అలా చేస్తే నా భార్య వదిలేస్తుంది: రఘురామ్‌ రాజన్‌

26 Apr, 2019 11:59 IST|Sakshi
రఘురామ్‌ రాజన్‌

న్యూఢిల్లీ : రాజకీయాల్లోకి వస్తే తన భార్య వదిలేస్తుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలపై ఆయన స్పందించారు. రాజకీయాల కన్నా తనకు కుటుంబ జీవతమే ముఖ్యమన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘నేను రాజకీయాల్లోకి వెళ్తే.. నా భార్య నాతో సంసారం చేయనని చెప్పింది. రాజకీయాలు ఎక్కడైనా ఒకే విధంగా ఉంటాయి. బలమైన కారణం ఏది లేకపోయినప్పటికి నాకు మాత్రం రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. కొందరు తమ వ్యాక్చాతుర్యంతో ఓట్లను పొందుతారు. అలాంటి నైపుణ్యం నాకు లేదు. నేను ఏ పార్టీకి మద్దతుగా ఉండను. నా రచనలు అన్నీ పార్టీలకు అతీతంగానే ఉంటాయి. నాకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తిలేదు.  నాకు ఉద్యోగం అంటేనే ఇష్టం. ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధులతో నేను సంతోషంగా ఉన్నాను. కాంగ్రెస్‌ కనీస ఆదాయ పథకంతో ఎన్నో లాభాలున్నాయి. పేదలకు నగదు అందజేయడం వల్ల వారికి కావాల్సినవి వారే తీసుకుంటారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి దక్కుతుందని చాలా ఊహాగాలను వస్తున్నాయి. వాటిని నేను ఆపలేను. నేనెక్కడుంటే అక్కడ వాతావరణం సంతోషంగా ఉండేలా చూసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు. 

2013 సెప్టెంబర్‌ నుంచి 2016 సెప్టెంబర్‌ దాకా రిజర్వ్‌ బ్యాంక్‌ 23వ గవర్నర్‌గా రాజన్‌ సేవలందించిన విషయం తెలిసిందే. రాజన్‌ పదవీకాలాన్ని పొడిగించడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో భాగమైన బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. విపక్షాల కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్థిక మంత్రిగా రాజన్‌నే ఎంపిక చేసే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనీస ఆదాయ పథక రూపకల్పన విషయంలో సలహాలు, సూచనలు తీసుకున్న ప్రముఖ ఆర్థికవేత్తల్లో రాజన్‌ కూడా ఉన్నారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పడం కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో రాజన్‌ తాజా వివరణనిచ్చారు. తాను ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధులతో సంతోషంగానే ఉన్నానని, రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
 

>
మరిన్ని వార్తలు