గత ప్రభుత్వం చేసిందేమీలేదు

9 Jul, 2019 03:56 IST|Sakshi

పంటలు పండక అనేక ఇబ్బందులు పడ్డాం

బోర్లలో నీరు రాక తీవ్రంగా అప్పులపాలయ్యాం

ఆత్మహత్యలు చేసుకున్నా నాటి సర్కారు ఆదుకోలేదు

జమ్మలమడుగులో సీఎం సమక్షంలో రైతుల ఆవేదన

జగన్‌ పగ్గాలు చేపట్టిన నెలలోనే న్యాయం జరిగిందని ఆనందం

జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్‌ : గత ప్రభుత్వ హయాంలో తాము పంటలు వేసి సక్రమంగా పండక అనేక ఇబ్బందులు పడ్డాం. బోర్ల మీద బోర్లు వేసి అప్పులపాలయ్యాం. వీటిని చెల్లించలేక.. వడ్డీలు కట్టలేక చివరకు తమ కుటుంబ పెద్దలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆదుకోవాల్సిన నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెలలోపే తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని జమ్మలమడుగులో సోమవారం  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన సమావేశంలో రైతులు గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కో కన్నీటిగాధను సీఎంతో పంచుకున్నారు. 

మృతదేహాన్ని తెచ్చుకోవటానికి అప్పుచేశాం
మా నాన్న పదెకరాలు కౌలుకు తీసుకుని శనగ పంట సాగుచేశాడు. వర్షాలు లేకపోవడంతో పంట పండలేదు. తెచ్చిన అప్పులు కట్టలేక కర్నూలు జిల్లా అహోబిలంలో పురుగుల మందు తాగి 2003లో చనిపోయాడు. మృతదేహాన్ని తెచ్చుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. రెండు రూపాయల వడ్డీతో రూ.5 వేలు అప్పుచేసి మృతదేహాన్ని తీసుకొచ్చాం.  ఆ తర్వాత 2004లో వైఎస్సార్‌ సీఎం అయిన తర్వాత రూ. 1.5 లక్షల చెక్కు ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు రైతు బాంధవుడిగా పేరు సంపాదించుకుంటున్నారు. – లక్ష్మీ చిన్నకొమెర్ల, మైలవరం మండలం, వైఎస్సార్‌ జిల్లా


ఎగుమతులకు సర్కారు సహకరించాలి
ప్రకృతి వైపరీత్యంవల్ల నాకు రూ.40 లక్షల మేర పంట నష్టం జరిగింది.మా  ప్రాంతంలో ఎక్కువగా అరటి సాగు చేస్తుంటాం. ఇక్కడ నుంచి విదేశాలకు దానిని ఎగుమతి చేస్తున్నాం. ఎగుమతులు చేసుకోవటానికి ప్రభుత్వం సహకరించాలి. రైతులకు పగలే 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. ఆయన నల్లపురెడ్డి గ్రామంలోని చెరువుకు నీరు వచ్చేలా చేస్తే తమ ప్రాంతం రైతులు జీవితాంతం రుణపడి ఉంటాం.– లింగసాని విజయభాస్కర్‌రెడ్డి, నల్లపురెడ్డి గ్రామం, పులివెందుల

గతంలో పెన్షన్‌ కోసం ఎదురుచూసే వాళ్లం

గతంలో చేనేత కార్మికులకు పెన్షన్‌ ఎప్పుడు వస్తుందో అంటూ ఆశగా చూసేవాళ్లం. వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలు చూసి ఎన్నికలకు 2 నెలల ముందు టీడీపీ సర్కారు పెన్షన్‌ను రూ. 2 వేలు చేసింది. అయితే, తిరిగి దానిని మూడువేల వరకు పెంచుకుంటూపోతామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అంతేకాదు.. పెన్షన్‌ అర్హత వయస్సును 50 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు వైఎస్‌ జగన్‌ తగ్గించడం వల్ల చేనేత కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతోంది. – డి. ప్రసాద్, రాజీవ్‌నగర్‌ కాలనీ, జమ్మలమడుగు


 

కలలో కూడా పెన్షన్‌ వస్తుందనుకోలేదు
రెక్కాడితేగానీ డొక్కాడని చేనేత కుటుంబం మాది. చేనేత మగ్గాల ద్వారా జీవనం సాగిస్తున్న నాకు గత కొంతకాలం కిందట కిడ్నీలు చెడిపోయాయి. లక్షల రూపాయలు ఖర్చుపెట్టాలి. డయాలసిస్‌ చేయించుకోవలసిన పరిస్థితి ఉంది. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పుడు నాకు రూ.పదివేల పెన్షన్‌ వస్తోంది. కలలో కూడా అది వస్తుందనుకోలేదు. 
– కె. వెంకటేశ్వర్లు, మోరగుడి గ్రామం, జమ్మలమడుగు


రాజన్న బీమా పథకం ప్రారంభం

తొండూరు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి వర్తింపజేసే రాజన్న బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో రైతు దినోత్సవం వేదికపై ప్రారంభించారు. వైఎస్సార్‌ జిల్లా  తొండూరు మండలం బూచుపల్లె గ్రామానికి చెందిన కోడూరు విశ్వనాథ(32) అనే రైతు 2017లో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి టీడీపీ ప్రభుత్వం విశ్వనాథ కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. విశ్వనాథకు భార్య రామసుబ్బమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతు విశ్వనాథ కుటుంబానికి రాజన్న బీమా పథకం కింద రూ.7 లక్షలను వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మంజూరు చేశారు.

జమ్మలమడుగు రైతు దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా విశ్వనాథ భార్య రామసుబ్బమ్మకు చెక్కును అందించారు. విశ్వనాథ కుమారుడు శ్రీకాంత్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ తన వద్ద కూర్చొబెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే తమలాంటి పేదల బాధలు తెలుసుకుని, స్పందించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేవుడంటూ రైతు విశ్వనాథ భార్య రామసుబ్బమ్మ ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకున్న 3 ఎకరాల పొలంలో పత్తి, చీనీ పంటలు సాగు చేసి, నీరులేక ఎండిపోతున్న సమయంలో బోర్లు వేయడానికి తన భర్త విశ్వనాథ రూ.6.50 లక్షల అప్పులు చేశాడని చెప్పారు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. 

శనగరైతులకు ఎంతో ఊరట
గత ఐదేళ్లుగా మా ప్రాంతంలోని రైతులు శనగపంట వేస్తున్నా సరైన దిగుబడులు రావడంలేదు. గిట్టుబాటు ధర కూడా లేదు. జిల్లాలో అత్యధికంగా శనగ పంట సాగుచేసేది పెద్దముడియం మండలంలోనే. ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌ శనగ రైతులకు క్వింటాకు రూ.1,500లు అదనంగా మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మార్కెట్‌లో ఉన్న రేటునే మద్దతూ ధరగా ప్రకటించింది. అలా కాకుండా మార్కెట్‌ రేటుకు అదనంగా రూ.1,500లు క్వింటాకు చెల్లించడం వల్ల శనగ రైతులకు ఎంతో ఊరట కలుగుతుంది.     – రామాంజనేయుల రెడ్డి, శనగ రైతు, పెద్దముడియం

మరిన్ని వార్తలు