భూములిస్తే బతుకు లేకుండా చేస్తున్నారయ్యా..

21 Oct, 2018 04:00 IST|Sakshi
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పారాది వద్ద జనసందోహం మధ్య వైఎస్‌ జగన్‌ పాదయాత్ర, పోలవానివలస – మెట్టవలస రోడ్డులో సమస్యలు చెప్పుకుని కన్నీరు పెట్టుకున్న ఓ అమ్మకు ధైర్యం చెబుతున్న జననేత

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన రైతులు 

గ్రోత్‌ సెంటర్‌ పేరుతో తమ పొట్టకొట్టారని ఆవేదన 

దారిపొడవునా సమస్యలు విన్నవించిన జనం 

జూట్‌ మిల్లు తెరిపించాలని కోరిన కార్మికులు   

ఇంటి బిల్లులు ఇవ్వడం లేదన్న బడుగులు 

ఇంతింత ఫీజులైతే ఎట్టా చదువు కోవాలంటూ ఓ చిన్నారి ఆందోళన 

మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని జననేత భరోసా 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అడుగుపడనీయని అభిమానం.. చేతులు కలపాలని తాపత్రయం.. తమ అభిమాన నేతను చూశామన్న ఉత్సాహం, జెండాల రెపరెపలు, దారిపొడవునా జయజయధ్వానాలు, మంగళహారతులు.. మరో వైపు అడుక్కో వ్యథ.. గజానికో గుండెకోత.. వీటన్నిటి మధ్య శనివారం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సాగింది. విజయనగరం జిల్లా బొబ్బిలి శివార్ల నుంచి 289వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఇందిరమ్మ కాలని, పోలవాని వలస, మెట్టవలస, భోగరాజపురం క్రాస్, సీతారామపురం మీదుగా పారాది వరకు కొనసాగింది. దారిపొడవునా ఘనస్వాగతం పలికిన ప్రజలు అదే స్థాయిలో తమ సమస్యలనూ విన్నవించారు.  

భూమి లేదు.. ఉద్యోగం లేదు.. 
అందరి అభివృద్ధి కోసమని భూములిస్తే తమకే బతుకు లేకుండా చేస్తున్నారయ్యా అంటూ గ్రోత్‌ సెంటర్‌కు చెందిన పలువురు రైతులు వాపోయారు. బొబ్బిలి శివార్లలో ఏర్పాటు చేసిన గ్రోత్‌ సెంటర్‌ కోసం రైతులు సుమారు 1200 ఎకరాల పంట భూముల్ని ఇచ్చారు. భూములు తీసుకునే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. ‘మాతో పాటు మా పిల్లలకూ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పు డు అడిగితే మా పిల్లలు అర్హులు కాదంటూ సిఫార్సులు ఉన్న వారికి, ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. దీనికి తోడు కాలుష్యం పెరిగి అనారోగ్యం పాలవుతున్నాము’ అని రైతులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. కాలుష్య నివారణ సంస్థ అధికారులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే సంబంధిత యాజమాన్యాలు బెదిరిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

చదువుకోలేకపోతున్నాం సార్‌.. 
పాదయాత్ర ఇందిరమ్మ కాలనీ దాటుతుండగా భద్రతా సిబ్బందిని కూడా పట్టించుకోకుండా బిరబిరమంటూ దూసుకొచ్చిన ఓ పాప జగన్‌కు తన దీనగాథను చెప్పింది. ‘సార్‌.. మాది బొబ్బిలి ఐటీఐ కాలనీ. మా అమ్మ చిన్నమ్మ సెకండ్‌ ఏఎన్‌ఎం సార్‌.. మేము ఇద్దరు పిల్లలం. నా పేరు భువనేశ్వరి. ఎనిమిదవ తరగతి చదువుతున్నా. మా తమ్ముడు ధనుష్‌ నాలుగవ తరగతి. మా అమ్మకు వచ్చేది చాల తక్కువ జీతం సార్‌.. దాంతో ఫీజులు కట్టుకోవడం ఇబ్బందవుతోంది. ఏదో విధంగా మీరే ఆదుకోవాలి’ అంటూ జగన్‌ చేతులు పట్టుకుంది. అన్ని వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్న జగన్‌ త్వరలో ఫీజులు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తాలే తల్లీ.. అంటూ ఆశీర్వదించి ధైర్యం చెప్పారు. బాగా చదువుకోవాలని చెప్పారు. మీ అమ్మ జీతంతో పని లేకుండా చదివిస్తానని, పిల్లల్ని బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తామని ఆ పాపకు చెప్పారు.  

జూట్‌ మిల్లు మూత.. తప్పని వలస.. 
వేల మందికి ఉపాధి కల్పించిన శ్రీలక్ష్మి శ్రీనివాస జూట్‌ మిల్లు మూతపడిందని, ఈ మిల్లును తెరిపించి తమను ఆదుకోవాలని ఆ మిల్లు కార్మికులు జగన్‌ను కోరారు. జూట్‌ మిల్లు కార్మికుడు రామకృష్ణ నేతృత్వంలో జగన్‌ను కలిసిన కార్మికులు వారి ఇక్కట్లను ఏకరవుపెట్టారు. ఈ ప్రాంతంలోని మిల్లు మూత పడడంతో వందలాది మంది కార్మికులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మిల్లులో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమను ఆదుకోవాలని కోరారు.  

ఇంటి బిల్లు ఇవ్వం అంటున్నారు.. 
బడుగులకు ఇళ్లు పేరిట ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని పలువురు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. అలజంగి గ్రామానికి చెందిన పెంకి లలిత ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే పది బస్తాల సిమెంట్‌ను మంజూరు చేశారు. దాంతో ఇల్లు కట్టుకుంటుంటే మిగతా సామగ్రి, డబ్బు ఇస్తామని అధికారులు చెప్పారు. ఈ మాటలను నమ్మిన లలిత.. ఇంటి నిర్మాణం చేపట్టింది. గోడలు పూర్తయ్యాయి. పైన స్లాబ్‌ వేసుకుంటామయ్యా.. డబ్బులు మంజూరు చేయండంటే ససేమిరా అంటున్నారట అధికారులు. పలు గ్రామాల మహిళలు సైతం ఇదే తరహా సమస్యను జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ఇల్లు కట్టుకునేందుకు సాయపడాలని కోరారు. రామభద్రాపురంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని పలువురు విద్యార్థులు వినతి పత్రం ఇచ్చారు. మనందరి ప్రభుత్వం రాగానే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి మండలానికి ఒక జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.  

ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య 
రుణమాఫీ అయినట్టు రైతు సాధికార సంస్థ నుంచి లేఖ వచ్చినా బ్యాంకులోళ్లు కాలేదని చెబుతున్నారని మెట్టవలసకు చెందిన పల్లా సత్యారావు, వైఎస్సార్‌ చలువతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద తమ పిల్లలు పెద్ద చదువులు చదివినా ఇప్పుడు ఉద్యోగాలు రావడం లేదని గుంతాటవలసకు చెందిన రాములమ్మ, పైడితల్లి, పోలమ్మలు జగన్‌తో చెప్పుకున్నారు. దివ్యాంగులకు ఇల్లు లేదా ఇంటి స్థలం ఇవ్వాలని బి.త్రినాథరావు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు కె.శంకర్రావ్, కొండాకింగ్వా రోడ్డుకు నిధులు మంజూరు చేసినట్టు స్థానిక మంత్రి చెబుతున్నా ఇంతవరకు రోడ్డు పడలేదని ఆ ఊరి పెద్దలు కామా తిరుపతి, కామినీడు.. ఇలా ఎందరో తమ సమస్యలను జగన్‌కు విన్నవించారు. మనందరి ప్రభుత్వం రాగానే అందరి సమస్యలను  పరిష్కరిస్తామని జననేత భరోసా ఇచ్చారు. 

ఏమ్మా..పిల్లలు బాగున్నారా? 
ఓదార్పు యాత్రలో భాగంగా తనింటికి వచ్చి తమ పిల్లల యోగక్షేమాలు అడిగిన జగన్‌కు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు వచ్చిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. తనను కలవడానికి వచ్చిన ఆమెను చూడగానే జగనే ఆమెను.. ఏమ్మా బాగున్నావా.. అంటూ పలకరించడంతో శిష్ట సీతారామపురం గ్రామానికి చెందిన శిష్టు లక్ష్మి ఆనంద భాష్పాలు రాల్చింది. అమ్మాయి పదో తరగతి చదువుతోందని, ఉన్నత చదువుల కోసం సహకారం కావాలని ఆమె కోరింది. ‘త్వరలో మన ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు ఎవ్వరి సహకారం అవసరం లేదు.. మీ అమ్మాయి చదువుకు నాదీ పూచి’ అని జననేత చెప్పడంతో ఆమె సంబరపడిపోయింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల కిందట జగన్‌ను చూశానని, ఇన్ని రోజులైనా ఆయన తనను గుర్తు పెట్టుకుని పలకరించడంతో సంతోషంగా ఉందంది. తాను కృతజ్ఞతలు చెప్పడానికి వస్తే ఆయనే పలకరించడంతో తాను ఆశ్చర్యపోయానని, ఇది తన జీవితంలో మరువలేని అనుభూతి అంది. జగన్‌ అధికారంలోకి రాగానే పిల్లల చదువులకు ఢోకా ఉండదని, ఎదురు డబ్బులిచ్చి చదివిస్తానని చెప్పారని ఆమె ఉబ్బితబ్బిబ్బయింది. 

