నిరుద్యోగ నిర్మూలనే నినాదం

25 Mar, 2019 02:41 IST|Sakshi

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో అదే కీలకాంశం: శ్యామ్‌ పిట్రోడా

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశం ఎదుర్కొనే సమస్యల్లో నిరుద్యోగమే అతిపెద్ద సమస్యని, ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అదే ప్రధాన ప్రచారాస్త్రం కానుందని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు శ్యామ్‌ పిట్రోడా అన్నారు. దేశంలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని, ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో అది కూడా ఒకటని ఆయన తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ తీవ్ర ప్రభావం చూపనుంద న్నారు. ‘‘నిరుద్యోగం.. నిరుద్యోగం.. నిరుద్యోగం.. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. కానీ, ఇప్పటికీ మనం కొత్త ఉద్యోగాలను సృష్టించలేకపోయాం. ఇప్పుడు కొత్త ఉద్యోగాలను ఏవిధంగా సృష్టించాలన్నదే నిజమైన సవాలు.

దేశంలో ఇంత భారీగా నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణం నోట్ల రద్దు, జీఎస్టీనే. ఇప్పుడు గనుక మనం నిరుద్యోగంపై దృష్టి పెట్టకపోతే ఇదో పెద్ద సమస్యగా తయారై పోతుంది’’ అని హెచ్చరించారు. కచ్చితంగా నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్‌ రూపుమాపగలదా అని ప్రశ్నించగా అందుకు సమాధానమిస్తూ...‘‘ మీరే చూస్తారుగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను. వివిధ రాజకీయపార్టీల భాగస్వామ్యంతో కూటమిని ఏర్పాటు చేసి త్వరలోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్రమోదీకి సరైన పోటీదారు అని అనుకుంటున్నారా అన్న ప్రశ్నగా...‘‘ఎన్నికల్లో పోటీని ఇద్దరు వ్యక్తుల మధ్య సవాళ్లుగా చూడొద్దని సమాధానమిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ఈ ఎన్నికలు ప్రేమకు, విద్వేషానికి మధ్య, భావజాలాలకు మధ్య జరిగే పోటీ అని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు