వ్యవ‘సాయం’ పోయిందయ్యా.. 

8 Dec, 2018 02:45 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా కేశవరావుపేటలో వైఎస్‌ జగన్‌కు కష్టాలు చెప్పుకుంటున్న ఓ రైతన్న

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన రైతులు 

వైఎస్సార్‌ పోయాక వ్యవసాయమే పోయింది.. 

గిట్టుబాటు ధర దక్కక పెట్టుబడి కూడా చేతికందడం లేదు 

అమ్ముదామంటే కొనే నాథుడే కరువయ్యాడు 

ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యం సాగుకు శాపమవుతోంది 

దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న జనం 

అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు సాగిన జగన్‌  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నదులు ప్రవహిస్తున్నా పూర్తి కాని ప్రాజెక్టులతో సాగుకు నీరందక భూములు బీడువారుతున్నాయని, పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలే దిక్కవుతున్నాయని రైతులు, ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరుగుతున్నా పింఛన్‌లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 315వ రోజు శుక్రవారం ఆయన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు. దారిపొడవునా ఆయా గ్రామాల్లో ప్రజలు గ్రామీణ సంప్రదాయ పద్ధతిలో మేళతాళాలు, తప్పెటగుళ్లు, డోలు.. సన్నాయి, తీన్‌మార్, బుట్టబొమ్మల నృత్యాలతో పాదయాత్రను హోరెత్తించారు. మరో వైపు బడుగు బలహీన వర్గాల ప్రజలు, మహిళలు, రైతులు, కార్మికులు, చేనేతలు జగన్‌ను కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీకి పట్టున్న గ్రామాల మీదుగా సాగిన యాత్రకు స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. జగన్‌ తమ గ్రామం మీదుగా వెళుతున్నారని తెలుసుకుని మహిళలు, వృద్ధులు పలు చోట్ల రోడ్డుపై కార్పెట్‌లు పరచి, పూల వాన కురిపించారు.
  
చావలేక.. బతకలేక..  
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యాన్ని కొనే నాధుడే కనిపించడం లేదని 80 ఏళ్ల వృద్ధ రైతు పైల లక్ష్మణుడు  కేశవరావుపేటలో జగన్‌ వద్ద కన్నీరు పెట్టుకున్నాడు. ఎకరా పంటకు రూ.35 వేలు పెట్టుబడి పెడితే రూ.25 వేలకు మించి రావడం లేదని చెప్పుకొచ్చాడు. ‘ప్రభుత్వమేమో బస్తాకు రూ.1,700 ఇస్తామని చెబుతోంది.. పొలాల్లో పంట అమ్ముకుందామంటే రూ.800కు ఇస్తావా.. వెయ్యికి ఇస్తావా అని అడుగుతున్నారు. చావలేక, బతకలేక అల్లాడుతున్నాము. వైఎస్‌ ఉన్నంత కాలం వ్యవసాయమే కాదు వైద్యం, పిల్లల చదువులు అన్నీ బాగుండేవి. ఆయన పోయాక వ్యవసాయమే పోయిందయ్యా..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ రైతును జగన్‌ ఓదార్చి వచ్చేవన్నీ మంచి రోజులేనని భరోసా ఇచ్చారు. నాగావళి, వంశధార నదులు, మడ్డువలస ప్రాజెక్టు ఉన్నా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయక పోవడంతో సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయని చిలకపాలెంలో సన్యాసి అనే రైతు, ఎస్‌ఎం పురం రైతులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు కూడా వలసలు పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు.  

వినతుల వెల్లువ..      
ఒడిశా సహా ఇతర రాష్ట్రాల్లోని పలు యూనివర్సిటీలలో అగ్రి బీఎస్సీ(వ్యవసాయం) చదివిన వారికి కూడా రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో పోస్టులకు అర్హత కల్పించాలని పలువురు జగన్‌ను కోరారు. ఎస్‌ఎం పురం వద్ద విజయనగరం జిల్లాకు చెందిన పి.మనీష ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు జగన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో పదేళ్లుగా పని చేస్తున్న తమకు పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి కనీస సదుపాయాలు లేవని పలువురు బోధనేతర సిబ్బంది మొర పెట్టుకున్నారు. తమ సర్వీసులను క్రమబద్ధీకరించండని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఈ సర్కార్‌ ఖాతరు చేయడం లేదని వివరించారు. సివిల్‌ సప్‌లైస్‌ కార్పొరేషన్‌ గోడౌన్‌లలో పని చేస్తోన్న తమ ఉపాధి దెబ్బతీసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని  హమాలీలు జగన్‌కు వివరించారు. రేషన్‌ షాపుల నిర్వహణ భారమైన పరిస్థితుల్లో తమకు గౌరవ వేతనం గ్రామీణ ప్రాంతాల్లో రూ.18,500లు, పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేలు ఇవ్వాలని శ్రీకాకుళం జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణదాస్, సూర్యారావు జగన్‌కు వినతి పత్రం అందజేశారు. కేరళలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వ కనీస వేతన చట్టం అమలయ్యేలా మేనిఫెస్టోలో పెట్టాలని విజ్ఞప్తి చేయగా, అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని జగన్‌ హామీ ఇచ్చారు.
 
వృద్ధుల పట్ల కనికరం లేదా?   
వయసు పైబడిన వృద్ధులకు పింఛన్‌ ఇచ్చే విషయంలో వేలి ముద్ర (బయోమెట్రిక్‌) అనివార్యమన్న నిబంధనలను ఎత్తివేయాలని పలువురు వృద్ధులు జగన్‌ను కోరారు. 70, 80 ఏళ్లు దాటాక వేలిపై గీతలు సరిగా నమోదు కావని, ఇందుకు ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. వేలిముద్రలు పడలేదనే కారణంతో పెన్షన్‌లు కూడా ఇవ్వడం లేదని పలువురు జగన్‌ ఎదుట వాపోయారు. నిరుద్యోగ భృతి ఇస్తామని నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు సర్కార్‌ నమ్మిస్తూ మోసం చేసిందని, మొక్కుబడిగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు ఇస్తున్నారే తప్ప పోస్టులు భర్తీ చేయడం లేదని నిరుద్యోగులు జగన్‌కు ఫిర్యాదు చేశారు.  బంగారు తల్లి పథకం కాగితాలకే పరిమితమైందని మహిళలు వాపోయారు.
    
‘సంపూర్ణ మద్య నిషేధం’ స్వాగతిస్తున్నాం.. 
రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించడాన్ని జన చైతన్య వేదిక స్వాగతించింది. జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్య భారతి జాతీయ కన్వీనర్‌ పి.కన్నయ్య, ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, ప్రముఖ విశ్లేషకుడు రవికుమార్, మహిళా ఉద్యమ నాయకురాలు కడియాల మోహిని తదితరులు శుక్రవారం పాదయాత్రలో జగన్‌ను కలిసిశారు. ఓ వినతి పత్రాన్ని అందజేశారు. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణ మద్య నిషేధానికి మద్ధతు ప్రకటించాలని వారు కోరారు. ప్రస్తుత పాలకులు ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని జగన్‌కు వివరించారు. మద్యం వల్ల కలిగే దుష్పలితాలను వివరించేందుకు నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. ఒక్క డీ అడిక్షన్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. మూడు దశల్లో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని, 2024 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను మద్యరహిత రాష్ట్రంగా మారుస్తామని వైఎస్సార్‌సీపీ నవరత్నాల్లో ప్రకటించడాన్ని జన చైతన్య వేదిక హర్షిస్తోందన్నారు.
  
జగన్‌తోనే అందరికీ న్యాయం 
సాక్షి, తిరుపతి/ శ్రీకాకుళం అర్బన్‌ : ‘పాతికేళ్ల పాటు టీడీపీలో సేవచేస్తే గత ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి ఓడించారు. ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చిన ఈ ఒక్క సీటును గెలవనివ్వకుండా పార్టీ వర్గాలే మోసం చేశాయి. పీలేరులో ఓడిపోతానని తెలిసే నాకు ఆ టికెట్‌ ఇచ్చారు. టీడీపీలో మైనారిటీలంటే చులకన భావం ఉంది. ముస్లింలకు ప్రాధాన్యత, గుర్తింపునిచ్చింది మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి’ అని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జ్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో శుక్రవారం ఆయన మరి కొందరు నేతలు, అనుచరులతో కలిసి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. జగన్‌.. వారందరికీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు ఫయాజ్‌ అహ్మద్, టీడీపీ జిల్లా మైనారిటీసెల్‌ ప్రధాన కార్యదర్శి రిజ్వాన్, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు సద్దాం హుస్సేన్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కారిపాకుల భాస్కరనాయుడు, ఆ పార్టీ నేతలు శ్రీనివాసులు, రమణ, గయాజ్‌ అహ్మద్, మౌలా, ఎం చంద్రయ్య, రామచంద్రయ్య తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. టీడీపీలో ముస్లింలను రాజకీయంగా వాడుకోవటమే కానీ, వారి అభ్యున్నతికి స్థానం లేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ వర్గాలు తన గెలుపునకు ఏమాత్రం సహకరించలేదన్నారు. ఓటమి పాలైనా పార్టీని వీడకుండా సేవ చేస్తున్నా తనను అడుగడుగునా అవమానాలకు గురిచేశారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ద్వారానే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మి పార్టీలో చేరానన్నారు.     

కేశవరెడ్డి బాధితులకు న్యాయం జరగలేదన్నా.. 
కేశవరెడ్డి పాఠశాలలో పిల్లలను చదివించడం కోసం ఫిక్స్‌డ్‌ ఫ్రీ ఎడ్యుకేషన్‌ సిస్టంలో ఒక్కో విద్యార్థికి తల్లిదండ్రులు రూ.3.50 లక్షలు ఇచ్చారన్నా.. ప్రస్తుతం మా పిల్లలు 10 తరగతి రిలీవ్‌ అయి నాలుగేళ్లవుతోంది. అయినా మా డబ్బులు వెనక్కివ్వలేదు. ఇప్పుడు ఉన్నత చదువులు చదివించడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు సమస్యను తీసుకెళ్లాం. మాకు న్యాయం జరగ లేదు. మీరే పరిష్కారం చూపాలి.  
– వాండ్రంగి భారతమ్మ, నారాయణమ్మ, ఎచ్చెర్ల 

కడుపు కొట్టాలని చూస్తున్నారయ్యా.. 
అయ్యా.. ఈ జిల్లాలో పౌర సరఫరాల శాఖ గోదాంలు 29 ఉన్నాయి. వీటిని 19కి కుదించేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు ప్రారంభించారు. 350 మంది హమాలీలం తాతల నాటి నుంచి ఈ పని చేస్తూ బతుకుతున్నాం. మా కడుపు మీద కొట్టే చర్యలు తీసుకోకుండా కృషి చేయండి. మీరు సీఎం కాగానే మా ఉపాధికి భద్రత కల్పించాలి. 
– పౌర సరఫరాల శాఖ హమాలీల సంఘం సభ్యులు, శ్రీకాకుళం. 

చేనేత ఆధారిత దేవాంగులను ఆదుకోవాలి.. 
అయ్యా.. చేనేత కుటుంబంపై ఆధార పడి బతుకుతున్న దేవాంగుల కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాలి. చేనేత కార్మికులకు ప్రత్యేక రేషన్‌ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలి. చేనేతకు మార్కెటింగ్, ప్రత్యేక ప్రోత్సాహం కల్పించాలి. మీరు సీఎం అయితేనే మాలాంటోళ్ల కష్టాలు తీరతాయి.  
– వట్టి సత్యనారాయణ, లావేరు  

మరిన్ని వార్తలు