ఈవీఎంలు... అంతా కట్టుదిట్టం!

16 May, 2019 05:06 IST|Sakshi

ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న ఈవీఎంలపై అపోహలు కొత్త కాదు. ఎప్పటి నుంచో ఉన్నవే. ఓడిన ప్రతిసారీ నాయకులు నెపాన్ని  యంత్రాలపై నెట్టేస్తున్నారని మాజీ ప్రధాన ఎన్నికల అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు కూడా. అయినా ఈ యంత్రాలపై అసత్య ఆరోపణల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ నేతలు తరచూ వ్యక్తం చేసే అనుమానాలు.. సామాన్యులకు కలిగే సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేసేందుకు సాక్షి ఒక ప్రయత్నం చేసింది. ఈవీఎంలను తయారు చేసిన కంపెనీల్లో ఒకటైన ఈసీఐఎల్‌ మాజీ ఉన్నతోద్యోగి, టెలికం డిపార్ట్‌మెంట్‌ నుంచి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పదవీ విరమణ చేసిన బి.జగదీశ్‌కుమార్‌తో చర్చించింది. ఆ వివరాలు....

ఈవీఎం పాడైతే...
ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం పనిచేయకుండా పోతే.. దాని స్థానంలో కొత్త ఈవీఎంను ఏర్పాటు చేస్తారు. ఓటింగ్‌ మధ్యలో యంత్రం పాడైతే.. అప్పటివరకూ నమోదైన ఓట్లన్నీ కంట్రోల్‌ యూనిట్‌లో భద్రంగా నిక్షిప్తమై ఉంటాయి. కొత్త ఈవీఎంలతో ఓటింగ్‌ను కొనసాగించవచ్చు. కౌంటింగ్‌ రోజు రెండు కంట్రోల్‌ యూనిట్లలోని ఓట్లను లెక్కిస్తారు. ఒకసారి కంట్రోల్‌ యూనిట్‌లో చేరిన సమాచారం (ఓటింగ్‌ వివరాలు) 15 ఏళ్లపాటు స్టోర్‌ చేసి ఉంచవచ్చు.  

ఏ మీట నొక్కినా ఓట్లు ఒకే పార్టీ్టకా?
ఈవీఎంలలో వాడే మైక్రోప్రాసెసర్‌ను ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్‌ చేయవచ్చు. కొంచెం సింపుల్‌గా చెప్పాలంటే బండరాయిపై అక్షరాలు చెక్కినట్లు. చెక్కడం వరకూ మన చేతుల్లో ఉంటుందిగానీ.. చెరిపేయడం అస్సలు సాధ్యం కాదు.  కాబట్టి ఆ సమాచారానికి మార్పులు చేయడమూ అసాధ్యం. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండదు కాబట్టి మైక్రోప్రాసెసర్‌లోని సమాచారాన్ని తెలుసుకోవడం కూడా వీలుపడదు. ఒకవేళ ఎవరైనా... ఏదో ఒక పద్ధతిలో ఇందులో మార్పులు చేస్తే మార్పులు ఏవో జరిగినట్లు ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌లోనే తెలిసిపోతుంది.  

 ఏ ఈవీఎం ఎక్కడికి వెళుతుందో ముందుగానే తెలుసుకోవచ్చా?
అస్సలు సాధ్యం కాదు. బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థులు ఎవరు? వారి సీరియల్‌ నంబర్లు ఏవి అన్నది.. నామినేషన్ల పరిశీలన, ఆమోదం తరువాత మాత్రమే స్పష్టమవుతుంది. ఆ తరువాత అక్షర క్రమంలో వివరాలను బ్యాలెట్‌ యూనిట్‌లోకి ఎక్కిస్తారు. ముందుగా జాతీయ, రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల పేర్లు, ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వారు.. తరువాత స్వతంత్ర అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో వస్తాయి. ఈవీఎంలను రెండు దశల్లో పూర్తిస్థాయిలో కలగలిపిన తరువాత మాత్రమే వాటిని పోలింగ్‌ కేంద్రాలకు కేటాయిస్తారు. ర్యాండమైజేషన్‌ అని పిలిచే ఈ ప్రక్రియ తొలి దశ జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో జరిగితే... రెండోది అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ స్థాయిలో జరుగుతుంది. మొత్తమ్మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు సాక్షులుగా ఉంటారు.  

