ఒం‘గోలు’ కొట్టేవారెవరో ?

2 Apr, 2019 08:13 IST|Sakshi
ఒంగోలు నియోజకవర్గ ముఖచిత్రం

సాక్షి, ఒంగోలు :  ఇదరూ ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులే. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర తిరగ రాయడంతో పాటు ఒంగోలు నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి«గా బరిలో ఉండగా..గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ మరోసారి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు.

అజాతశత్రువు, మంచి వ్యక్తిగా గుర్తింపుపొందిన బాలినేని విజయమే లక్ష్యంగా గడప గడపకు వెళ్తున్నారు. నవరత్నాలను వివరించి వైఎస్‌ జగన్‌ను సీఎంను చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి చెబుతున్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో నడిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా సొంత ప్రయోజనాల కోసమే ఐదేళ్లు పాకులాడిన జనార్దన్‌కు ఇంటి పోరు తప్పడం లేదు. మురికి వాడలను పట్టించుకోలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బాలినేనికే విజయావకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.   

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. తొలుత ద్విసభ్యుల నియామకం ఉండేది. ఈ నియోజకవర్గానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 1955లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి గెలుపొందారు. 1952, 1955లో ద్విసభ్యుల నియామకం జరిగింది. 1957 నుంచి అసెంబ్లీకి ఒకే అభ్యర్థి ఎంపిక కొనసాగుతోంది. ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు జరిగాయి.  ఒకసారి మధ్యంతర ఎన్నిక జరిగింది.

2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఒంగోలు నగరంతోపాటు ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలంలో కొంతభాగం, నాగులుప్పలపాడు మండలంలోని కొంత భాగం ఉండేవి. 2009 పునర్విభజన సమయంలో ఒంగోలు నగరం, ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలం మొత్తం కలిపి నియోజకవర్గంగా అవతరించింది. ఒంగోలు అసెంబ్లీ నుంచి అత్యధిక  సార్లు గెలిచిన వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి రికార్డు సృష్టించారు.

తొలుత 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యక్కల తులసీరావ్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత 2004 , 2009, 2012లలో వరుసగా   విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికల్లో  దామచర్ల జనార్దన్‌రావుపై ఏకంగా 27,403 ఓట్ల రికార్డు మెజార్టీతో  విజయం సాధించారు.

భళా..బాలినేని
సౌమ్యుడు, మంచి వ్యక్తిగా పేరుపొందారు. ఎవ్వరైనా సరే నేరుగా ఆయన వద్దకే వెళ్లి సమస్యలు చెప్పుకోవచ్చు.  నమ్మినవారి కోసం ఏమైనా చేయగలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. వైఎస్‌ కుటుంబం కోసం మంత్రి పదవి సైతం తృణప్రాయంగా వదిలేశారు. జిల్లాలోని పేదలకు వైద్యం అందించేందుకు రిమ్స్‌ వైద్యశాలను మంజూరు చేయించి నిర్మించారు. వేలాది మంది  పేదలకు పట్టాలు ఇవ్వడంతో పాటు నివాస గృహాలను నిర్మించి ఇచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా, మంత్రిగా పనిచేసినా సౌమ్యుడిగా, వివాద రహితుడిగా ప్రజల గుర్తింపు పొందారు.   

జనం వద్దకు వెళ్లని జనార్దన్‌ 
2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దామచర్ల జనార్దన్‌రావు గెలిచిన తరువాత ఒంగోలు నియోజకవర్గంలో విపరీత పరిణామాలు చోటుచేసుకున్నాయనే భావన ప్రజానీకంలో వ్యక్తం అవుతుంది. కమీషన్ల కోసమే  అభివృద్ధి పనులు మంజూరు చేయించుకున్నారన్న విమర్శలూ వచ్చాయి.  కొందరు అనుచరులకే కాంట్రాక్టు పనులు కట్టబెట్టడంతో మిగిలిన టీడీపీ కేడర్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మారింది.

నగరంలో కొన్ని ప్రధాన ప్రాంతాలకే రోడ్డు, డ్రైనేజీలాంటి పనులు మంజూరు చేయించి అధికంగా ఉన్న మురికి వాడలను పట్టించుకోదు. మురికి వాడల్లో వసతుల కల్పన గాలికొదిలేశారు. రోడ్లు, తాగునీరు అందని పరిస్థితి. కక్ష సాధింపుకు దిగే వ్యక్తిగా జనార్దన్‌కు పేరుంది. ఇటీవల కమ్మపాలెంలో  జరిగిన ఘటనతో  గొడవలు సృష్టించే సంస్కృతి ఉన్న నాయకుడుగా నిలిచారు. ఈ పరిస్థితులలో స్థానికేతరుడు అయిన జనార్దన్‌ ఓ వైపు, నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం కోరుకుంటున్న బాలినేని మరో వైపు పోటీలో ఉన్నారు. 

ఓటర్ల వివరాలు మొత్తం : 2,29,317
పురుషులు : 1,11,183
మహిళలు : 1,18,101
ఇతరులు : 33 

>
మరిన్ని వార్తలు