యంత్రాంగం సిద్ధం

9 Apr, 2019 13:09 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈనెల 11వ తేదీన జరిగే పోలింగ్‌కు సంబంధించి సిబ్బంది కేటాయింపు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత వంటి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. పోలింగ్‌ నిర్వహణకు ఇబ్బంది కలగకుండా తీసుకునే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. బ్యాలెట్‌ బాక్సులు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్‌లు సిద్ధం చేశారు. అలాగే పోలింగ్‌ తీరును పరిశీలించేందుకు మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రాఫర్ల కేటాయింపులన్నీ కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. 

ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి సిబ్బంది కేటాయింపు తదితర పనులన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి తరలించనున్నారు.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల, విజ య ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందించనున్నారు. అలాగే పాలేరుకు సంబంధించి మొహమ్మదీయ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ నుంచి, మధిర నియోజకవర్గానికి మధిరలోని టీవీఎం ప్రభుత్వ హైస్కూల్‌ నుంచి, వైరాకు ఏఎంసీ గోడౌన్‌ నుంచి, సత్తుపల్లి నియోజకవర్గానికి జ్యోతి నిలయం హైస్కూల్‌ నుంచి, కొత్తగూడెంకు రామచంద్ర డిగ్రీ కళాశాల నుంచి, అశ్వారావుపేట నియోజకవర్గానికి కళాశాల నుంచి సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేయనున్నారు.

సర్వం సమాయత్తం 
ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో మొత్తం 15,13,094 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 7,39,525 మం ది పురుషులు, 7,73503 మంది మహిళలు ఉండ గా.. 66 మంది ఇతరులు ఉన్నారు. వారంతా ప్రశాంతంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,798 పోలింగ్‌ కేంద్రాలను, ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల కోసం ప్రత్యేక షామియానాలు, మంచినీటి వసతి కల్పించనున్నారు. అలాగే 4,340 బ్యాలెట్‌ యూనిట్లు, 2,143 కంట్రోల్‌ యూనిట్లు, 2,266 వీవీ ప్యాట్లను ఈ ఎన్నికలకు వినియోగిస్తున్నారు.

ఎన్నికల నిర్వహణ కోసం 7,930 మంది సిబ్బందిని నియమించారు. ఓటరు స్లిప్‌ల పంపిణీ కార్య క్రమం దాదాపు పూర్తి కావొచ్చింది. 14,82,042 ఓటరు స్లిప్‌లను ఇప్పటికే ఆయా ఓటర్లకు అందజేశారు. ఇక వికలాంగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 1,112 వీల్‌చైర్లను పోలింగ్‌ స్టేషన్ల వద్ద సిద్ధంగా ఉంచారు. ఎన్నికల కోసం 267 మంది మైక్రో అబ్జర్వర్లను వినియోగిస్తున్నారు. 461 కేం ద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 960 కేంద్రాల్లో ఆఫ్‌ లైన్‌ రికార్డింగ్‌ చేయనున్నారు. అలాగే 287 మంది వీడి యోగ్రాఫర్లనునియమించారు. ఇకఎన్నికల కోసం 265 బస్సులు అవసరం ఉండగా.. మొత్తం 304 బస్సులు, 134 జీపులు, కార్లు సిద్ధంగా ఉంచారు.

భద్రత కట్టుదిట్టం.. 
ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గుర్తించిన సమస్మాత్మక కేంద్రాల్లో పోలీస్‌ భద్రతను పెంచారు. ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో 171 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ పోలింగ్‌ సమయంలో పలు చర్యలు చేపట్టనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలటరీ దళాలతోపాటు పోలీస్‌ బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు