మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్‌ఫ్రే మృతి

24 Apr, 2019 08:20 IST|Sakshi
డెల్లా గాడ్‌ఫ్రే (ఫైల్‌)

గన్‌ఫౌండ్రీ: నామినేటెడ్‌ (ఆంగ్లో ఇండియన్‌) మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్‌ఫ్రే(64) మంగళవారం మరణించారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో గతవారం చేర్పించారు. కాగా చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆమె పార్థివదేహాన్ని కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌లోని తన నివాసానికి తరలించారు.  అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం 3గంటలకు గన్‌ఫౌండ్రీలోని సెయింట్‌ జోసెఫ్‌ క్యాథడ్రల్‌ చర్చికు తీసుకొస్తారు.

అనంతరం నారాయణగూడలోని క్యాథలిక్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు 1994–1999, 1999–2004 వరకు రెండు పర్యాయాలు ఆమె ఎమ్మెల్యేగా నామినేట్‌ అయ్యారు. ఆంగ్లో ఇండియన్ల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి ప్రశంసనీయమని, ఆమె మృతి పట్ల అఖిల భారత ఆంగ్లో ఇండియన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బ్యారీ ఓ బ్రెన్‌ సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు