ఆదోని పై పట్టెవరిది !

1 Apr, 2019 08:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : పూర్వం దక్షిణాది ధాన్యం మార్కెట్‌గా వెలుగొంది.. ఇప్పుడు దుస్తులు, బంగారం మార్కెట్‌కు కేంద్రంగా విరాజిల్లుతున్న ఆదోనికి ఘనమైన చారిత్రక నేపథ్యమే ఉంది. రెండో ముంబైగా వినుతికెక్కిన ఈ ప్రాంతం 16వ శతాబ్దములో యాదవుల పాలనలో ఉండేది. అప్పుట్లో దీనిపేరు యాదవగిరి. ముస్లింల పాలనలో ఆదవోని అయ్యింది. కాలక్రమంలో ఆదోనిగా రూపాంతరం చెందింది. బ్రిటిష్‌ పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలోని బళ్లారి జిల్లాలో భాగంగా ఉండేది.

1952లో ఏర్పడిన ఆదోని నియోజకవర్గానికి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు జరగ్గా.. ఆరుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర, ఒకసారి ప్రజా సోషలిస్ట్‌ పార్టీ, ఒకసారి వైఎస్సార్‌ సీపీ గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌రెడ్డి (వైఎస్సార్‌ సీపీ), కొంకా మీనాక్షినాయుడు (టీడీపీ) తలపడుతున్నారు. ఇక్కడి ఓటర్లు వైవిధ్యమైన తీర్పునిస్తూ ప్రతి ఎన్నికలోనూ ఆసక్తి గొలుపుతూ ఉంటారు.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానితో సంబంధం లేకుండా.. తమకు నచ్చిన, ఎప్పుడూ అండగా, అందుబాటులో ఉండే అభ్యర్థికే ఓట్లు వేసి ఎమ్మెల్యే గిరీని కట్టబెడుతుంటారు. ఈ ఎన్నికలలో జనసేన, బీజేపీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నప్పటికీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి సాయి ప్రసాద్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి కొంకా మీనాక్షినాయుడు మధ్యే ప్రధాన పోటీ ఉంది.  టీడీపీ అభ్యర్థి కొంకా మీనాక్షినాయుడు గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి.

నాలుగు కాలాలపాటు ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క పనీ చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి సాయిప్రసాద్‌రెడ్డి హయాంలో పలు శాశ్వత పథకాలు ఆవిష్కారమయ్యాయి. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారనే విశ్వాసం ఓటర్లలో ఉంది. దీంతో ఈసారి ఎన్నికలో సాయిప్రసాద్‌రెడ్డి విజయం నల్లేరుమీద నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

సైకిల్‌కు ఎదురు గాలి..
టీడీపీ అభ్యర్థి మీనాక్షినాయుడుతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణంలో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుతో ఆదోనికి పూర్వ వైభవాన్ని తెస్తామని చెప్పారు. పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. మండగిరి నీటి పథకాల నిర్మాణం నత్తను తలపిస్తోంది.

రాష్ట్రంలో అత్యంత పురాతనమైన మున్సిపాల్టీల్లో ఒకటైన ఆదోనిలో ఆక్రమణలతో రోడ్లు కుంచించుకుపోయాయి. రోజు, రోజుకు జఠిలమవుతున్న ట్రాఫిక్‌ సమస్యలతో ప్రజలు నిత్య నరకం చూస్తున్నారు. రోడ్లు విస్తరణ చేపడతామని, వైఎస్‌ఆర్‌ హయాంలో మంజూరు అయి, మూడింట ఒకవంతు మిగిలిపోయిన బైపాస్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కూడా ముఖ్యమంత్రితోపాటు టీడీపీ అభ్యర్థి కూడా ప్రజలకు మాట ఇచ్చారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.

తుంగభద్ర దిగువ కాలువ ద్వారా 8 గ్రామాలకు మాత్రం సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన 32 గ్రామాల రైతులు వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్నారు. కాలువను విస్తరించి తమ గ్రామాలకు కూడా సాగునీటి సదుపాయం కల్పించాలనే డిమాండ్‌ ఉంది. ఆ దిశగా ప్రతిపాదనలు ఏవీ లేవు.  ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేరని హామీలతో టీడీపీకి నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తోంది.

ఎన్నో పథకాలు..
వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి పలు శాశ్వత పథకాలు తెచ్చారు. ఆదోని పట్టణంలో రూ.32 కోట్లతో తాగునీటి పథకం మంజూరు చేయించారు. కుప్పగల్లు వద్ద రూ.8 కోట్లతో రెండు నీటి పథకాలు, తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ, పట్టణానికి బైపాస్‌ రోడ్డు, విక్టోరియా పేట, ఇస్వి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు ఉన్నాయి. 

మున్సిపాల్టీలో 23 మంది కౌన్సిలర్లు, రూరల్‌లో 28 మంది తాజా మాజీ సర్పంచ్‌లు, 18 మంది ఎంపీటీసీలతో పాటు పార్టీకి పటిష్టమైన కేడర్‌ ఉంది. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో ఫ్యాన్‌ గాలి జోరుగా వీస్తున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు