ఎన్డీఏ మోదం.. విపక్షాల ఖేదం

21 May, 2019 04:38 IST|Sakshi
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలకు ఏర్పాట్లు, వెలవెలబోతున్న ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం

ఎగ్జిట్‌ పోల్స్‌ నేపథ్యంలో భిన్న వాతావరణం

ప్రధాని మోదీ స్పష్టమైన మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని దాదాపుగా అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడించడంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తుది ఫలితాలు సైతం ఇలాగే ఉంటాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌లో నిరాశాజనకమైన ఫలితాలతో విపక్షాలు డీలా పడ్డాయి.  పలువురు నేతలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను తోసిపుచ్చారు. ఊహాజనిత, మోసపూరిత ఫలితాలుగా పేర్కొన్నారు.

నేడు ఎన్డీయే డిన్నర్‌ భేటీ
ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం
న్యూఢిల్లీ/పాట్నా: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కౌంటింగ్‌కు రెండురోజుల ముందు మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మిత్రపక్షాల నేతలతో డిన్నర్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సోమవారం నాడిక్కడ వెల్లడించాయి. బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితిశ్‌కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే, లోక్‌ జనశక్తి పార్టీ నేత రాం విలాస్‌ పాశ్వాన్‌లు కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మిత్ర పక్షాలతో భేటీకి ముందు కేంద్ర మంత్రులు సహా బీజేపీ కీలక నేతలు పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 సీట్లకు మించి ఎన్డీయే గెలుచుకుంటుందని దాదాపుగా అన్ని ప్రధాన న్యూస్‌ ఛానెళ్ల ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. అయితే 2014 నాటి ఫలితాలే (282 సీట్లు) పునరావృతమవుతాయని, బీజేపీ సొంతంగా ఈ మెజారిటీ సాధిస్తుందని పలువురు బీజేపీ నేతలు సోమవారం పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ మాట్లాడుతూ.. అవే ‘తుది నిర్ణయం’ కాదు కానీ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనడానికి అవి సంకేతాలని పేర్కొన్నారు. పలు ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగానే తుది ఫలితాలుంటాయని మరో మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. తాము మొదటినుంచీ చెబుతున్నదే నిజమవుతోందని, 300 మార్కును దాటడం ఖాయమని బీజేపీ మీడియా సెల్‌కు చెందిన జితేంద్ర రావత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.  

సంబరాలకు సన్నాహాలు
కాగా ఫలితాల వెల్లడి అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పెద్దయెత్తున విజయోత్సవాలు జరిపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. కార్యకర్తలు ఈ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. న్యూస్‌ 18–ఐపీఎస్‌ఓఎస్, ఇండియా టుడే–యాక్సిస్, న్యూస్‌24–చాణక్య వరసగా 336, 339–368, 336–364 సీట్లు ఎన్డీయేకి వస్తాయని అంచనా వేశాయి. బీజేపీ మరోసారి సొంతగా మెజారిటీ సాధించే అవకాశముందనే సంకేతాలిచ్చాయి. అయితే ఏబీపీ న్యూస్‌–నీల్సన్‌ (267), నేతా న్యూస్‌ ఎక్స్‌(242)లు మాత్రం అధికార కూటమికి మెజారిటీకి అవసరమైన సీట్లు రాకపోవచ్చని అంచనా వేశాయి.

ఊహాజనితం .. మోసపూరితం  
ఎగ్జిట్‌ పోల్స్‌పై విపక్షాల సందేహం
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై విపక్ష పార్టీలు సందేహం వ్యక్తం చేశాయి. ఈవీఎంలను మేనేజ్‌ చేసే ఎత్తుగడగా పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నిసార్లూ నిజం కాబోవని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ చెప్పారు. ఇటీవలి ఆస్ట్రేలియా ఎగ్జిట్‌ పోల్స్‌ను ఆయన ఉదహరించారు. ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు కావచ్చనే భయంతో దేశంలో చాలామంది నిజం చెప్పరు. వేచి చూద్దాం.. అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘ఊహాగానాల ఆధారిత ఊహాగానం’ను విశ్వసించాల్సిన పనిలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.

అవి మోసపూరిత ఫలితాలని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌ వ్యాఖ్యానించారు. టీఎంసీ కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను కొట్టేసింది. నూతన ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషిస్తామని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ విశ్వాసం వ్యక్తం చేసింది. అవసరమైతే ప్రాంతీయ పార్టీలను ఆకర్షించేందుకు వీలుగా ‘కృత్రిమంగా రూపొందించిన లేదా తయారు చేసిన’ మోదీ గాలిగా కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అభివర్ణించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి కూడా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ఒక అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దేలా ఉంటాయని అన్నారు.  

బోసిపోయిన కాంగ్రెస్‌ కార్యాలయం
కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం సోమవారం బోసిపోయి కన్పించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ సృష్టించిన తప్పుడు వాతావరణమే ఇందుకు కారణమని అక్కడ ఉన్న కొందరు కార్యకర్తలు చెప్పారు.  బీజేపీ అనుకూల వాతావరణం సృష్టించి ఈవీఎంలను మేనేజ్‌ చేసేందుకు వారు ప్రయత్నించే అవకాశముందని ఆరోపించారు.  

మాయావతి, అఖిలేశ్‌ మంతనాలు
రాజకీయంగా ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల వెల్లడితో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది.  సోమవారం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ బహజన్‌సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతితో దాదాపు గంటపాటు రహస్య మంతనాలు జరిపారు.  కాగా, యూపీలో బీజేపీకే ఆధిక్యం రానుందన్న వార్తల ప్రభావం సమాజ్‌వాదీ పార్టీపై కనిపించింది. నిత్యం బిజిగా కనిపించే ఎస్‌పీ కార్యాలయం ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడి నేపథ్యంలో బోసిపోయింది.

మరిన్ని వార్తలు