ఎన్నికల ఏరువాకలో ఓట్ల సాగు

17 Nov, 2018 02:42 IST|Sakshi

రైతుల మద్దతు కూడగట్టే పనిలో రైతు సమన్వయ సమితులు

రైతుబంధు, బీమా లబ్ధి గురించి ఊరూవాడా ప్రచారం

రైతులను టీఆర్‌ఎస్‌ వైపు మళ్లించేందుకు కసరత్తు

ఎన్నికల ఏరువాకలో ఓట్లు పండించడానికి రైతు సమన్వయ సమితులు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) గెలుపే లక్ష్యంగా.. ఊరూరా రైతులను కలుస్తూ ఈ సమితులు పార్టీ గెలుపునకు వ్యూహరచన చేస్తున్నాయి. గత ఖరీఫ్‌ సీజన్‌లో రైతుబంధు చెక్కుల పంపిణీ సందర్భంలో.. రైతుబీమా పథకంలో రైతులను చేర్పించడంలో కీలకంగా వ్యవహరించిన సమన్వయ సమితులు.. ఇప్పుడు ఆయా సాయాలను గుర్తుచేస్తూ రైతులను పార్టీ వైపు తిప్పేందుకు పని చేస్తున్నాయి.

విత్తనం వేసింది మొదలు పంట పండాక మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రైతుబంధు చెక్కుల పంపిణీ, రైతుబీమాలో రైతుల చేరిక వంటి సందర్భాల్లో ఈ సమితుల సభ్యులు అంతా తామై వ్యవహరించారు. చెక్కుల పంపిణీకి, బీమా పథకంలో చేరికకు సంబంధించి ఎవరు నిజమైన రైతులో కాదో నిర్ధారించింది వీరే. ఇంతలా గ్రామస్థాయిలో రైతులతో మమేకమై పనిచేసిన ఈ సమితులు ఇప్పుడు రైతులకు అందిన లబ్ధిని వివరిస్తూ.. ఓట్లుగా మలిచేందుకు కృషి చేస్తున్నాయి. 

1.61 లక్షల మంది సభ్యులు
గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఈ సమితుల్లోని సభ్యులు ప్రభుత్వ పరంగా నామినేట్‌ పదవుల్లో ఉన్నట్టు. రాష్ట్రంలోని 10,733 గ్రామాల్లోనూ రైతు సమన్వయ సమితులు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 15 మంది చొప్పున అన్ని గ్రామాల్లోనూ 1.61 లక్షల మంది సభ్యులను నియమించారు. దాంతోపాటు ప్రతీ గ్రామానికి ఒక సమన్వయకర్త ఉంటారు. ఆపై 24 మందితో మండల సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. అలా 559 మండలాలకు 13,416 మందిని నియమించారు. ప్రతీ మండలానికి మళ్లీ ఒక మండల రైతు సమితి సమన్వయకర్తను నియమించారు.

వీరందరితో కలిపి జిల్లా సమన్వయ సమితిని ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాకు 24 మంది చొప్పున జిల్లా సమితి సభ్యులను నియమించారు. దీనికి ఓ జిల్లా సమన్వయకర్త ఉంటారు. అనంతరం రాష్ట్రస్థాయిలో సమన్వయ సమితిని 42 మందితో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యలు రావడంతో కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర సమన్వయ సమితికి ఛైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించి.. క్యాబినెట్‌ హోదా కట్టబెట్టారు. జిల్లా సమన్వయకర్తకు జిల్లా కేంద్రంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు. మండల స్థాయిలోనూ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. నామినేట్‌ పదవులు కావడంతో వారంతా సుశిక్షితులైన సైన్యంగా టీఆర్‌ఎస్‌ గెలుపునకు కృషిచేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ గుత్తా సుఖేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

ప్రతీ 32 మంది రైతులకు ఒకరు
ఒక అంచనా ప్రకారం ప్రతీ 32 మంది రైతులకు ఒక రైతు సమన్వయ సమితి సభ్యుడున్నారు. ఆయా రైతులందరినీ సమన్వయపరిచి టీఆర్‌ఎస్‌కు ఓటేసేలా వీరంతా కసరత్తు చేస్తున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక రైతు సమన్వయ సమితి సభ్యులందరికీ రెమ్యునరేషన్‌ ఇస్తామని టీఆర్‌ఎస్‌ తన పాక్షిక మేనిఫెస్టోలో ప్రస్తావించడంతో 1.61 లక్షల మంది సభ్యులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నట్లు ఒక్కో సభ్యునికి నెలకు రూ.500 నుంచి రూ. వెయ్యి వరకు రెమ్యునరేషన్‌ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుబంధు సొమ్మును బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించడంలో రైతు సమితులు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. రైతులకు బీమా సొమ్ము ఇప్పించడంలోనూ సభ్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 
...::: బొల్లోజు రవి

మరిన్ని వార్తలు