‘నా మంత్రి పదవి ఎవరి భిక్ష కాదు’

29 Aug, 2019 20:13 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ నుంచి తప్పిస్తారని వస్తున్న ఊహాగానాలను కొట్టి పారేస్తూ.. మంత్రి పదవి ఎవరి భిక్ష కాదన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చిన వాడిన కాదని, గులాబీ జెండా ఓనర్లలో ఒకడినని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి నుంచైనా రూ.5వేలు లంచం తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. తాను బీసీని కాబట్టి కుల ప్రాతిపదికన మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు. 

‘తెలంగాణ ఆత్మగౌరవం కోసం నేను పోరాటం చేశాను. ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల తరపున పోరాడాను. నన్ను చంపాలని రెక్కీ నిర్వహించినా కూడా తెలంగాణ జెండా పట్టుకొని ఎదురెళ్లాను. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడిన వ్యక్తిని. పార్టీలోకి మధ్యలోకి వచ్చిన వాడిని కాదు. గులాబీ జెండా ఓనర్లం. పదవులను అడుక్కునే వాడిని అసలే కాదు. నా తల్లిదండ్రులు రాజకీయాల్లో లేకున్నా అనామకుడిగా వచ్చి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నా మంత్రి పదవి ఎవరి భిక్షా కాదు. బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు. అధికారం శాశ్వతం కాదు ధర్మం, న్యాయం శాశ్వతం. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప నాయకులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కుహానావాదులు, సంకుచిత బుద్ధితో వ్యవహరించేవారు జాగ్రత్తగా ఉండాలి. సొంతంగా ఎదగలేని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరు హీరోనో ఎవరు జీరోనో త్వరలో తెలుస్తుంది’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు