వెన్నుపోటు పొడిచిందెవరో తెలుసు

2 Jan, 2020 03:25 IST|Sakshi

ద్రోహం చేసిన వారికి భవిష్యత్‌లో సమాధానం

కార్యకర్తల సమావేశంలో ఈటల వ్యాఖ్యలు

హుజూరాబాద్‌/హుజూరాబాద్‌రూరల్‌: గత ఎన్నికల్లో తనకు నమ్మక ద్రోహం, వెన్నుపోటు పొడిచిందెవరో తెలుసని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం శాలపల్లి–ఇందిరానగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని దినేష్‌ కన్వెన్షన్‌ హాలులో హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలోని టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎన్నికలకు ముందు ఓ రకంగా.. గెలిచిన తర్వాత మరో రకంగా ఉంటారని పేర్కొన్నారు. క్యాంపు రాజకీయాలు తన వల్ల కాదన్నారు. గులాబీ కండువాతోనే గుర్తింపు వచ్చిందని చెప్పారు. ‘నేను మృధు స్వభావిని కావడం వల్ల చర్యలు ఆలస్యం కావచ్చు.. కానీ మోసానికి భవిష్యత్తులో సమాధానం దొరుకుతుందని’ మంత్రి పేర్కొన్నారు.

ఈ పదవి ప్రజలు తనకు పెట్టిన ఓట్ల భిక్ష అని అన్నారు.  తాను పార్టీలోకి వచ్చినప్పుడు టికెట్‌ ఆశించిన వారిలో తన కంటే 27 మంది ముందున్నారని, కానీ చివరికి టికెట్‌ తనకే దక్కిందని ఈటల గుర్తు చేశారు. డబ్బుంటే పార్టీ టికెట్‌ రాదనీ.. ప్రజల ప్రేమ ఉంటేనే వస్తుందన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు తానే బీఫాం లను ఇస్తానని చెప్పారు. రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ, చైర్మన్‌ నియామకం విషయంలో మంత్రుల ప్రమేయం ఉండదని చెప్పారు.

>
మరిన్ని వార్తలు