వైఎస్సార్‌సీపీలోకి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు 
గుంటూరు జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న ప్రముఖ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని ప్రజా సంకల్ప యాత్ర శిబిరం వద్ద శనివారం గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని ఆధ్వర్యంలో ఆ జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు, విజయవాడ ఆర్టీసీ రీజినల్‌ మాజీ చైర్మన్, ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్‌ మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు బిల్ల శివయ్యతో పాటు నేతలు గుంటు వెంకటరావు, కె.కాంతారావు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లాది శివన్నారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నానని, రాష్ట్రంలో తొలి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది తానేనని తెలిపారు. నాలుగున్నరేళ్ల బాబు పాలనలో ప్రజలకు మేలు జరగలేదన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ బతికుండగానే చంద్రబాబునాయుడు సమాధి కట్టారని, పార్టీని భ్రష్టుపట్టించారన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏడాది కాలంగా అలుపెరుగని యోధుడిలా పాదయాత్ర చేస్తున్న జగన్‌తోనే సంక్షేమ రాజ్యం ఏర్పడుతుందని తెలిపారు. అందువల్లే జననేత జగన్‌ అడుగుజాడల్లో నడవాలనుకున్నానని వివరించారు.

ఉద్యోగాలిస్తామని మోసం చేశారు.. 
అయ్యా.. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ కోసం రైతుల నుంచి భూములు సేకరించినప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ మాట నిలుపుకోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులు ఉన్న వారికి మంచి ఉద్యోగాలు ఇచ్చి, భూములు ఇచ్చిన వారికి దినసరి కూలీలుగా అవకాశం ఇస్తున్నారు. వారిని కూడా ఉన్నపళంగా ఇంటికి వెళ్లగొడుతున్నారు. సుమారు 12 వేల ఎకరాల భూమిని  ఇచ్చాం. 200 కంపెనీలు కడతామని చెప్పారు. కానీ 30 కంపెనీలకు మించి ప్రారంభం కాలేదు. కాలుష్యం కూడా ఎక్కువగా ఉంది. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదు. నేను 2007లో గుండె సంబంధ వ్యాధితో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయించుకున్నాను. నా భార్య వరలక్ష్మి కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ 2011లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందింది. ఈ రోజు మేము బతికి ఉన్నామంటే అది రాజన్న చలువే.  
– ఎ.కృష్ణారావు, మెట్టవలస, బొబ్బిలి మండలం 

దివ్యాంగులను మోసం చేశారన్నా..  
అన్నా.. చంద్రబాబు నాయుడు దివ్యాంగులను దారుణంగా మోసం చేశారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి మాట మార్చారు. 2014 ఎన్నికల్లో దివ్యాంగులైన మాకు ఇళ్లు, ఇళ్ల స్థలాలను ఇస్తామన్నారు. నాలుగున్నరేళ్లు గడిచినా ఎవరికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అంత్యోదయ కార్డులు లేవు. బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో చదువుకున్న దివ్యాంగ యువత దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మాకు లోన్లు అందించేందుకు కూడా బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. ఎటువంటి ఉపాధి లేక నరకయాతన పడుతున్నామన్నా. మీరు అధికారంలోకి రాగానే మాకు న్యాయం చేయాలి. 
–  బోను త్రినాథరావు,బాలరాజు దివ్యాంగుల సేవా సంఘం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు, విజయనగరం  

పింఛన్‌ రూ.2,050 వస్తే ఎలా బతకాలయ్యా..  
అయ్యా.. నా భర్త ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయనకు రూ.2,050 పింఛన్‌ వస్తోంది. ఇంత తక్కువ పింఛన్‌తో పిల్లలతో బతకడం కష్టంగా ఉందయ్యా.. పిల్లలను చదివించుకోవడం చాలా కష్టమవుతోంది. అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యం చేయించుకోవడం కూడా కష్టంగా ఉంది. ఉద్యోగ విరమణ చేశాక ఆ కుటుంబం బతకాలంటే జీతంలో సగమన్నా పింఛన్‌ వచ్చేలా చేయండయ్యా.. మీ ప్రభుత్వం వస్తే ఈ సమస్యను తప్పనిసరిగా పరిష్కరించాలయ్యా..  
– బారు సోములు, ఐటీ కాలనీ, బొబ్బిలి 

మరిన్ని వార్తలు