చప్పట్లు... దీపాలంటూ సుద్దులు

23 Jun, 2020 03:37 IST|Sakshi

కరోనాపై యుద్ధమంటూ కేంద్రం మాటలకే పరిమితమైందన్న మంత్రి ఈటల

కమిట్మెంట్‌తో పనిచేస్తుంటే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..

తెలంగాణ తెచ్చుకున్న టెస్టింగ్‌ మెషీన్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తారా?

ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలి.. నిర్లక్ష్యం పనికిరాదు

ప్రజల భాగస్వామ్యం పూర్తిస్థాయిలో ఉన్నప్పుడే కరోనా కట్టడి సాధ్యం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాపై యుద్ధమంటూ కేంద్రం మాటలకే పరిమితమైందని, చప్పట్లు కొట్టమంటూ, దీపాలు పెట్టమంటూ సుద్దులు చెప్పి పైసలివ్వకుండా చేతులు దులుపుకుందని మండిపడ్డారు. కోవిడ్‌–19 నియంత్రణ కోసం కమిట్మెంట్‌తో పనిచేస్తుంటే కొందరు నాయకులు ధర్నాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

సోమవారం వెంగళ్‌రావునగర్‌లోని ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నాతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వారంలోగా గచ్చిబౌలి హాస్పిటల్‌ను ప్రారంభించాలని, దానికి ఇన్‌చార్జిగా ప్రొఫెసర్‌ విమలా థామస్‌ను నియమించాలని ఆదేశించారు. అందులో పనిచేస్తున్న సిబ్బందిని 50% మంది ఒక వారం పాటు మరో 50% మందిని ఇంకో వారం పాటు పనిచేసే విధంగా విభజించాలని, మూడు షిఫ్ట్‌లలో సిబ్బంది ఉండాలని, రాత్రిపూట పనిచేసే సిబ్బంది బాధ్యతాయుతంగా ఉండేవారిని నియమించాలని ఆదేశించారు.

ఇచ్చింది కేవలం రూ.214 కోట్లే.. 
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం ఇప్పటివరకు కేవలం రూ.214 కోట్లు మాత్రమే నిధులు ఇచ్చి చేతులు దులుపుకుందని ఈటల విమర్శించారు. టెస్టులు తక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు వారి ప్రభుత్వం చేసిన ఘనకార్యాన్ని తెలుసుకోవాలన్నారు. రోజుకి 3,500 నుంచి 4 వేల పరీక్షలు చేయగల సామర్థ్యమున్న రోస్‌ కంపెనీకి చెందిన కొబోస్‌–8800 మెషీన్లను దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్‌ చేసిందని, మూడు మెషీన్లను కొనుగోలు చేయగా.. భారత్‌కు వచ్చిన మొదటి మెషీన్‌ను డైవర్ట్‌ చేసి కోల్‌కతాకు పంపిన కేంద్ర వైఖరిని మంత్రి తప్పుపట్టారు. వారు చేస్తున్న తప్పులు పక్కనపెట్టి పరీక్షలు తక్కువ చేస్తున్నారంటూ విమర్శలు చేయడం వారి కుసంస్కారానికి నిదర్శనమని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే కరోనా లక్షణాలను కనుక్కొని పరీక్షలు చేయించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సెకండరీ, టెర్షరీ కేర్‌ హాస్పిటల్స్‌లో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. గంటల తరబడి పేషెంట్లు వచ్చి వేచి చూసే విధానానికి స్వస్తి పలకాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో కరోనా చికిత్స కోసం వస్తున్నా పేషెంట్ల పట్ల ప్రైవేటు ఆస్పత్రులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. వారికి చికిత్స అందించాలని సూచించారు.

లక్షణాలున్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలని కరోనా పాజిటివ్‌ వచ్చిన కాంటాక్ట్‌ వ్యక్తులకు మాత్రమే పరీక్షలు చేయాలని మిగిలిన వారికి పరీక్షలు చేయొద్దని చెప్పారు. ఐసీఎంఆర్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. 104, 108ల పనితీరుపై కూడా మంత్రి సమీక్షించారు. మరింత పకడ్బందీగా కాల్‌ సెంటర్లు నిర్వహించాలని ఆదేశించారు. హాస్పిటల్స్‌లో బెడ్లు లేక ఇబ్బంది పడేవారు, కరోనా గురించి ఇబ్బందులు తలెత్తిన వారు 104కి ఫోన్‌ చేయాలని ప్రజలకు సూచించారు. హోమ్‌ ఐసోలేషన్‌లోనున్న వారి కోసం టెలిమెడిసిన్‌ విభాగం మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు.

అందరూ జాగ్రత్త.. నిర్లక్ష్యం తగదు 
ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ల్యాబ్‌ల్లో ఇప్పటివరకు 2,290 పరీక్షలను ప్రతిరోజు చేస్తుండగా.. వారం రోజుల్లో మరో 4,310 పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకొని రోజుకు 6 వేల 6 వందలు పరీక్షలు చేయనున్నామని ఈటల ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కోల్‌కతాకు మెషీన్‌ తరలించకుండా ఉంటే మరో 4 వేల పరీక్షలు చేసే సామర్థ్యం తెలంగాణకు ఉండేదని గుర్తు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ వైరస్‌ నాకు సోకదు.. అనే నిర్లక్ష్యం తగదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే కరోనా కట్టడి సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. బాధితులందరికీ చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని వాటిని పూర్తిస్థాయిలో ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు