‘ఫేస్‌బుక్‌’కే ఎక్కువ ఎన్నికల యాడ్స్‌

8 Apr, 2019 20:04 IST|Sakshi

సాక్షి, న్యూడిల్లీ : పత్రికలు, రేడియో, టీవీ ఛానళ్లతోపాటు సోషల్‌ మీడియాలో కూడా ఎన్నికల ప్రచార యాడ్స్‌ జోరందుకున్నాయి. సామాజిక మాధ్యమాలైన గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్‌లలో పలు పార్టీలు, అభ్యర్థులు యాడ్స్‌ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్‌ 5 మధ్య 45 రోజుల్లో 830 రాజకీయ యాడ్స్‌ ప్రచారమయ్యాయని, వాటి ద్వారా 3.76 కోట్ల రూపాయలు వచ్చాయని ప్రధాన ఇంటర్నెట్‌ సర్చ్‌ ఇంజన్‌ ‘గూగుల్‌’ తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది.

అయితే ఈ విషయంలో జుకర్‌బర్గ్‌ నాయకత్వంలోని ‘ఫేస్‌బుక్‌’ మరింత ముందున్నది. 2019, ఫిబ్రవరి మొదటి నుంచి రెండు నెలల కాలంలో 51వేల రాజకీయ యాడ్స్‌ ద్వారా 10.32 కోట్ల రూపాయలు సమకూరాయని ఓ నివేదికలో తెలిపింది. ఈ విషయంలో ‘ట్విటర్‌’ బాగా వెనకబడి ఉంది. ప్రముఖ రాజకీయ నాయకుడుగానీ, రాజకీయ పార్టీగానీ ఎన్నికల ప్రచార యాడ్స్‌ ఇవ్వలేనది ట్విటర్‌కు చెందిన ‘యాడ్స్‌ ట్రాన్స్‌పర్‌ సెంటర్‌’ తెలియజేసింది. ఫేస్‌బుక్‌కు చెందిన ‘వాట్సాప్‌’ సందేశ పోర్టల్‌లో యాడ్స్‌ను ప్రసారం చేయకపోవడం గమనార్హం. ట్విటర్‌ కన్నా ఫేస్‌బుక్‌కు ఎక్కువ యాడ్స్‌ రావడానికి కారణంగా దేశంలో ఫేస్‌బుక్‌కు 30 కోట్ల మంది ఖాతాదారులు ఉండగా, ట్విటర్‌కు కేవలం మూడున్నర కోట్ల మంది మాత్రమే ఉన్నారు.  దేశంలో ఉన్న 90 కోట్ల మంది ఓటర్లతో పోలిస్తే ఈ సంఖ్య పెద్ద ఎక్కువేమి కాదు.

సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు, పార్టీలు సోషల్‌ మీడియాలో యాడ్స్‌ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. యాడ్స్‌ విషయంలో పాలకపక్ష బీజేపీ ఎంతో ముందుండగా, కాంగ్రెస్‌ పార్టీ బాగా వెనకబడింది. ఫేస్‌బుక్‌కు 1.5 కోట్లు, గూగుల్‌కు 1.2 కోట్ల యాడ్స్‌ను బీజేపీ ఇవ్వగా, కాంగ్రెస్‌ పార్టీ ఫేస్‌బుక్‌కు 5.6 లక్షలు, గూగుల్‌కు కేవలం వేల రూపాయల్లోనే ఇచ్చింది. ఎన్నికల కమిషన్‌ ముందస్తు అనుమతి తీసుకొనే రాజకీయ పార్టీలైనా, నాయకులైనా సోషల్‌ మీడియాలో యాడ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో పారదర్శకత పాటిస్తామని ఫేస్‌బుక్, గూగుల్, ట్విటర్లు ఇదివరకే ప్రకటించాయి.

ఇక టీవీ, రేడియో ఛానళ్లు, ప్రింట్‌ మీడియాలో పాలకపక్ష బీజేపీ యాడ్స్‌కు, కాంగ్రెస్‌ పార్టీ యాడ్స్‌కు మధ్య వ్యత్యాసం నింగీ నేలకున్న దూరమంత ఉంది. బీజేపీ ప్రచారానికన్నా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారానికే ఎక్కువ యాడ్స్‌ ఇస్తున్నారు. ఈ యాడ్స్‌కైన డబ్బుతో ఏడాదిపాటు నాలుగున్నర కోట్ల మంది బడి పిల్లలకు మధ్యాహ్నం భోజనం సరఫరా చేయవచ్చని ‘ఫస్ట్‌ పోస్ట్‌’ వెబ్‌సైట్‌ అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు