24 గంటల్లోగా రైతు రుణాల మాఫీ

7 May, 2018 11:14 IST|Sakshi

 సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే అమలు

ఇందిరా క్యాంటీన్‌  ఆగదు...అన్నపూర్ణ పథకం అమలుపరుస్తాం

 మీట్‌ ది ప్రెస్‌లో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.ఎస్‌.యడ్యూరప్ప

శివాజీనగర : రాష్ట్రంలో బీజేపీ ఈసారి 150 స్థానాల్లో గెలుపొందటంలో ఎలాంటి సందేహం లేదని, 17న తాను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం తథ్యమని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీఎస్‌.యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. అధికారం స్వీకరించిన 24 గంటల్లోగా జాతీయ, సహకార బ్యాంకుల నుంచి పొందిన రూ. లక్ష వరకు రుణ మాఫీ చేస్తానని, లేనిపక్షంలో ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగనని శపథం చేశారు. ఆదివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో విలేకరులతో మాట్లాడుతూ... జాతీయ బ్యాంకుల రుణమాఫీ చేయాలని సిద్దరామయ్య  బోదిబోమంటూ కొట్టుకొంటున్నారని,

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాతో పాటు అనేక రాష్ట్రాల్లో రుణ మాఫీ చేసినా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయాలని ఎవ్వరు చెప్పటం లేదన్నారు. అయితే సిద్దరామయ్య మాత్రం ఇటువంటి వితండమైన ప్రశ్నను ముందుంచుతున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీతో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తున్నందున జేడీఎస్‌తో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బళ్లారి రెడ్డి సహోదరులకు సర్వే ఆధారంగా టికెట్‌ ఇవ్వడమైనదని, జనార్ధనరెడ్డి టికెట్‌ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోలేదని తెలిపారు. 

రెడ్డి సహోదరుల, వారి అనుచరులపై ఎలాంటి ఆరోపణలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆనంద్‌సింగ్, నాగేంద్రలను పక్కలో కూర్చోపెట్టుకుని మరొకరి గురించి మాట్లాడే నైతిక హక్కు సిద్దరామయ్యకు ఉందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత క్యాబినెట్‌లో ముస్లీంలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్తమ పథకాలను కొనసాగించటంతో పాటు ఇందిరా క్యాంటిన్‌ను అన్నపూర్ణ పథకంగా పేరుమార్చి ముందుకు కొనసాగిస్తామని బీఎస్‌వై తెలిపారు. 

 ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ జీ.పరమేశ్వర్, లోక్‌సభలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలు ఒకే వేదికపై కూర్చొని పార్టీ తరపున ప్రచారం జరపాలని ఆయన సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ విడిపోయిన ఇల్లుగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాదనే విషయం అటు ఉంచిన చాముండేశ్వరి, బాదామిలో ముందు సీఎం గెలిచి రావాలని ఎదురుదాడి చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సిద్దరామయ్యకు ఓటమి తప్పదని, బాదామిలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు విజయం సాధిస్తారని, ఏ కారణానికి సిద్దరామయ్య గెలుపొందడని ఆయన ఓటమి సద్దిమూట అని జోస్యం చెప్పారు.  

అవినీతితో లూటీ చేసిన సిద్దరామయ్య తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, 70 లక్షల హుబ్లెట్‌ వాచ్‌ ఎవరు ఇచ్చారని రాష్ట్ర ప్రజల ముందు బహిరంగపరచాలని యడ్యూరప్ప తెలిపారు. కుల,మతాల మధ్య విష బీజం విత్తి రాజకీయ తీగను విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్న సిద్దరామయ్యకు ఇదే తిరుగు బాణం అవుతుందన్నారు. ప్రత్యేక లింగాయత్‌ మతం చేయాలని వీరిని ఎవరు అడిగారని, తాను ముఖ్యమంత్రి కాకూడదని ఒకే కారణానికి దానిని విడగొట్టే నీచమైన సంస్కృతికి దిగజారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ప్రతిఫలం కూడా నేడు సిద్దరామయ్య అనుభవిస్తారని తెలిపారు.  

మరిన్ని వార్తలు