పోలింగ్‌ ప్రక్రియ ఇంత సుదీర్ఘమా?

20 May, 2019 04:10 IST|Sakshi

బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌

ఆర్జేడీతో సయోధ్యకు ప్రయత్నించినట్లు లాలూ చెప్పడంపై మండిపాటు

పట్నా: దేశంలో వేసవి ఎండల తీవ్రత మధ్య పోలింగ్‌ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడంపై జేడీయూ చీఫ్, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. రెండుమూడు దశల్లోనే పోలింగ్‌ ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని తెలిపారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో మరోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన పట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడారు. ‘ప్రస్తుతం పోలింగ్‌ బూత్‌ల వద్ద ఎటువంటి నీడా లేకపోవడంతో, ఓటర్లు మండే ఎండల్లో క్యూల్లో నిలబడాల్సి వస్తోంది.

పెద్ద దేశం, అందునా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్‌ల్లో కొండ ప్రాంతాలు ఉన్నందున సాధారణ ఎన్నికలను రెండు లేక మూడు దశల్లోనే పూర్తి చేయాలి’ అని అన్నారు. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల నిర్వహణలోపంగా చూడరాదంటూ ఆయన.. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యాక మిగతా పార్టీల ఏకాభిప్రాయంతో ఈ అంశంపై ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఆర్జేడీతో సయోధ్యకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ భూషణ్‌ను తాను పంపించినట్లు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన ఆత్మకథలో పేర్కొనడాన్ని నితీశ్‌ తోసిపుచ్చారు. ‘ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ భూషణ్‌ ఎందరినో కలుస్తుంటారు. లాలూ పేర్కొన్న సమయంలో ప్రశాంత్‌ భూషణ్‌ మా పార్టీలో చేరనే లేదు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు