2జీ తీర్పు: ఇక ఆయన భరతం పట్టాలి!

21 Dec, 2017 18:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్‌ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ.. మాజీ కంప్ట్రోలర్‌, ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వినోద్‌ రాయ్‌ను టార్గెట్‌ చేసింది. 2జీ స్కాం విషయంలో మాజీ కాగ్‌ వినోద్‌ రాయ్‌ తీరు కాగ్‌ చరిత్రలోనే నల్లమచ్చగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో వినోద్‌ రాయ్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

'గతంలో తాను చేసిన పనికి మాజీ కాగ్‌ ఏవిధంగా ప్రతిఫలం పొందుతున్నారో ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఆయన ప్రభుత్వానికి బలమైన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. పలు బోర్డుల్లో, సంస్థల్లో పదవులు పొందారు. ఇది కాగ్‌ చరిత్రలోనే నల్లమచ్చగా మిగిలిపోతుంది' అని కాంగ్రెస్‌ నేత వడక్కన్‌ మీడియాతో అన్నారు. వినోద్‌ రాయ్‌ను దర్యాప్తు ఏజెన్సీలు వెంటనే ప్రాసిక్యూట్‌ చేయాలని, ఆయనపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2జీ కుంభకోణంతో దేశ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అప్పట్లో కాగ్‌గా ఉన్న వినోద్‌ రాయ్‌ నివేదించిన సంగతి తెలిసిందే. 

2జీ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న కేంద్ర టెలికం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినోద్‌ రాయ్‌ దేశానికి క్షమాపణ చెప్పాలని, ఆయన ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పదవులన్నింటి నుంచి తప్పుకోవాలని వీరప్పమొయిలీ డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు