మేం పోరాడతాం కోర్టుకు వెళ్తాం

7 Aug, 2019 03:04 IST|Sakshi

రాష్ట్ర విభజనతో శరీరాన్ని కోసేసినట్లుగా అనిపించింది

తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టిన ఎన్సీ చీఫ్‌ ఫారూఖ్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌/న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ను విభజించడం అంటే శరీరాన్ని ముక్కలుగా కోసేసినట్లుగా తనకు అనిపిస్తోందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫారూఖ్‌ అబ్దుల్లా తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై తాము పోరాడతామనీ, కోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం అయిన ఫారూఖ్‌.. 370వ అధికరణం రద్దయిన తర్వాత తొలిసారిగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు.

కేంద్రం ప్రజాస్వామిక అధికారాలతో కాకుండా నియంతృత్వ అధికారంతో జమ్మూ కశ్మీర్‌ను రెండు ముక్కలు చేసిందనీ, పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను తొలగించిందని ఫారూఖ్‌ మండిపడ్డారు. ‘ద్వారాలు తెరుచుకున్న వెంటనే మా ప్రజలు బయటకు వస్తారు. మేం పోరాడుతాం. కోర్టుకు వెళ్తాం. మేం తుపాకులు పట్టుకుని తిరగలేదు. గ్రెనేడ్లు, రాళ్లు విసరలేదు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడాన్ని మేం నమ్ముతాం. వాళ్లు మమ్మల్ని హత్య చేయాలనుకుంటున్నారు. మేం సిద్ధం. నా ఛాతీ సిద్ధంగా ఉంది. ఛాతీపై కాల్చండి. వెనుక కాదు’అంటూ ఫారూఖ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌ను విభజించిందనీ, ఇక ఇప్పుడు ప్రజల మనసులను కూడా విడగొడతారా అని ఉద్వేగంతో ప్రశ్నించారు. 

సభలోనే అబద్ధం చెప్పడం విచారకరం.. 
‘నన్ను గృహనిర్బంధంలో ఉంచలేదని హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంటులోనే అబద్ధం చెబుతున్నారు. నా ఇష్టంతోనే నేను ఇంట్లో నుంచి బయటకు రాలేదని ఆయన అంటున్నారు. కానీ మా ఇంటి ముందు ఓ డీఎస్పీని మోహరించారు. నన్ను బయటకు వెళ్లనివ్వలేదు. ఎవ్వరినీ లోపలకు రానివ్వలేదు. ఇప్పుడు మీడియాతో మాట్లాడటానికి బయటకు వచ్చేందుకు కూడా నేను చాలా కష్టపడ్డాను. సభలోనే హోం మంత్రి ఇలా అబద్ధాలు చెప్పడం విచారకరం’అని ఫారూఖ్‌ వివరించారు. శ్రీనగర్‌ ఎంపీ అయిన ఫారూఖ్‌ మంగళవారం లోక్‌సభలో లేకపోవడంతో ఆయనను అరెస్ట్‌ చేశారా లేక గృహనిర్బంధంలో ఉంచారా? అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించగా, అమిత్‌ షా సమాధానమిస్తూ ‘ఆయనను అరెస్టు చేయలేదు.

గృహ నిర్బంధంలో ఉంచలేదు. ఆయన తన ఇష్టం మేరకు ఇంట్లోనే ఉన్నారు’అని బదులిచ్చారు. మరి ఫారూఖ్‌కు ఆరోగ్యమేమైనా బాగాలేదా అని సుప్రియ ప్రశ్నించగా, ‘అది వైద్యులే చెప్పాలి. నేను వైద్యం చేయలేను’అని వ్యంగ్యంగా సమాధానం చెప్పారు. కాగా, ఫారూఖ్‌ మాట్లాడుతూ ‘వాళ్లు (ప్రభుత్వం) ప్రాంతాలను విడదీశారు. ఇప్పుడు ప్రజల మనసులను కూడా విడగొడతారా? హిందూ, ముస్లింలను విడదీస్తారా? నా భారతదేశం లౌకికవాదాన్ని, ఐక్యతను నమ్మే ప్రతీ ఒక్కరిదీ అని నేను భావించాను.70 ఏళ్లుగా మేం యుద్ధంలో పోరాడాం. కానీ ఇప్పుడు దోషులమవుతున్నాం’అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు