విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి

27 Oct, 2018 03:12 IST|Sakshi

ప్రతిపక్షాల నిరాధార ఆరోపణలను ఎండగట్టాలి

రాష్ట్రంలోని మేధోవర్గానికి మంత్రి కేటీఆర్‌ పిలుపు

తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సదస్సు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్ధిపై జరుగుతున్న విష పచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిందని.. ఈసారి కేసీఆర్‌ నాయకత్వానికి జై కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ఓ హోటల్‌లో శుక్రవారం మేధావుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘దశాబ్దన్నరపాటు అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం సరైన మార్గంలోనే ముందుకెళ్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షల మేరకు పని చేస్తూ ప్రజా సంక్షేమం దిశగా వేగంగా దూసుకెళ్తోంది. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడ్డ వారం రోజుల్లోనే 7 మండలాలను ఏపీలో విలీనం చేస్తూ తెరలేపిన కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలుస్తున్నాం. ఆధిపత్య భావజాలం కలిగిన పాలకపక్షాలతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రంలోని ప్రతిపక్షాల సంకుచిత మనస్తత్వంతో మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ ప్రజాకోర్టులో ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్‌ అసాధారణ పాలనతో.. తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన నీళ్లు, నిధులు, నియామకాల్లో సంపూర్ణ న్యాయం చేసే దిశగా ముందుకెళ్తున్నాం. తెలంగాణను కోటి ఎకరాల మాగానం చేయాలన్న లక్ష్యంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేపట్టాం. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచి నీరు అందించే కార్యక్రమం దాదాపు పూర్తి కావొచ్చింది’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ప్రతిపక్షాల అసలు రూపం బయటపెట్టండి
‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తుంటే ప్రతిపక్ష పార్టీలు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను, నియామక ప్రక్రియను కోర్టులతో అడ్డంకులు సృష్టించాయి. అభివృద్ధి యజ్ఞానికి అడ్డం పడుతున్న ప్రతిపక్ష పార్టీల అసలు రూపాన్ని ప్రజల ముందుపెట్టడంలో తెలంగాణ మేధోవర్గం అండగా నిలవాలి. ప్రాజెక్టుల్లో అవినీతి అంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూపొందించినప్పుడు 16 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేది. దీన్ని 160 టీఎంసీలకు పెంచినందువల్లే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈపీసీ విధానంతో, మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరిట ప్రజల సొమ్ములను కొల్లగొట్టిన విషయాలను చర్చకు పెట్టాలి. ప్రాజెక్టులతో పాటు ప్రతి విషయంపైనా ప్రతిపక్షపార్టీ కోర్టుకు వెళ్లింది. తెలంగాణ ఆడబిడ్డలకు అందివ్వాల్సిన బతుకమ్మ చీరలను సైతం అడ్డుకున్నది. ప్రభుత్వం భవిష్యత్తు తరాల కోసం చేపట్టిన ప్రాజెక్టుల కోసం నిధులు ఖర్చు చేస్తుంటే అప్పులు చేస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారు. కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌.. అవినీతి, బంధుప్రీతికి, కుటుంబ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను, కార్యక్రమాలను అడ్డుకుంటూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల డొల్లతనాన్ని ప్రజలకు తెలియజేయాలి’అని మంత్రి కేటీఆర్‌ మేధావులను కోరారు.


కేటీఆర్‌తో అప్పిరెడ్డి భేటీ
హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏహెచ్‌ఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు అన్నపరెడ్డి అప్పిరెడ్డితో పాటు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు శుక్రవారం కేటీఆర్‌తో సమావేశమయ్యారు. హుజూర్‌నగర్‌లో పార్టీ పరిస్థితిని, ఎన్నికల స్థితిగతులను అప్పిరెడ్డి వివరించారు. ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టిపల్లి శివాజీ కేటీఆర్‌ సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు.

కార్పొరేషన్ల చైర్మన్లు నాగుర్ల వేంకటేశ్వర్‌రావు, లింగంపల్లి కిషన్‌రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. విద్యా రంగానికి రాష్ట ప్రభుత్వం చేసిన కృషి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలన్న కేటీఆర్‌ వినతిని నరేందర్‌రెడ్డి అంగీకరించారు. మాజీ ఎమ్మెల్యే గంగుల కమలా కర్‌తో కలసి ఆయన కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

మరిన్ని వార్తలు