భవిష్యత్తులో ఉచితంగా అవయవ మార్పిడి

20 Sep, 2019 02:45 IST|Sakshi

అసెంబ్లీలో మంత్రి ఈటల రాజేందర్‌

సాక్షి, హైదరాబాద్‌: పేదరోగులకు ఓ శుభవార్త. అవయవమార్పిడి చికిత్సను ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కిడ్నీ, లివర్, తలసేమియా చికిత్సలతోపాటు అవయవమార్పిడి సేవలకు ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు కల్పించనున్నట్టు మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఆ మేరకు ప్రభుత్వాసుపత్రులను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే తొలిసారి ప్రభుత్వాసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. పేదలకు ఆ సేవలు ఉచితంగా అందుతాయన్నారు. పద్దులపై చర్చలో భాగంగా గురువారం వైద్య, ఆరోగ్య శాఖపై ఆయ న సమాధానమిచ్చారు. ఒక్కో మెడికల్‌ కాలేజీలో ఒక్కో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందని, అది ఒక్కోటి గాంధీ ఆసుపత్రితో సమంగా ఉంటుందన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా సాయంత్రంవేళ ఓపీ సేవలు నిర్వహిస్తున్నామని, 541 హెల్త్‌ క్యాంపులు నిర్వహించామన్నారు. వైద్యులు సెలవులు రద్దు చేసుకున్నారని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, ఈ సందర్భంగా సిబ్బంది సేవలకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. 

ఒక్కో బెడ్‌పై ఇద్దరుండటం శుభసూచకమా?
మంత్రి మాటలపై కాంగ్రెస్‌ పక్షనేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కో బెడ్‌పై ఇద్దరుండటం శుభసూ చకం కాదని, రోగుల సంఖ్య విపరీతంగా ఉందని అర్థమన్నారు. మానవీయ కోణంలో ఆలోచించే వ్యక్తిగా పేరున్న ఈటల చేతికి వైద్యశాఖ వస్తే తీరు మారుతుందని జనం సంతోషించారని, కానీ బడ్జె ట్‌ చూస్తే పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని అన్నారు. వానాకాలం రాకముందే ప్రభుత్వం అప్రమత్తమై ఉంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం వ్యాధిగ్రస్థమై ఉండేది కాదన్నారు. సాయంత్రం వేళ ఓపీ నిర్వహించటం గొప్ప కాదని కొట్టిపడేశారు.  
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు