మంత్రులుగా ఫరూక్, శ్రావణ్‌ ప్రమాణం

12 Nov, 2018 03:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: మరో కొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లిం, గిరిజన వర్గాలకు చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్ర మంత్రులుగా ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్‌కుమార్‌ ఆదివారం ప్రమాణం చేశారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ వారిద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో ఉదయం 11.45 నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఫరూక్‌ తెలుగులో, ఆ తర్వాత శ్రావణ్‌కుమార్‌ ఇంగ్లిష్‌లో తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామంటూ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు.

కొత్త మంత్రులు ఇద్దరినీ గవర్నర్‌ అభినందించారు. కిడారి శ్రావణ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రావణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండుసార్లు పాదాభివందనం చేశారు. ప్రమాణం సందర్భంగా తెలుగు పదాలను ఉచ్చరించడానికి ఫరూక్‌ కొద్దిగా తడబడ్డారు. ఏడు నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం మంత్రివర్గ సభ్యులతో గవర్నర్, ముఖ్యమంత్రి గ్రూప్‌ ఫొటో దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

మరిన్ని వార్తలు