ఫరూక్‌ను చూస్తే కేంద్రానికి భయమా!?

17 Sep, 2019 15:13 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఫరూక్‌ అబ్దుల్లా

సాక్షి, న్యూఢిల్లీ : గత నెల పదిహేను రోజులుగా గృహ నిర్బంధంలో ఉంచిన జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు, పార్లమెంట్‌ సభ్యుడు ఫరూక్‌ అబ్దుల్లాపై కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా సోమవారం కశ్మీర్‌కే పరిమితమైన ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగించింది. ఆయన్ని అరెస్ట్‌ చేసి, ఆయన ఇంటినే జైలుగా మార్చింది. ఆయన తరఫున దాఖలైన ‘హబియస్‌ కార్పస్‌’ పిటిషన్‌ విచారణకు రానున్న ఒక రోజు ముందు కేంద్రం ఈ చర్య తీసుకోవడం ప్రజాస్వామ్య వాదులకు ఆశ్చర్యం కల్గిస్తోంది. 

ఈ ప్రజా భద్రత చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా ఎవరినై రెండేళ్లపాటు జైల్లో ఉంచొచ్చు. ఫరూక్‌ అబ్దుల్లా తండ్రి షేక్‌ అబ్దుల్లా హయాంలో (1978లో) కలప స్మగ్లర్లను అణచివేయడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే రానురాను కశ్మీర్‌ వేర్పాటువాదులను అణచివేసేందుకు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు. ముఖ్యంగా 1990, 2008, 2010, 2016లలో కశ్మీర్‌లో జరిగిన ఆందోళనలను అణచివేసేందుకు కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఆ సందర్భంగా దాదాపు ఆరువేల మందిని అరెస్ట్‌ చేసి వారిలో 327 మంది వేర్పాటువాదులపై చార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. ఈ చట్టాన్ని సుప్రీం కోర్టు ‘లాలెస్‌ లా (చట్టరహిత చట్టం)’ అని వ్యాఖ్యానించింది. ఈ చట్టం కింద అదుపులోకి తీసుకున్న వారిని ఎందుకు అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందో పది రోజుల వరకు కూడా పోలీసులు వెల్లడించాల్సిన అవసరం లేదు. 


1989లో శ్రీనగర్‌లో జరిగిన అల్లర్ల దశ్యం

‘ప్రజా భద్రత’ పేరిట ఆ తర్వాత కూడా ఎలాంటి కారణం చూపకుండానే పొడిగించవచ్చు. అయితే నాలుగు వారల లోపల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బోర్డు ముందు నిర్బంధితులను హాజరు పరిచి కేసును సమీక్షించాలి. ఈ బోర్డులో అర్హత కలిగిన జడ్జీలను లేదా అర్హత లేని జడ్జీలను కూడా నియమించవచ్చు. బోర్డులోని జడ్జీలు లేదా సభ్యుల వివరాలను బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. నిర్బంధితులకు తమ తరఫున న్యాయవాదులను నియమించుకునే అవకాశం కూడా లేదు. సాధారణంగా ‘జాతీయ భద్రత’ పేరిట ఎవరినైనా ఆరు నెలలపాటు నిర్బంధించవచ్చు. దీన్ని రెండేళ్లపాటు ఏకపక్షంగా పొడిగించవచ్చు. ఈ నిర్బంధాన్ని కోర్టు ఎన్నిసార్లు కొట్టివేసినా తాజా ఉత్తర్వుల ద్వారా నిర్బంధాన్ని ఎంతకాలమైనా పొడిగించవచ్చు. 


 20 ఏళ్లకుపైగా జైల్లో ఉన్న మసరత్‌ ఆలమ్‌ భట్‌
1990 దశకంలో ముస్లిం లీగ్‌ నాయకుడు, వేర్పాటు వాది మసరత్‌ ఆలమ్‌ భట్‌పై 37 సార్లు ఈ ప్రజా భద్రతా చట్టాన్ని (పీఎస్‌ఏ)ను ప్రయోగించడంతో ఆయన ఏకంగా 20 ఏళ్లపాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కలప దొంగల అణచివేత కోసం తీసికొచ్చిన ఈ చట్టం కింద రాజకీయ నాయకులతోపాటు కశ్మీర్‌ బార్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ సహా న్యాయవాదులను, కశ్మీర్‌ వాణిజ్య మండలి సభ్యులు సహా వ్యాపారవేత్తలను అరెస్ట్‌ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరిలో ఎవరు ప్రజాందోళనలు నిర్వహించిన వారు కాదు, ప్రజా భద్రతకు ముప్పు తెచ్చిన వాళ్లు కాదు. ముదుసలి వయస్సులో ఫారూక్‌ అబ్దుల్లాను అరెస్ట్‌ చేయడం అంటే మున్ముందు ఆయన ఏ ముప్పు తెస్తాడో ఏమోనని కేంద్రం భయపడుతుండడమేనని ప్రజాస్వామ్య వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరిన్ని వార్తలు