వీవీప్యాట్‌ స్లిప్‌పై ఏదైనా తేడా ఉంటే ఫిర్యాదు చేయవచ్చా?
తాము ఓటేసిన వారికి బదులు ఇతరులకు ఓటు పడిందని ఓటర్లు ఎవరైనా వీవీప్యాట్ల స్లిప్‌ సాయంతో ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల నియమావళిలోని 49ఎంఏ ప్రకారం తప్పుడు ఆరోపణలు చేస్తే జరగబోయే పరిణామాలను వివరించిన తరువాత ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఓటరు నుంచి రాతపూర్వకమైన ప్రకటన రూపంలో ఫిర్యాదు స్వీకరిస్తారు. ఆ తరువాత ప్రిసైడింగ్‌ ఆఫీసర్, అభ్యర్థి /పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో ఓటు వేస్తారు. వీవీప్యాట్‌ ద్వారా వచ్చే ప్రింట్‌ను పరిశీలిస్తారు.  ఓటరు ఆరోపణ నిజమైతే ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఆ విషయాన్ని వెంటనే రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు తెలియజేస్తారు. ఓటింగ్‌ నిలిపివేస్తారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి. ఒకవేళ ఓటరు ఆరోపణ తప్పు అని రుజువైతే ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఫార్మ్‌ 17ఏలో వివరాలు నమోదు చేస్తారు. ఆ ఓటరు ఏ అభ్యర్థికి, ఏ సీరియల్‌ నంబరుకు ఓటేసిందీ నమోదు చేస్తారు. దీన్ని ధ్రువీకరిస్తూ ఓటరు నుంచి సంతకాలు సేకరిస్తారు. టెస్ట్‌ ఓట్లను నమోదు చేయాల్సిన 17సీ ఫార్మ్‌లోనూ వివరాలు నమోదు చేస్తారు.

తయారయ్యే చోటే మారిస్తే...?
ఇది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కఠినాతికఠినమైన సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ ఉంటాయి. వేర్వేరు ప్రాంతాల్లో తయారైన ఈవీఎంలను ముందుగా రాష్ట్రాలకు, ఆ తరువాత జిల్లాలకూ పంపుతారు. కొన్నేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఏ సీరియల్‌ సంఖ్య ఉంటుందో తెలియదు కాబట్టి.. అందుకు అనుగుణంగా ఫ్యాక్టరీలోనే మార్పులు చేయడమన్న ప్రశ్నే రాదు. ప్రతి ఈవీఎం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసిన కారణంగా మార్పులుచేర్పులన్నది అసాధ్యం.  

ఈవీఎంలను హ్యాక్‌ చేయడం సాధ్యమా?
అసలు సాధ్యం కాదు.  ఎన్నికల కమిషన్‌ ఇప్పటివరకూ మూడు మోడళ్ల ఈవీఎంలను తయారు చేసింది. 2006 వరకూ తయారైన ఈవీఎంలను మోడల్‌ 1 అంటారు. నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వంటివేవీ లేని ప్రోగ్రామబుల్‌ మైక్రోచిప్‌లను మాత్రమే ఇందులో వాడారు. టెక్నికల్‌ ఎవాల్యుయేషన్‌ కమిటీ సిఫారసుల మేరకు 2006 – 2012 మధ్యకాలంలో తయారైన రెండో మోడల్‌ ఈవీఎంలలో మాత్రం డైనమిక్‌ కీ కోడింగ్‌ను వాడారు. బ్యాలెట్‌ యూనిట్‌పై నొక్కిన బటన్‌కు సంబంధించిన వివరాలు పూర్తిగా సంకేత భాషలో (ఎన్‌క్రిప్టెడ్‌) కంట్రోల్‌ యూనిట్‌కు వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా రియల్‌ టైమ్‌ సెట్టింగ్‌ అనే అంశం కారణంగా బ్యాలెట్‌ యూనిట్‌పై ఏ క్రమంలో బటన్‌లు నొక్కారో  తెలిసిపోతుంది.

కంప్యూటర్ల ద్వారా పనిచేయించకపోవడం, నెట్‌వర్క్‌కు అనుసంధానం కాకపోవడం, రేడియో తరంగాలతోపాటు ఏ ఇతర విద్యుదయస్కాంత తరంగాలను పంపేందుకు, స్వీకరించేందుకు ఏర్పాట్లు లేకపోవడం, యూఎస్‌బీ లాంటివి జత చేసే ఏర్పాట్లూ లేకపోవడం వంటి కారణాల వల్ల ఈవీఎంలను హ్యాక్‌ చేయడం అస్సలు సాధ్యం కాదు.   ఈవీఎంలను కంప్యూటర్ల ద్వారా నియంత్రించరు. ఏ ఇతర పరికరంతోనూ అనుసంధానమై ఉండదు. ఇంటర్నెట్‌ లేదా నెట్‌వర్క్‌ కూడా ఉండదు. ఫలితంగా వీటిని హ్యాక్‌ చేయడం కుదరదు. ఒక పద్ధతి ప్రకారం బటన్‌లను నొక్కడం ద్వారా ఈవీఎంలకు ప్రత్యేక సంకేతాలు వెళతాయన్న మాటలోనూ వాస్తవం లేదు. ఎందుకంటే ఓటరు మీట నొక్కినప్పటి నుంచి కంట్రోల్‌ యూనిట్‌లో ఆ ఓటు నమోదు అయ్యేంతవరకూ ఇతర బటన్లు ఏవీ పనిచేయవు కాబట్టి!!   

పాశ్చాత్యదేశాల్లో బ్యాలెట్‌ పేపర్లను వాడుతున్నారా?
అమెరికాతోపాటు యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో వాడే ఈవీఎంలన్నీ కంప్యూటర్ల ద్వారా నియంత్రించగలిగేవి. గతంలో కొన్ని దేశాలు ప్రయోగాత్మకంగా ఇలాంటి ఈవీఎంలను వాడాయి. కంప్యూటర్లతో నియంత్రించడం అంటే.. మార్పులుచేర్పులకు, హ్యాకింగ్‌కు అవకాశమిచ్చినట్లే అన్నది తెలిసిందే. దీంతో అక్కడ ఓటింగ్‌ ప్రక్రియపై సందేహాలు చెలరేగాయి. అంతేకాకుండా తగినన్ని భద్రతా ఏర్పాట్లు, చట్టాల్లో మార్పుల్లేకపోవడంతో వీటి వాడకాన్ని నిలిపివేశారు.  భారత ఎన్నికల కమిషన్‌ తయారు చేసిన ఈవీఎంలలో ఈ చిక్కుల్లేవు.

బాక్సులు తెరిచి చిప్‌ మారిస్తే...?
సాధ్యం కాదు. 2013 తరువాత తయారైన ఎం3 మోడల్‌లో ఈవీఎం బాక్సులను బలవంతంగా తెరిచే ప్రయత్నాలను గుర్తించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ట్యాంపర్‌ డిటెక్షన్‌ అని పిలిచే ఈ ఫీచర్‌ వల్ల ఒకసారి ఎవరైనా  బాక్సును బలవంతంగా తెరిచే ప్రయత్నం చేస్తే ఈవీఎం పనిచేయకుండా పోతుంది. మైక్రో ప్రాసెసర్‌ స్థాయిలో మార్పులను పసిగట్టేందుకు సెల్ఫ్‌ డయాగ్నస్టిక్స్‌ అనే ఫీచర్‌ కూడా ఉంటుంది. హార్డ్‌వేర్‌ లేదా సాఫ్ట్‌వేర్‌లలో ఏవైనా మార్పులు జరిగితే ఆ విషయాన్ని వెంటనే గుర్తిస్తుంది ఇది. ఈవీఎంలను ఆన్‌ చేసిన ప్రతిసారీ ఈ సెల్ఫ్‌ డయాగ్నస్టిక్స్‌ ఫీచర్‌ పనిచేయడం మొదలవుతుంది.   

మరిన్ని వార్తలు