అనేది ఉండదంటూ 2016లో ఆయన విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు ఆయనపై కేసు కూడా నమోదయింది. ఇక ఆయన 2018లో దళితులను మొరిగే కుక్కలంటూ అవమానించారు. ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ కూడా ఒకప్పుడు ‘తేజో మహాలయ అనే శివాలయం’ అంటూ కొత్త వివాదాన్ని కూడా తీసుకొచ్చారు. ఆయన 2014 ఎన్నికల్లో 1.4 లక్షల మెజారిటీతో విజయం సాధించగా, ఈ సారి ఏకంగా నాలుగు లక్షల ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. 

గిరిరాజ్‌ సింగ్‌ 
కేంద్ర సూశ్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న గిరిరాజ్‌ సింగ్‌ బీహార్‌ ఎంపీ. ఇంతకుముందు ఆయన నావడా నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, ఈసారి సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ను ఎదుర్కొనేందుకు బెగుసరాయ్‌ నుంచి పోటీ చేశారు. కరుడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపొందిన ఆయన ముస్లింల సంతానోత్పత్తిని ఎదుర్కొనేందుకు పదేసి మంది పిల్లల్ని కనాలంటూ హిందువులకు పలుసార్లు పిలుపునిచ్చారు. మోదీకి మద్దతివ్వని వారంతా పాకిస్థాన్‌కు వెళ్లాలంటూ హెచ్చరించారు. ఆయన పదే పదే మతపరమైన విమర్శలు చేస్తుంటే 2014 ఎన్నికల సందర్భంగా బీహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆయన ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు కూడా విధించింది. ఈసారి కూడా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. గత ఎన్నికల్లో ఆయన 44.1 శాతం పోలింగ్‌తో 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఈసారి మంచి స్పీకర్‌గా పేరుపొండడమేకాకుండా వినూత్న రీతిలో విస్తతంగా ఎన్నికల ప్రచారం చేసిన కన్హయ్య కుమార్‌పై 56.53 ఓట్ల శాతంతో రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 


సాక్షి మహరాజ్‌ 
కరుడుగట్టిన హిందూత్వవాది సాక్షి మహరాజ్‌పై ఏకంగా 34 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా 2011లో ఆయన ఓ మూకుమ్మడి రేప్‌ కేసు నుంచి బయటపడ్డారు. 2013లో జరిగిన ఓ హత్య కేసులో ఆయన ఇప్పటికీ నిందితుడే. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులోనూ నిందితుడే. గాంధీజీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా ఆయన పలుసార్లు వర్ణించారు. ప్రతి హిందువు కనీసం నలుగురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఆవును హింసించినా, మతం మారిన హత్య కేసు కింద మరణిదండన విధించాలంటూ ప్రచారం చేశారు. ఆయన గత ఎన్నికల్లో మూడు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఈ సారి యూపీలోని ఉన్నావో నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థి అరుణ్‌ శంకర్‌ శుక్లాపై ఏకంగా నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌
ఆమె కరడుగట్టిన హిందూత్వ వాది. 2008లో జరిగిన మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన నిందితురాలు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె అనారోగ్య కారణాలపై బెయిల్‌ తీసుకొని మూడుసార్లు శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. మూడోసారి ఆపరేషన్‌తో ఆమెకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నయం అయింది. అయితే తాను రోజు ఆవు మూత్రం తాగడం వల్ల తన క్యాన్సర్‌ నయం అయిందని కూడా ఎన్నికల్లో ఆమె ప్రచారం చేసుకున్నారు. ఓ హత్య కేసు విచారణను ఎదుర్కొంటూనే ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తిగా కూడా ఆమె చరిత్ర సష్టించారు. తాను నిందితులుగా ఉన్న మాలెగావ్‌ కేసును విచారిస్తున్న ‘యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌’ చీఫ్‌ హేమంత్‌ కర్కరే అదే సంవత్సరం సంభవించిన ఓ బాంబు పేలుడులో మరణించగా తన శాపం కారణంగానే ఆయన మరణించారంటూ వ్యాఖ్యానించి తాత్కాలికంగా చిక్కుల్లో పడ్డారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయడంలో తాను ప్రముఖ పాత్ర వహించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని కూడా పదే పదే చెప్పుకున్నారు. ఆమె దిగ్విజయ్‌ సింగ్‌పై మూడున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

మరిన్ని వార్తలు