అప్పు పుట్టట్లేదు.. ఎట్టాబతకాలయ్యా? 

29 Aug, 2018 03:22 IST|Sakshi
విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం హరిపాలెంలో పూలకుండీ తయారీని తెలుసుకుంటున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ , హరిపాలెంలో ప్రజలకు అభివాదం చేస్తున్న జననేత

చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం.. 

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన రైతులు 

ఆయన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు 

బంగారం వేలం వేస్తున్నారు.. కొత్త అప్పులివ్వడం లేదు 

చెరకుకు గిట్టుబాటు ధర లేదు.. బెల్లం ధర తగ్గిస్తున్నారు 

వ్యవసాయం తప్ప మరో పని చేతకాదని ఆవేదన

 సమస్యలు ఏకరువు పెట్టిన నిర్వాసితులు, కుల వృత్తిదారులు

అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు సాగిన జననేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘రుణమాఫీ అన్నాడు.. లోన్‌ కట్టొద్దన్నాడు.. ఆయన మాటలు నమ్మి అప్పుడు అప్పు కట్టలేదు.. ఇప్పుడేమో బ్యాంకులోళ్లు నోటీసులిస్తున్నారు.. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని వేలం వేస్తున్నారు.. పాత అప్పు పోదు.. కొత్తది పుట్టదు.. అధిక వడ్డీకి అప్పు చేసి సాగు చేస్తే గిట్టుబాటు కాదు.. కాయకష్టం తప్ప మిగిలిందేమీ లేదు.. వ్యవసాయం వదిలేద్దామంటే మరో దారి లేదు.. మేమెట్టా బతకాలయ్యా..?’ అని అన్నదాతలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 248వ రోజు మంగళవారం ఆయన విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో పాదయాత్ర సాగించారు. కొండకర్ల జంక్షన్‌ మొదలు.. హరిపాలెం, పెదపాడు క్రాస్, తిమ్మరాజు పేట వరకు దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు మేళతాళాలు, బాణాసంచా పేలుళ్లు, మంగళహారతుల మధ్య  ప్రియతమ నేతకు ఘన స్వాగతం పలికారు. వైఎస్‌ జగన్‌ వివాహ వార్షికోత్సవం కూడా కావడంతో పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. మరోవైపు తమ కష్టాలనూ చెప్పుకున్నారు.   

పాత వడ్డీ అంతా కట్టాలంటున్నారు.. 
చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ పథకం కింద ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బు వడ్డీకి కూడా సరిపోలేదని హరిపురం గ్రామ రైతులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. రైతులు తీసుకున్న రుణాలపై వడ్డీ, అపరాధ రుసుం వేసి నానా ఇబ్బందులు పెడుతున్నారని, పాత వడ్డీ కడితేనే కొత్త అప్పు ఇస్తామంటున్నారని ఎం సూర్యనారాయణ నాయకత్వంలో కలిసిన రైతులు వాపోయారు. కొండకర్ల ఆవ ప్రాంతాన్ని కాపాడాలని కోరారు. ఆవ దిగువన ఉన్న 20 గ్రామాల రైతులకు న్యాయం చేయాలని విన్నవించారు. తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు మేలు జరిగేలా చూడాలన్నారు. ఈ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న ప్రభుత్వ యత్నాలను తిప్పికొట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.  

కుల వృత్తుల్ని కాపాడండి సార్‌..  
హరిపాలెంలో పలువురు కులవృత్తుల వారు జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ ప్రాంతంలో కుమ్మర్లు ఎక్కువని, ఇటీవలి కాలంలో తాము తయారు చేసే కుండలు, ఇతర మట్టి పాత్రలకు ఆదరణ కరవైందని వివరించారు.  మీరు ముఖ్యమంత్రి కాగానే కుమ్మర కుల వృత్తిని కాపాడేలా చర్యలు చేపట్టాలని కోరారు. తమకూ 45 ఏళ్లకే పెన్షన్‌ ఇచ్చేలా చూడాలని, కుమ్మరి షెడ్లు వేసుకునేందుకు లోన్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కల్లు గీత కార్మికులు కలిసి తమ కష్టాలను వివరించారు.   

పేదలకు ఆర్థిక భరోసా కల్పించండి.. 
రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని, నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని జగన్‌ను కలిసిన పలువురు మేధావులు సూచించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేసి ఆహార భద్రత కల్పించాలని కోరారు. ప్రతి కుటుంబానికి ఎకరా భూమి అయినా ఉండేలా చేస్తే ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుందని డాక్టర్‌ డి.వెంకట్‌ చెప్పారు. గోకివాడ ఆయకట్టుకు నీరు అందేలా రిజర్వాయర్‌ నిర్మించాలని విశాఖ జిల్లా గోకివాడ గ్రామస్తులు జగన్‌ను కోరారు. ఆనకట్ట నిర్మించక పోవడంతో చాలా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.60 కోట్లు కేటాయించారని, ఆయన అకాల మరణంతో రిజర్వాయర్‌ పనులు నిలిచిపోయాయన్నారు.
 
టీడీపీ నేతల ఇష్టారాజ్యం
అచ్యుతాపురం మండలం జగన్నాధపురం గ్రామంలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. గ్రావెల్‌ క్వారీలను అక్రమంగా తవ్వేస్తూ ఇతరులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. నేవల్‌ బేస్‌ నిర్వాసితులు ఆరు రోజులుగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా ఏ ఒక్క అధికారీ స్పందించలేదని పలువురు జగన్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అండతో అనర్హులకు పునరావాస కాలనీల్లో ఇళ్లు, స్థలాలు, ప్యాకేజీ ఇప్పించేందుకు ప్రయత్నం జరుగుతోందని వివరించారు. ఇదిలా ఉండగా ప్రజా సంకల్ప యాత్ర పట్ల దేశ విదేశాల్లోని తెలుగు వారు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఖతార్‌లో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా మలికీపురానికి చెందిన చింతలపాటి శ్రీనివాసరాజు మంగళవారం పాదయాత్రలో పాల్గొన్నారు. 

చెరకు తీపే.. మా బతుకులే చేదు..  
తిమ్మరాజుపేటలో పెద్ద సంఖ్యలో రైతులు వైఎస్‌ జగన్‌ను కలిసి ఇక్కట్లను ఏకరవుపెట్టారు. ముత్యాల నాయుడు అనే రైతు ఈ ప్రాంత రైతుల ఇబ్బందులను జగన్‌కు వివరించారు. చెరకు సాగు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని, వైరస్‌ సోకి పంట తెగుళ్ల బారిన పడుతోందన్నారు. లాభం మాట అటుంచి కనీసం పెట్టిన ఖర్చు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెరకు గిట్టుబాటు కావడం లేదని బెల్లం వండితే రంగు వాడొద్దని చెబుతున్నారని, అవి లేకుండా వండితే బెల్లం నల్లగా ఉంటోందని రేటు తగ్గించి వేస్తున్నారన్నారు. బెల్లం నల్లగా రావడం, తెల్లగా రావడమనేది రైతుల చేతుల్లో ఉంటుందా.. అని వాపోయారు. చెరకుకు బదులు బెండ సాగు చేస్తే కిలో రూపాయికి ఇస్తావా? అర్ధ రూపాయికి ఇస్తావా? అని దళారులు అడుగుతుంటే ఏంటీ బతుకులు అనిపిస్తోందన్నారు.

పావు కేజీ బెండ విత్తనాలు రూ.1500 – రూ.2 వేలు పెట్టి కొనుక్కొచ్చి సాగు చేస్తే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందని మరో మహిళాæ రైతు చెప్పారు. ఇవేవీ గిట్టుబాటు కావడం లేదని అరటి సాగు చేస్తే ఈ మాదిరి పిలకలు (జగన్‌కు అరటి మొక్కలు చూపిస్తూ) వస్తున్నాయని వాపోయారు. వారి సమస్యలను ఓపిగ్గా విన్న జగన్‌.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే రైతులకు అమలు చేయబోయే పథకాల గురించి వివరించారు. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని, పంట వేయడానికి ముందే మద్దతు ధర ప్రకటిస్తామని, ప్రతి రైతుకూ ఖరీఫ్‌కు ముందే రూ.12,500 పెట్టుబడి సాయం ఇస్తామని భరోసా ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.  

పని లేక పిల్లలు బలాదూర్‌గా తిరుగుతున్నారు.. 
బాబు వస్తే జాబు వస్తుందన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నాడు. మా ఏజెన్సీలో డిగ్రీలు, పీజీలు చదివిన పిల్లలు పనీ పాటా లేక బలాదూర్‌గా తిరుగుతున్నారు నాయనా.. నువ్వు అధికారంలోకి రావాలి. మా పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఏజెన్సీల్లో గిరిజనులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదు. నీతో మా గోడు చెప్పుకోవడం కోసమే అరకు నుంచి వచ్చాం. మా ఆశలన్నీ నీపైనే. 
– బిరత్నకుమారి, వరాలమ్మ, గూడ గ్రామం  

మా బాబుకు మాటలు రప్పించండన్నా.. 
అన్నా.. మాది మునగపాక మండలం రామగిరి. మా అబ్బాయి పల్లా జ్ఞానవర్ధన్‌ రెండేళ్ల దాకా బావుండేవాడు. ఆ తర్వాత వినికిడి శక్తి కోల్పోయాడు. మాట కూడా రాలేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందని ఆస్పత్రికి వెళ్తే ఏడాదిన్నార లోపు చిన్నారులకైతేనే ఆపరేషన్‌ చేస్తామన్నారు. మా బాబుకు ఈ ఆపరేషన్‌ వర్తించదని చెప్పారు. ప్రైవేటుగా వైద్యం చేయించుకుందామని వెళ్తే ఏకంగా రూ.8 లక్షలు ఖర్చవుతుందన్నారు. మాది చాలా పేద కుటుంబం. కూలికి వెళ్తే కాని పూట గడవని పరిస్థితి. ఇప్పుడు మా బాబుకు ఎనిమిదేళ్లు. ఎలాగైనా మా బాబుకు మాట వచ్చేట్లు చేయండన్నా. 
– తిమ్మరాజుపేటలో వైఎస్‌ జగన్‌తో జ్ఞానవర్ధన్‌ తల్లి శివలక్ష్మి 

మరిన్ని వార్తలు