సీఈసీ ముందు పరేడ్‌!

15 Dec, 2018 02:05 IST|Sakshi

ఈవీఎం మోసాలపై కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లాలనికాంగ్రెస్‌ నిర్ణయం

 ఓడిన అభ్యర్థులతో ఫిర్యాదు చేయించాలని యోచన

పార్టీ ఓటమిపై గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌ అధ్యక్షతన సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం మోసాలు, ఎన్నికల అధికారుల తీరును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)దృష్టికి తీసుకెళ్లాలని టీపీసీసీ నిర్ణయించింది. అవసరమైతే ఎన్నికల్లో పోటీ చేసిన తమ అభ్యర్థులందరినీ ఢిల్లీ తీసుకెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేయించాలని యోచిస్తోంది. ప్రభుత్వం రద్దయిన నాటి నుంచి కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించిందని, వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై విన్నవించినా పట్టించుకోలేదని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాలనే నిర్ణయానికొచ్చింది. శుక్రవారం గాంధీభవన్‌లో ఎన్నికల ఓటమిపై కాంగ్రెస్‌ సమీక్షించింది.

ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, జీవన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, ప్రేమ్‌సాగర్‌రావు, ఆరేపల్లి మోహన్, రమేశ్‌ రాథోడ్, తాహెర్‌బిన్, ఆత్రం సక్కు, అద్దంకి దయాకర్‌ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మూడు దశలుగా సమీక్షించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తో పాటు ఇతర అంశాలపైనా నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. తన నియోజకవర్గం మంచిర్యాలలో 4 గంటలకే పోలింగ్‌ పూర్తి చేశారని, ఆ సమయంలో జరిగిన పోలింగ్‌ కన్నా కౌంటింగ్‌ సమయంలో చూపిన ఓట్ల శాతం ఎక్కువగా ఉందని ప్రేమ్‌సాగర్‌రావు వివరించారు.

త్రిసభ్య కమిటీతో అధ్యయనం..
ఎన్నికల్లో ఈవీఎం మోసాలపై తేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీనియర్‌ నేత ప్రేమ్‌సాగర్‌రావులతో కమిటీని ఏర్పాటు చేశారు. ధర్మపురి, కోదాడ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, మంచిర్యాల స్థానాల్లో పోలింగ్‌ స్టేషన్ల వారీగా నమోదైన ఓట్లు, కౌంటింగ్‌ నివేదికలను ఈ కమిటీ తెప్పించుకుని అధ్యయనం చేయనుంది. ఇక్కడ పరిశీలనలోకి వచ్చే అంశాలతో అవసరాన్ని బట్టి కోర్టులకు వెళ్లాలని నిర్ణయించింది. పోటీ చేసిన అభ్యర్థులందరితో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి, న్యాయం చేసేలా ఒత్తిడి తేవాలని నేతలు భేటీలో నిర్ణయించారు.

ఓట్ల గల్లంతుపైస్పందన కరువు...
నర్సాపూర్‌ నియోజకవర్గంలో మధ్యాహ్నం సమయానికి 8.83 శాతం పోలింగ్‌ జరగ్గా, సాయంత్రానికి 70 శాతం పోలింగ్‌ అయినట్లు చూపారని, ఒక్కో ఓటు వేయాలంటే కనీసం నిమిషం సమయం పట్టినా, అంత తక్కువ సమయంలో ఓటింగ్‌ శాతం ఎలా పెరిగిందో అర్థం కావట్లేదని సునీతా లక్ష్మారెడ్డి వివరించారు. హైదరాబాద్‌లో 22 లక్షల ఓట్ల గల్లంతుపై ఎంత పోరాడినా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదని, చివరికి క్షమాపణతో సరిపెట్టిందని వివరించారు. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ అభ్యర్థులపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఉందని, వారెక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు అడ్డగించారని, అలాంటి నేతలకే 30 నుంచి 40వేల మెజారిటీలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. తక్కువ మెజార్టీతో ఓడిన తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, ధర్మపురి వంటి నియోజకవర్గాల్లో వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని కోరినా పట్టించుకోలేదన్న అభిప్రాయాలను వెలిబుచ్చారు.
 

మరిన్ని వార్తలు