-

చిచ్చురేపిన టికెట్ల లొల్లి.. సీనియర్‌ నేత రాజీనామా

5 Oct, 2019 16:03 IST|Sakshi
అశోక్‌ తన్వర్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, చంఢీగఢ్‌: వరుస ఓటములు,  అంతర్గత కలహాలతో తికమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఊహించని షాక్‌ తగిలింది. ఆ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత అశోక్‌ తన్వర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ.. రెండు రోజుల కిందట పీసీపీ పదవి నుంచి వైదొలిగిన అశోక్‌.. తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నాలుగు పేజీల సుదీర్ఘ లేఖను రాశారు. పార్టీలోని అంతర్గత కలహాలా కారణంగా.. సిద్ధాంతాలు పూర్తిగా దారితప్పాయాని, గ్రూపు రాజకీయాలతో పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరిందని లేఖలో పేర్కొన్నారు.
చదవండి: కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

కాగా రాష్ట్రంలో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ పార్టీ చీఫ్‌ సోనియా నివాసం ఎదుట తన్వర్‌ అనుచరులు కొందరు బుధవారం నిరసన తెలిపిన విషయం తెలిసిందే. హరియాణాలో పార్టీ ‘హూడా కాంగ్రెస్‌’గా మారిపోయిందని మాజీ సీఎం భూపీందర్‌ హూడాపై సోనియా గాంధీకి రాసిన లేఖలో తన్వర్‌ ఆరోపించారు. ఆయనకు గులాంనబీ ఆజాద్‌ అండగా ఉన్నారన్నారు. గత ఐదేళ్లుగాపార్టీకి ద్రోహం చేసిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. 90 టికెట్లలో 50 వరకు తనవారికే హూడా కేటాయించుకున్నారని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశతో పార్టీ ఎన్నికల కమిటీల నుంచి రాజీనామా చేస్తున్నానని, ఇకపై సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాజాగా పార్టీకి పూర్తిగా రాజీనామా చేశారు. కాగా ఆయన ఏ పార్టీలో చేరుతారనేది తెలియాల్సి ఉంది. బీజేపీ నేతలతో ఇదివరకే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు