మోదీ సర్కార్‌కు వచ్చే సీట్లు ఎన్ని?

20 May, 2019 15:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడడంతో సగం ఉత్కంఠకు తెరపడింది. దాదాపు అన్ని సర్వేలు కేంద్రంలో రానున్నది మళ్లీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వమేనని సూచించాయి. ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన 272 మ్యాజిక్‌ ఫిగర్‌కు దాటే బీజేపీకి సీట్లు వస్తాయని అన్ని సర్వేలు అంచనా వేశాయి. అందరికన్నా ఎక్కువ ఎన్డీయే కూటమికి 368 సీట్లు వస్తాయని ఆక్సిస్‌ సర్వే అంచనా వేసింది. అంటే 2014 ఎన్నికలకన్నా 32 సీట్లు ఎక్కువ వస్తాయని. నరేంద్ర మోదీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని తేలిపోయాకా బీజేపీకి 272 సీట్లు దాటుతుందా? 350 సీట్లు దాటుతాయన్నది ప్రస్తుతానికి అప్రస్తుతమే!

అయితే అధికారంలోకి వచ్చాక ఏ విషయంలోనైనా రాజ్యాంగ సవరణలు తీసుకరావాలంటే పాలక పక్షానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాల్సిందే. అందుకు ఖచ్చితంగా గెలుచుకున్న అధిక స్థానాలు ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ నిక్కచ్చిగా నిజమవుతాయని విశ్వసించడానికి వీల్లేదు. 2004, 2009, 2014 ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పలు ఎన్నికల సర్వేల ఫలితాలకు, వాస్తవ ఫలితాలు ఎంతో దూరంగా ఉన్నాయి. విశ్వసనీయంకాని ఒకటి, రెండు సర్వేలు మాత్రమే నాడు నిజమని తేలాయి. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీకి అనుకూలంగా పవనాలు బలంగా వీచిన 2014 ఎన్నికల్లోనే బీజేపీకి 282 సీట్లు వచ్చాయి. ఈసారి అనుకూల పవనాలు అంతగా లేకపోవడమే కాకుండా యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాల్లో వ్యతిరేకత కూడా ఎంతో కనిపించింది. అలాంటప్పుడు గత ఎన్నికల కన్నా ఈసారి బీజేపీ అత్యధిక సీట్లు రావడం ఆశ్చర్యకరమే!

ఈసారి ఎన్నికల్లో ఎన్డీయేకు 48.5 శాతం ఓట్లు వస్తాయంటూ ‘సీఎన్‌ఎన్‌–న్యూస్‌ 18’తరఫున ఎగ్జిట్‌ పోల్‌ సర్వే జరిపిన ఇప్సోస్‌ చెప్పడం అసాధారణం. 48.5 శాతం ఓట్లతో 336 సీట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. గతం కన్నా పది శాతం ఓట్లు ఎక్కువ వస్తాయని అంచనా వేసింది. అదే సీట్లు గతంలోలాగా 336 వస్తాయని పేర్కొంది. అదెలా సాధ్యం ? పైగా వివిధ సర్వే సంస్థలు అంచనా వేసిన పోలింగ్‌ శాతానికి, వచ్చే సీట్ల సంఖ్యకు కూడా పొంతన కుదరడం లేదు.

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు ‘హార్ట్‌ల్యాండ్‌’గా పరిగణించే యూపీ, బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, తొమ్మిది రాష్ట్రాల్లో గతంలో 252 సీట్లు వచ్చాయి. వీటిలోని మూడు రాష్ట్రాల్లో గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత యూపీలో ఎస్పీ–బీఎస్పీ పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం గణనీయమైన పరిణామం. వీటి ప్రభావం యూపీలో బాగా ప్రస్ఫుటంగా కనిపించాలి. ఈ రాష్ట్రం విషయంలో పలు సర్వేల ఫలితాలు భిన్నంగానే కాకుండా పరస్పర భిన్నంగా ఉన్నాయి. యూపీలో నీల్సన్‌ ఎన్డీయే కూటమికి 22 సీట్లు వస్తాయని నీల్సన్, 65 సీట్లు వస్తాయని ఆక్సిస్‌ సంస్థ అంచనా వేశాయి. 

తూర్పు రాష్ట్రాల ఫలితాలు భిన్నం
తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని పలు సర్వేలు సూచించాయి. కొన్ని సర్వేలయితే పాలకపక్షాలకన్నా అధికంగా కూడా వస్తాయని అంచనావేశాయి. గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీకి రెండు సీట్లు రాగా, ఈసారి నాలుగు సీట్లు మొదలుకొని 23 సీట్ల వరకు వస్తాయని అంచనా వేశాయి. బీజేపీకి పెద్దగా ప్రభావంలేని ఒడిశా రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటురాగా, ఈ సారి ఏడు నుంచి 17 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అదే గత ఎన్నికల్లో 20 సీట్లు కలిగిన బీజేడీకి నాలుగు నుంచి 13 సీట్లు తగ్గుతాయని వివిధ సంస్థలు భిన్నంగా అంచనా వేశాయి. ఎలాంటి ప్రజావ్యతిరేకత లేని బీజేడీకి ఇన్ని సీట్లు తగ్గడం అన్నది ఆశ్చర్యకరమే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీతో నవీన్‌ పట్నాయక్‌ ఐదోసారి ముఖ్యమంత్రి అవుతారని పలు ముందుస్తు, ఎగ్జిట్‌ సర్వేలు కూడా తేల్చాయి. అలాంటప్పుడు రాష్ట్ర అసెంబ్లీ విషయంలో, కేంద్రం విషయంలో తేడా చూపించాల్సినంత అవసరం ఆ రాష్ట్ర ప్రజలకు లేదు. 

గత ఎన్నికల్లోలాగా ఈసారి ఎన్నికల సందర్భంగా మోదీ హవా కనిపించలేదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ఉద్యోగులు రోడ్డున పడడమే కాకుండా నిరుద్యోగుల శాతం కూడా పెరగింది. చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు చెప్పుకునే స్థాయిలో విజయవంతం కాకపోవడంతో మోదీ జాతీయవాదాన్ని, బాలకోట్‌ సర్జికల్‌ స్ట్రక్స్‌ను ముందుకు తీసుకొచ్చారు. రాను, రాను ప్రతిపక్షాలపై వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం దేశంలో దాదాపు ఇదే మొదటిసారి. దాంతో కూడా మోదీ ప్రభావం మరింత తగ్గిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. సర్వేల్లో అంచానా వేసిన పోలింగ్‌ శాతానికి, సీట్ల శాతానికి ఎక్కడా పొంతన లేని కారణంగా ఈసారి మౌన ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు అర్థం అవుతుంది. వారి వల్ల ఎగ్జిట్‌ ఫలితాలు తలకిందులు కాకపోవచ్చుగానీ, పాలకపక్షానికి సీట్ల సంఖ్య తగ్గి హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు