‘మా తప్పిదంతోనే ఆమె పార్టీని వీడారు’

19 Apr, 2019 20:22 IST|Sakshi

ప్రియాంక చతుర్వేది రాజీనామాపై రణ్‌దీప్‌ సుర్జేవాలా

సాక్షి, ముంబై: తమ నాయకత్వ  తప్పిదం కారణంగానే ప్రియాంక చతుర్వేది ​కాంగ్రెస్‌ పార్టీని వీడారని, ఈ పరిణామం పార్టీపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని ఒప్పుకుంటున్నానని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. కీలక నేతలు పార్టీని విడిచిపెట్టిన ప్రతిసారి బాధగానే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామా చేసి శివసేనలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై సూర్జేవాలా స్పందిస్తూ, ఎవరు పార్టీని వీడినా తమకు బాధగానే ఉంటుందని చెప్పారు. ఎవరైనా భవిష్యత్తు పురోగతి వైపు అడుగులు వేయడం సహజమేనని, చతుర్వేది సహా అలాంటి వారందరికీ మంచి జరగాలని తాము అశిస్తున్నానని పేర్కొన్నారు.

గతంలో తనపట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని పార్టీని బహిష్కరించి.. ఎన్నికల వేళ మళ్లీ పార్టీలో చేర్చుకోవడంపై ప్రియాంక చతుర్వేది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కోసం చెమటోడ్చినవారికన్నా, దుష్టులకే పెద్ద పీట వేస్తున్నారని మండిపడుతూ.. రెండు రోజుల క్రితం ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గురువారం ఆమె తన రాజీనామా లేఖను పంపించారు. శుక్రవారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలిసి ఆ పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు