అవినీతి పోవాలి.. మార్పు రావాలి

1 Apr, 2019 08:38 IST|Sakshi
ఇళ్ల వెంకటేశ్వరరావు

సాక్షి, అమరావతి : ‘ఐవీ’గా ఉపాధ్యాయ, ఉద్యోగ లోకానికి సుపరిచితులైన ఇళ్ల వెంకటేశ్వరరావు సాధారణ బడి పంతులు. యూటీఎఫ్‌ అధ్యక్షుడిగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. సచివాలయానికి సైతం ఆయన మోటర్‌ సైకిల్‌ మీదే వచ్చేవారు. యూటీఎఫ్‌ అధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తయిన వెంటనే.. మళ్లీ స్కూల్లో టీచర్‌గా చేరారు. తూర్పుగోదావరి జిల్లా అయినవెల్లి మండలం సిరిపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్లో సోషల్‌ టీచర్‌గా పనిచేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వర్తమాన రాజకీయ పరిస్థితులపై వెంకటేశ్వరరావు విశ్లేషణ ఆయన మాటల్లోనే.. 

అవినీతి రాజకీయాలు అంతం కావాలి 
ఎన్నికల సంస్కరణల వల్ల మార్పు వస్తుందనుకోవడం లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంపాదించిన అవినీతి సొమ్ము వెదజల్లి ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నించడమే అసలు సమస్య. ఓటర్లు తమకు సొమ్ము కావాలని కోరుకోవడం లేదు. ఇస్తే వద్దనడం లేదు. అధికారం కావాలనే తాపత్రయంతో రాజకీయ పార్టీలే ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నాయి. రాజకీయ పార్టీలు నడుం బిగించి.. డబ్బులు నియంత్రిస్తే తప్ప ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గదు.  


ప్రభుత్వంలోనే కార్పొరేట్‌ శక్తులున్నాయి 
కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం నియంత్రించాలి. కానీ ప్రభుత్వంలోనే కార్పోరేట్‌ శక్తులు భాగమై ఉన్నప్పుడు.. నియంత్రణ ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వంలో నారాయణ మంత్రిగా ఉన్నారు. మరికొంత మంది కార్పొరేట్‌ విద్యాసంస్థల యజమానులు పలు పదవుల్లో ఉన్నారు. ప్రభుత్వంలో నేరుగా భాగం కాకపోయినా, కార్పోరేట్‌ విద్యాసంస్థల యజమానులు పరోక్షంగా ప్రభుత్వ పెద్దలతో అంటకాగుతున్నారు. ఇక నియంత్రించేది ఎవరు? అధికారుల స్థాయిలో నియంత్రణ సాధ్యం కాదు. స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో అధికారులు ఫీజుల నియంత్రణ గురించి హడావుడి చేస్తారు. తర్వాత పట్టించుకోరు. తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నా.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. 

వాళ్లు వెలగబెడుతుందేమీ లేదు 
వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటున్న కార్పొరేట్‌ స్కూళ్లేమీ గొప్పగా లేవు. వాళ్లు వెలగబెడుతుందేమీ లేదు. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లిష్‌ మీడియం పెట్టారు. కార్పొరేట్‌ వ్యవస్థను బద్దలు కొట్టాలంటే.. ప్రభుత్వ స్కూళ్లలోనూ మంచి విద్య అందుబాటులో ఉండే విధంగా విద్యావ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయాలి. ప్రైవేటు రంగంలో చిన్నపాటి విద్యాసంస్థల యాజమాన్యాలూ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. లంచాల రూపంలో అధికారులు వసూళ్లు చేస్తున్నారు. విద్యుత్‌ చార్జీలు భరించలేకపోతున్నామని యాజమాన్యాలు వాపోతున్నాయి. సిబ్బంది జీతాల గురించి మాట్లాడేవారు లేరు. కనీస వేతన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టం ఉంటే కనీస వేతనాలు ఇస్తారని కాదు... చట్టం అంటూ ఉంటే అడగడానికి అవకాశమైనా ఉంటుంది.

విద్యాహక్కు చట్టం వచ్చినా.. 
కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యాహక్కు చట్టం తెచ్చినా ప్రభుత్వ విద్యారంగంలో పెద్దగా మార్పు రాలేదు. బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు పెరగాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి విద్య అందుబాటులో ఉందనే నమ్మకం ప్రజల్లో పెరగాలి. ఆ నమ్మకం కలిగితేనే.. సర్కారీ స్కూళ్లు బాగుపడినట్టు లెక్క. 

ప్రైవేటు స్కూళ్లను మింగేస్తున్నాయి 
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లు మింగేశాయి. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారు. తర్వాత కార్పొరేట్‌ స్కూళ్లు వచ్చాయి. నగరాల్లో ప్రైవేటు స్కూళ్లను మింగేశాయి. తర్వాత చిన్న పట్టణాలకూ విస్తరించి అక్కడి చిన్నపాటి ప్రైవేటు స్కూళ్లను మింగేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లే విద్యా వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకున్నాయి.   

మరిన్ని వార్తలు