బీసీ క్రీమీ లేయర్‌పై నిపుణుల కమిటీ

26 Jun, 2019 16:52 IST|Sakshi

రాజ్యసభలో ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

సాక్షి, న్యూఢిల్లీ : సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వర్గాలలో క్రీమీ లేయర్‌ నిర్ధారణకు సంబంధించి ఉత్పన్నమవుతున్న సమస్యల పరిశీలన కోసం ఈ ఏడాది మార్చి 8న  మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి బీపీ శర్మ అధ్యక్షతన ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి బుధవారం రాజ్య సభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.

నిపుణుల సంఘం విధి విధానల గురించి మంత్రి తన జవాబులో వివరిస్తూ వెనుకబడిన తరగతులలో క్రీమీ లేయర్‌ (ఆర్థికస్థితి మెరుగ్గా ఉన్నవారు) నిర్ధారణ కోసం గతంలో నియమించిన ప్రసాద్‌ కమిటీ అనుసరించిన ప్రాతిపదికను లోతుగా పరిశీలిస్తుందని చెప్పారు. ఇందిరా సహానీ కేసులో సుప్రీం కోర్టు వెల్లడించిన  అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్రీమీ లేయర్‌ విధానాన్ని సరళతరం, క్రమబద్ధీకరించే దిశగా తగిన సిఫార్సులు చేయడం శర్మ కమిటీకి నిర్దేశించిన విధి విధానాలలో ఒకటని మంత్రి చెప్పారు.

అలాగే కేటగిరీ 2 సీ కింద ప్రభుత్వ రంగ సంస్థలలో బీసీలకు ఉద్యోగ ఖాళీల సంఖ్యను నిర్ధారించడానికి కూడా తగిన సిఫార్సులను ఈ నిపుణుల కమిటీ చేస్తుందని చెప్పారు. క్రీమీ లేయర్‌కు సంబంధించి సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్ధులు దాఖలు చేసిన అపరిష్కృత కేసులను శర్మ కమిటీ పరిశీలిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం బీసీ సర్టిఫికెట్‌ సమర్పించిన అభ్యర్ధులలో క్రీమీ లేయర్‌ వారిని గుర్తించి తొలగించడానికి అనుసరించవలసిన ఆచరణ సాధ్యమైన విధానాన్ని ఈ కమిటీ రూపొందిస్తుందని మంత్రి చెప్పారు. 2017 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరైన బీసీ అభ్యర్ధుల సర్టిఫికెట్లను యూపీపీఎస్‌సీ తిరస్కరించిన నేపథ్యంలో తిరస్కరణకు గురైన ప్రతి  కేసుపై  ఆయా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన మీదట ఈ కమిటీ నిర్దిష్టమైన సిఫార్సు చేస్తుందని మంత్రి వివరించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా