కాంగ్రెస్‌కు ఫేస్‌బుక్‌ షాక్‌

2 Apr, 2019 04:07 IST|Sakshi

నకిలీ అకౌంట్లు, 687 పేజీల తొలగింపు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఐటీ సెల్‌తో సంబంధమున్న వ్యక్తుల నకిలీ అకౌంట్లను, 687 పేజీలను తొలగించినట్లు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సోమవారం వెల్లడించింది. ఆ ఖాతాలను వారు పోస్ట్‌ చేసిన కంటెంట్‌ ఆధారంగా తొలగించలేదని, తప్పుడు ప్రవర్తన ఆధారంగానే తొలగించామని స్పష్టం చేసింది. ‘కాంగ్రెస్‌ పార్టీ ఐటీ సెల్‌లో పనిచేసే వారి వ్యక్తిగత ఖాతాలతో సంబంధమున్న ఫేస్‌బుక్‌ పేజీలను భారీ స్థాయిలో తొలగించాం. వీటిని ఆటోమేటెడ్‌ సిస్టంతో గుర్తించాం.

వారు నకిలీ ఖాతాలతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నందునే తొలగించాం’అని ఫేస్‌బుక్‌ సైబర్‌ సెక్యూరిటీ పాలసీ హెడ్‌ నథానియల్‌ గ్లీచర్‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో పేజ్‌ అడ్మిన్లు, ఖాతాదారులు బీజేపీ పార్టీతో సహా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు వంటి అంశాలతో పాటు స్థానిక వార్తలు, రాజకీయ సమస్యలపై పోస్టులు పెడుతున్నారని తెలిపారు. అలాగే పాకిస్తాన్‌ నుంచి నకిలీ అకౌంట్లను నిర్వహిస్తున్న పేజీలను కూడా తొలగించినట్లు వెల్లడించారు. ఇందులో మిలిటరీ ఫ్యాన్‌ పేజీలు, పాక్‌ సంబంధిత వార్తలు, కశ్మీర్‌ కమ్యూనిటీ పేజీలున్నట్లు ఆయన చెప్పారు. ఈ నకిలీ ఖాతాలను పాకిస్తాన్‌ సైన్యానికి చెందిన ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ఐఎస్‌పీఆర్‌) ఉద్యోగులు నడిపిస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. 

మరిన్ని వార్తలు