సొంత నియోజకవర్గంలో రాహుల్‌కు చేదు అనుభవం

24 Jan, 2019 12:46 IST|Sakshi

లక్నో : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సొంత నియోజకవర్గం అమేథీలో చేదు అనుభవం ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ బుధవారం అమేథీలో పర్యటించారు. ఈ క్రమంలో.. ‘రాహుల్‌ గో బ్యాక్‌ టు ఇటలీ’  అంటూ రైతులు నిరసన చేపట్టారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ కోసం తీసుకున్న తమ భూములను వెనక్కి ఇచ్చేయాలి లేదా భూసేకరణకు బదులుగా ఉద్యోగం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు.

ఈ విషయం గురించి సంజయ్‌ సింగ్‌ అనే నిరసనకారుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్‌ గాంధీ విధానాలతో విసిగిపోయాం. ఆయన ఇటలీకి వెళ్లిపోవాల్సిందే. భారత్‌లో ఉండటానికి ఆయన అర్హులు కారు. మా భూములు లాక్కుని ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా 1980లో సామ్రాట్‌ సైకిల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు నిమిత్తం వ్యాపారవేత్తలు కౌసర్‌ సమీపంలో గల 65.57 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అయితే నిర్వాహకులు అప్పుల పాలైన నేపథ్యంలో లీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో 20.10 కోట్ల రూపాయల బాకీని వసూలు చేసేందుకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ(యూపీఎస్‌ఐడీసీ) 2014లో ఈ భూమిని వేలం వేసింది.

కాగా రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్టు 1,50,000 రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించి ఈ భూమిని కొనుగోలు చేసింది. అయితే ఈ విషయంలో యూపీఎస్‌ఐడీసీ, రాజీవ్‌ గాంధీ ట్రస్టు తీరును తప్పుబట్టిన గౌరీగంజ్‌ కోర్టు భూమిని సామ్రాట్‌ సైకిల్‌ ఫ్యాక్టరీకి అప్పగించాలంటూ ఆదేశించింది. దీంతో ఈ వేలాన్ని రద్దు చేస్తున్నట్లు యూపీఎస్‌ఐడీసీ ప్రకటించింది. కానీ ఆ భూమి ఇప్పటికీ రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్టు చేతిలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు