బీజేపీలో చేరిన కేంద్రమంత్రి

24 Jun, 2019 18:36 IST|Sakshi

అధికారికంగా బీజేపీలో చేరిన ఎస్‌ జైశంకర్‌

త్వరలో రాజ్యసభకు ఎన్నిక

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖమంత్రి ఎస్‌ జైశంకర్‌ అధికారికంగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సోమవారం పార్టీ కండువా కప్పుకున్నారు. గత ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా సుష్మా స్వరాజ్‌ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. ఆయన (2015) భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సుష్మా దూరంగా ఉన్నారు. జైశంకర్‌ అనుభవం, సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో.. ప్రధాని మోదీ ఆయనను విదేశాంగమంత్రిగా నియమించారు. దీంతో ఆరు నెలలలోపు ఆయన పార్లమెంట్‌కు ఎన్నిక కావాల్సి ఉంది. గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతారని సమాచారం.

2014 నుంచి మోదీ ప్రభుత్వంతో ఆయన మంచి సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే జైశంకర్‌ను 2015లో భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా బీజేపీ ప్రభుత్వం నియమించింది.  డోక్లాంపై భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న వివాదం శాంతియుతంగా పరిష్కరించడంలో.. పుల్వామా దాడుల తర్వాత బాలాకోట్‌పై వాయుసేన దాడులు.. పాకిస్తాన్‌లో చిక్కుకున్న అభినందన్ వర్ధమాన్‌ను భారత్ తిరిగి రప్పించడంలో జై శంకర్ కృషి ఎంతో ఉంది. ఆయన ప్రతిభ పాటవాలు స్వయంగా చూసిన మోదీ విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలను అప్పగించారు. 

మరిన్ని వార్తలు