మీడియా ఎదుట ప్రత్యక్షమైన ఫరూక్‌

6 Aug, 2019 16:25 IST|Sakshi

అమిత్‌ షా అబద్ధాలు చెప్తున్నారు

ఆగ్రహం వ్యక్తం చేసిన ఫరూక్‌

శ్రీనగర్‌ : రాష్ట్రం తగులబడుతుంటే.. తాను ఇంట్లో ఎలా కూర్చుంటానని నేషనల్ కాన్ఫరెన్స్‌ సీనియర్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతుండగా ఫరూక్‌ సభలో లేకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. అమిత్‌ షా తను కావాలనే ఇంట్లో కూర్చున్నట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. తనను గృహ నిర్భందం చేశారని.. తన కొడుకు ఒమర్‌ను కూడా అరెస్ట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానిప్పుడు తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చానన్నారు ఫరూక్‌.

రాష్ట్రం అల్లకల్లోలంగా మారిన సమయంలో ఇంట్లో ఎలా కూర్చుంటానని ప్రశ్నించారు. తనను, రాష్ట్ర ప్రజల్ని కాపాడలంటూ మీడియా ఎదుట భావోద్వేగానికి లోనయ్యారు. ‘కేంద్ర నాయకులు ప్రాంతాలను విభజించారు. కానీ, హృదయాలను కూడా విభజిస్తారా. జనాలను కూడా హిందూ, ముస్లింలుగా విభజిస్తారా.ఈ దేశం లౌకికతను, ఐక్యతను విశ్వసిస్తుందని భావించాను. కానీ నేడు బీజేపీ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించింది’అని వాపోయారు.

మరిన్ని వార్తలు