సేద్యానికి ‘చంద్ర’గ్రహణం

30 Mar, 2019 09:56 IST|Sakshi

ఖరీఫ్, రబీ సర్వనాశనం... 

అందని రుణమాఫీ, బీమా, ఇన్‌పుట్‌ 

 భారీగా నష్టపోయిన జిల్లా రైతులు  

పరిహారంపై సన్నగిల్లుతున్న ఆశలు 
గత ఏడాది డిసెంబర్‌లో కేంద్ర కరువు బృందం పర్యటించి జిల్లా కరువు తీవ్రతను గుర్తించింది. జిల్లాలో 6.77 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 6.95 లక్షల మంది రైతులకు రూ.937.40 కోట్లు పంట నష్టం వాటిల్లినట్లు తేల్చారు. మొత్తమ్మీద గత ఏడాది పంట పెట్టుబడులు, దిగుబడులు పరిగణలోకి తీసుకుంటే జిల్లా రైతులకు రూ.3,600 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అయితే ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం రూ.937 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీకి ఇంకా ఆమోదం తెలపకపోవడంతో పరిహారంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.  

రబీదీ అదే దుస్థితి 
ఖరీఫ్‌ 2018 కల్లోలం కాగా కనీసం ఆదుకుంటుందనుకున్న రబీ కూడా దారుణంగా దెబ్బతీసింది. 77 వేల హెక్టార్లలో చేపట్టిన పప్పుశనగ  సాగులో ఎక్కడా ఎకరాకు 50 కిలోలు కూడా దిగుబడులు రాలేదు. రూ.600 కోట్లకు పైగా రైతులు భారీగా నష్టపోయారు. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 155.5 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 50 మి.మీ నమోదైంది. 67 శాతం లోటు వర్షపాతంతో రబీ ప్రధానపంట పప్పుశనగతో పాటు మరికొన్ని పంటలు దాదాపు 2 లక్షల ఎకరాల్లో దారుణంగా దెబ్బతిన్నాయి. గత రబీలో జిల్లా రైతులకు రూ.700 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. రబీలో కూడా 32 మండలాలను కరువు జాబితాలోకి ప్రకటించి చంద్రబాబు సర్కారు చేతులుదులుపుకుంది. రూ.100 కోట్లు పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదించినా... పరిహారం ఇచ్చే అంశంపై చంద్రబాబు ప్రభుత్వం ఉలుకుపలుకూ లేదు. 

రుణమాఫీ పరిస్థితి ఇలా...  

2014 నాటికి జిల్లాలో రైతు రుణాలు  రూ.6,817కోట్లు
కమిటీలు, కొర్రీల కింద పక్కన పెట్టిన రుణాలు రూ.4,073కోట్లు
చివరకు పంట,బంగారు రుణాల మాఫీకి అర్హత రూ.2,744కోట్లు
ఒకేసారి మాఫీ అయిన మొత్తం రూ.650కోట్లు
మొదటి విడతగా మాఫీ అయిన మొత్తం​ రూ.418కోట్లు
రెండో విడతగా మాఫీ అయిన మొత్తం రూ.461కోట్లు
మూడో విడత మాఫీ రూ.502కోట్లు
ఇప్పటిదాకా జమ అయిన మాఫీ సొమ్ము రూ.1,906కోట్లు
రెండు,మూడు విడతల్లో పెండింగ్‌ రూ.33కోట్లు

గిట్టుబాటూ ఎండమావే 
జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు సరైన మార్కెటింగ్‌ సదుపాయం లేదు. గిట్టుబాటు ధర కూడా ఎండమావిగానే మారింది. గత ఏడాది వేరుశనగ క్వింటాకు రూ.4,890 ప్రకారం కనీస మద్ధతు ధర ప్రకటించినా మార్కెట్‌లో కనీసం రూ.3,500 ప్రకారం కూడా కొనలేదు. వేరుశనగతో పాటు పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి ఉత్పత్తులకు కూడా మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రకటించిన ఎంఎస్‌పీ కన్నా మార్కెట్‌లో తక్కువ ధర ఉన్న సమయంలో ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ లాంటి ప్రభుత్వరంగ నోడల్‌ ఏజెన్సీల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే అరకొరగా రైతుల నుంచి వేరుశనగ, కంది, మొక్కజొన్న, çపప్పుశనగను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పండిన పంటలో 25 శాతం కూడా కొనకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. 

జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు సరైన మార్కెటింగ్‌ సదుపాయం లేదు. గిట్టుబాటు ధర కూడా ఎండమావిగానే మారింది. గత ఏడాది వేరుశనగ క్వింటాకు రూ.4,890 ప్రకారం కనీస మద్ధతు ధర ప్రకటించినా మార్కెట్‌లో కనీసం రూ.3,500 ప్రకారం కూడా కొనలేదు. వేరుశనగతో పాటు పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి ఉత్పత్తులకు కూడా మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రకటించిన ఎంఎస్‌పీ కన్నా మార్కెట్‌లో తక్కువ ధర ఉన్న సమయంలో ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ లాంటి ప్రభుత్వరంగ నోడల్‌ ఏజెన్సీల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే అరకొరగా రైతుల నుంచి వేరుశనగ, కంది, మొక్కజొన్న, çపప్పుశనగను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పండిన పంటలో 25 శాతం కూడా కొనకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు.  


పై చిత్రంలోని రైతు పేరు ప్రభాకర్‌రెడ్డి. పోతులనాగేపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు రెండు ఎకరాలలో బెండ పంట సాగు చేశాడు. బోరు బావిలో అరకొర వస్తున్న నీటితో పంటను కాపాడుకుంటూ వచ్చాడు. ఉన్న ఫలంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పని చేయకుండా పోయింది. ఈ విషయాన్ని  తోటి రైతులతో కలసి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా వారి నుంచి స్పందన లేదు. ఈక్రమంలో నీరందక పంట ఎండిపోతోంది. చేతి కొచ్చిన పంటను ఎండిపోకుండా ఒక్కో ట్యాంకర్‌కు రూ.600 చెల్లించి నీటిని తోలుతున్నాడు. తన కష్టం ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట ఎండిపోతే తీవ్రంగా నష్టపోతానని, ఇలా ఎన్ని రోజులు ట్యాంకర్‌తో నీళ్లు తోలుకోవాలో దిక్కు తెలియడం లేదని ఆందోళన చెందుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఈ రైతు ఒక్కడిదే కాదు పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసిన రైతులందరిదీ.    – ధర్మవరం రూరల్‌

ఈ ఫొటోలోని రైతు పేరు నాగేంద్రప్ప, వలస గ్రామం, అమరాపురం మండలం.  ఈయన పేరిట 4–50 ఎకరాల పొలం ఉంది. పంటలు సాగు చేయడానికి స్థానిక సిండికేట్‌ బ్యాంకులో 2013లో రూ. 1.2 లక్షల రుణం తీసుకున్నాడు. ఏటా సకాలంలో రుణం రెన్యూవల్‌ చేయించుకుని వడ్డీ రాయితీ పొందేవాడు. అయితే 2014 ఎన్నికల్లో రైతు రుణాలను మాఫీ చేస్తామని, రైతులు రుణాలు కట్టొద్దని చంద్రబాబుతోపాటు టీడీపీ నాయకులు చెప్పడంతో ఈ రైతు కూడా రుణానికి సంబంధించి వడ్డీ కూడా చెల్లించలేదు. తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ మొత్తం వడ్డీకే సరిపోయింది. బ్యాంకులో అప్పు మాత్రమే అలాగే ఉంది.
                          
– అమరాపురం  

పొలంలోనే వదిలేశా.. 
రూ.లక్ష పెట్టుబడి పెట్టి గత ఖరీప్‌లో వర్షాధారం కింద 8 ఎకరాల్లో వేరుశనగ సాగుచేశా. కానీ పంట సాగుచేసిన తర్వాత రెండు నెలలైనా వాన జాడ లేకపోవడంతో పంటంతా నిట్టనిలువునా ఎండిపోయింది. ఒక్క వర్షం పడినా పెట్టుబడులు వచ్చి, పశువుల మేత అయినా దక్కుతుందనుకున్నా. కాని చివరి వరకు వర్షం రాకపోవడంతో పంటను పొలంలోనే వదిలేశా. ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటుందనుకుంటే అసలు పట్టించుకోవడం లేదు.  

– తలారి నరసింహులు, వేరుశనగ రైతు, కనగానపల్లి  

 బీమా పరిహారం నిల్‌ 
ఫసల్‌ బీమా కింద 11 వేల మంది పప్పుశనగ రైతులు 2017 రబీలో రూ.2 కోట్లు ప్రీమియం చెల్లించారు. వర్షాభావంతో పంట చేతికి అందకుండా పోయింది. ఇందుకు సంబంధించిన పరిహారం నేటికీ అందలేదు. 2018 ఖరీఫ్‌లో 5.40 లక్షల మంది వేరుశనగ రైతులు రూ.82 కోట్లు ప్రీమియం కట్టారు. ఈ పరిహారం ఇంకా ప్రకటించలేదు. అదే ఏడాది రబీలో కూడా 1.05 లక్షల మంది పప్పుశనగ  రైతులు రూ.5 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినా పరిహారం అతీగతి లేకుండా పోయింది. అంతకు మునుపు కూడా 2014, 2015, 2016లో వేరుశనగ ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. జిల్లా రైతులు ఏటా రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్లు వరకు బీమా ప్రీమియం చెల్లించనా... పరిహారం మాత్రం కంటితుడుపుగా విడుదల చేశారు. ప్రభుత్వంతో పాటు బీమా కంపెనీలు కూడా దగా చేయడంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు.  

రైతు విలవిల 
అధికారిక లెక్కల ప్రకారం గత 25 ఏళ్ల జిల్లా వ్యవసాయ చరిత్ర తిరగేస్తే.. కేవలం నాలుగు సంవత్సరాల్లో మాత్రమే వేరుశనగ పంట అంతో ఇంతో చేతికొచ్చింది. మిగిలిన 20 సంవత్సరాలు పెట్టుబడులు కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. సగటున ఎకరాకు 10 బస్తాలు లేదా హెక్టారుకు వెయ్యి కిలోల వరకు దిగుబడులు వస్తే పంట బాగా వచ్చినట్లు లెక్క. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1995 నుంచి 2018 వరకు వేరుశనగ పంట దిగుబడులు పరిగణలోకి తీసుకుంటే అందులో 1995, 1998, 2000, 2006లో మాత్రమే పంట పండింది. ఆ తర్వాత 1996, 2004, 2017లో పెట్టుబడులు దక్కించుకున్నారు. ఇక మిగిలిన 18 ఏళ్లు సర్వం కోల్పోయారు.  

శతాబ్దాల చరిత్ర పునరావృతం 

జిల్లా గత 140 సంవత్సరాల వర్షపాతం చరిత్ర తీసుకుంటే ఈ ఏడాదే అతి తక్కువ వర్షం కురిసింది. జిల్లా సాధారణ వర్షపాతం 552.3 మి.మీ కాగా గత జూన్‌ నుంచి ఇప్పటివరకు కేవలం 274 మి.మీ వర్షం కురిసింది. అంటే సా«ధారణం కన్నా 45 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు రెండూ ఈ సారి మొహం చాటేయడంతో వర్షం జాడ కరువైపోయింది. ఈ శతాబ్ధిలో నమోదైనంతగా లోటు వర్షపాతం గతంలో ఎన్నడూ లేదు.  

ఈ‘సారీ’ దారుణం  
గత ఏడాది పరిస్థితి మరింత దారుణంగా మారింది. కీలకమైన ఖరీఫ్‌లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 338.4 మి.మీ గానూ 261 మి.మీ వర్షం కురిసింది. అంటే కురవాల్సిన దాని కన్నా 37 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో 7 లక్షల హెక్టార్లలో సాగు చేసిన ప్రధాన,  ప్రత్యామ్నాయ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తుగానే 2018 ఆగస్టులో తొలి విడతలో 44 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత రెండో విడతగా అదే ఏడాది సెప్టెంబర్‌లో మిగిలిన 19 మండలాలను కూడా కరువు జాబితాలోకి చేర్చింది.

పడకేసిన ప్రత్యామ్నాయం 
చంద్రబాబు హయాంలో వ్యవసాయంతో పాటు ప్రత్యామ్నాయమైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటల మనుగడ కూడా పడకేసింది. సబ్సిడీ, రాయితీలు, పథకాలు, బడ్జెట్‌ కేటాయింపుల్లో రైతులను సీఎం చంద్రబాబు దగా చేస్తూ వచ్చారు. కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయనియ్యకుండా అంతో ఇంతో తిరిగి ప్రభుత్వ ఖజానాకే జమ అయ్యేలా చేశారు. ఈ ఐదేళ్లలో ఉద్యానశాఖ ద్వారా రూ.50 కోట్లు వెనక్కి మళ్లిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఉద్యానహబ్‌ అంటూ ఊరించినా దాని ఊసే లేకుండా చేశారు. పండిన పండ్ల ఉత్పత్తులు అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గిట్టుబాటు ధరలు లేక చాలా సార్లు టమాట పంట రోడ్డున పడేస్తున్న దుస్థితి నెలకొంది. చీనీ, దానిమ్మ, అరటి, మామిడి, కర్భూజా, కళింగర, దోస, బొప్పాయి, మిరప లాంటి పంట ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధరలు లభించక నష్టాలపాలవుతున్నారు. పశుశాఖకు కేటాయించిన బడ్జెట్‌ ఐదేళ్లలో రూ.60 కోట్లు కాగా, ఇందులో పాడి రైతులకు ఉపయోగపడే ఒక్క పథకమూ అమలు చేయలేదు.

చంద్రబాబు ప్రైవేట్‌ డైయిరీను ప్రోత్సహిస్తుండటంతో ప్రభుత్వ డెయిరీ నిర్వీర్యమైపోయింది. పదేళ్ల కిందటనే రోజుకు 60 నుంచి 70 వేల లీటర్లు పాలు సేకరిస్తున్న ప్రభుత్వ డెయిరీలో ఇపుడు రోజుకు 6 వేల లీటర్లు కూడా రావడం లేదు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో 1.81 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటల మనుగడకు విఘాతం ఏర్పడింది. అలాగే ఏటా రూ.800 కోట్లు టర్నోవర్‌ కలిగిన పట్టుపరిశ్రమను నమ్ముకున్న రైతులూ రూ.200 కోట్లకు పైగా నష్టాలు మూటగట్టుకున్నారు.    

రుణమాఫీ పూర్తిగా చేయలేదు  
అధికారంలోకి వస్తే  రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు తిరిగి ఎన్నికలు వచ్చినా పూర్తిగా మాఫీ చేయలేదు. గత మూడు విడతల రుణమాఫీ మొత్తం గత అప్పు¯నకు చెల్లించాల్సిన వడ్డీకే సరిపోయింది. ఇక 4, 5 విడతల రుణమాఫీ మొత్తం బ్యాంకు ఖాతాకు ఇప్పటికీ జమ కాలేదు. తిరిగి ఎన్నికలు వచ్చాయి. అయినా ఇప్పటికీ మాఫీ చేసింది లేదు. హామీ నెరవేర్చలేని చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. 

– బాలునాయక్, తిప్పేపల్లి, ఓడీచెరువు 

నయాపైసా మాఫీ కాలేదు 
నాకు మా గ్రామ సమీపంలో 4 ఎకరాల పొలం ఉంది. సిండికేట్‌ బ్యాంకులో రూ.1.5 లక్షల అప్పు ఉంది. సీఎం చంద్రబాబునాయడు 2014 ఎన్నికల ముందు రైతుల రుణాలు మాఫీ చేస్తానని గొప్పగా ప్రకటించారు. అయినా నాకు ఇంత వరకూ నయాపైసా కూడా మాఫీ కాలేదు. ఈ ప్రభుత్వం ప్రచారం చేయడమే  తప్ప రైతులను ఆదుకోవడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదు.  

  – శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి, లేపాక్షి మం  

  

మరిన్ని వార్తలు