మీరొస్తేనే మాకు న్యాయం

18 Jun, 2018 01:50 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం గంటిలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు సమస్యలు వివరిస్తున్న కొబ్బరి రైతులు

వైఎస్‌ జగన్‌ ఎదుట వివిధ వర్గాల ప్రజల ఆకాంక్ష

దారిపొడవునా సమస్యలు ఏకరువు.. చుట్టూ పచ్చదనం ఉన్నా.. పరిస్థితి దయనీయమని ఆవేదన 

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని వాపోయిన రైతులు

రుణ అర్హత పత్రాలు ఇప్పించాలని కోరిన కౌలుదారులు

మన ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని జననేత హామీ 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘ప్రకృతి సోయగాలు.. కోనసీమ అందాలు.. గోదావరి కాల్వలు.. కనుచూపు మేర పచ్చదనం కనిపిస్తున్నా, పాలకుల విధానాల వల్ల ఏ ఒక్కరం సంతోషంగా లేము..’ అని వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మీరొస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగాంగా 191వ రోజు ఆదివారం వైఎస్‌ జగన్‌ తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించారు. రైతులు, రైతు కూలీలు, కొబ్బరి వలుపు కార్మికులు, డాక్యుమెంట్‌ రైటర్లు, యానిమేటర్లు, కౌలు రైతులు, ఆటోవాలాలు.. ఇలా వివిధ వర్గాల ప్రజలు జగన్‌కు వారి సమస్యలను విన్నవించారు.

ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీని గెలిపించామన్న సాకుతో ఊళ్లల్లో వీధి దీపాలు కూడా వెలిగించడం లేదని, నిన్న మొన్నటి వరకు మంచినీళ్లకూ కటకటలాడాల్సివచ్చిందని జగన్‌ ఎదుట వాపోయారు. మరోవైపు తమ సమస్యలు వినే నాయకుడు వచ్చారంటూ ఊరూరా ఘన స్వాగతం పలికారు. వెదిరేశ్వరం నుంచి యాత్ర ప్రారంభమైన వెంటనే అరటి గెలలు లోడు చేసే కార్మికులు కలిశారు. ‘అన్నా.. రావులపాలెం యార్డ్‌ దేశంలోనే అతిపెద్ద అరటి మార్కెట్‌. ఈ పంటపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఎకరంలో అరటి పంట పండించటానికి అన్ని ఖర్చులు కలిపి రూ.2.50 లక్షలు అవుతుంది. కానీ పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర ఉండటం లేదు. ఉచిత ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి. కనీస మద్దతు ధర ఉండేలా చూడాలి. వెదురు కర్రను సబ్సిడీపై ఇప్పించాలి. అరటి గెలలు సైకిళ్లపై వేసుకొని మార్కెట్లో అమ్మకానికి వెళ్లే సమయంలో ఎందరో రైతులు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. అలాంటి వారి కుటుంబాలను ఆదుకోవాలి. అరటి గెలలు తరలించేందుకు అవసరమైన మోటారు సైకిళ్ల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు ఇప్పించాలి’ అని కోరారు.  
వెదిరేశ్వరంలో వైఎస్‌ జగన్‌ వెంట అడుగులేస్తున్న అశేష జనవాహిని
 
కొబ్బరి కాయలకు మద్దతు ధర ఇప్పించండి 
అన్ని పంటల మాదిరే కొబ్బరి కాయలకూ మద్దతు ధర ఇప్పించాలని రైతు నాయకుడు రెడ్డి వెంకటరామసుబ్రమణ్యం నేతృత్వంలో పలువురు రైతులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. కోనసీమలో వరి తర్వాత కొబ్బరి ప్రధాన పంట అని వివరించారు. రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇప్పించాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు.  
కొబ్బరి కాయల వలుపు కార్మికులకు 40 ఏళ్లకే పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని శ్రీ లక్ష్మీగణపతి కొబ్బరి కాయల వలుపు కార్మిక సంఘం (పలివెల) నేతలు రంగుమళ్ల రాజేష్, ఆర్‌ చంద్రశేఖర్‌రావులు కోరారు.     నిత్యం కిందకు వంగి కొబ్బరి పీచు వలవడం వల్ల చిన్న వయసులోనే నడుములు వంగిపోయి ఇక్కట్లు పడుతున్నామని వాపోయారు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ అందడం లేదని కౌలు రైతుల సంఘం నాయకుడు, వెదిరేశ్వరం మాజీ సర్పంచ్‌ చిట్టూరి సత్యనారాయణ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారని, రుణ అర్హత పత్రాలు ఇప్పించి వడ్డీ లేని పంట రుణాలు అందజేయాలని కోరారు.  

అన్నీ సమస్యలే అన్నా.. 
శిక్షణ లేదన్న సాకుతో తమ లైసెన్స్‌లు రద్దు చేశారని పలువురు దస్తావేజు లేఖరులు ఈతకోట సమీపంలో వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. శిక్షణ పూర్తి చేసిన వారికి కూడా టీడీపీ ప్రభుత్వం లైసెన్స్‌లు పునరుద్ధరించడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో తమకు మరిన్ని సీట్లు కేటాయించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి జగన్‌ను కోరింది. సబ్‌ప్లాన్‌ నిధులను ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసమే ఖర్చు చేసేలా చూడాలని పూలే, అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి నేతలు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తమను బీసీల్లో చేరుస్తామని చెప్పి మోసం చేశారని, కాపు కార్పొరేషన్‌కు ఇస్తామన్న నిధులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని కొత్తపేట కాపు జేఏసీ జగన్‌కు ఫిర్యాదు చేసింది. గోపాల మిత్రలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ రెండో ఏఎన్‌ఎంలు, విద్యార్థులు.. జగన్‌కు వారి సమస్యలు విన్నవించారు. అందరి సమస్యలు ఓపికగా విన్న జననేత.. మన ప్రభుత్వం రాగానే అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వెదిరేశ్వరం వద్ద ఆటోవాలాలు కోరడంతో వైఎస్‌ జగన్‌ ఖాకీ చొక్కా వేసుకుని ఆటో నడిపారు. దీంతో వారు పెద్ద పెట్టున కేరింతలు కొట్టారు. ఏటా తమకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనపై పూల వర్షం కురిపించారు.       

మరిన్ని వార్తలు