ఉద్ధవ్‌-ఆదిత్యల అరుదైన ఘనత

28 Nov, 2019 09:28 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన చరిత్రను సృష్టించబోతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నేడు పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆరు నెలల్లో ఆయన శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక తర్వాత రాష్ట్ర శాసనసభలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకే సభలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా తొలిసారి కనిపించబోతున్నారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రకు సంబంధించినంతవరకు ఇలాంటి రికార్డు నమోదుకావడం ఇదే తొలిసారి. ‘రాష్ట్ర అసెంబ్లీలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి. ఇది అరుదైన రికార్డుగా చెప్పవచ్చు’ అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ కార్యదర్శి అనంత్‌ కల్సే తెలిపారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వర్లీ నుంచి ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఉద్ధవ్‌ ఠాక్రే తండ్రి బాలాసాహెబ్‌ ఠాక్రే, సోదరుడు రాజ్‌ ఠాక్రే ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఠాక్రేల కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తి ఆదిత్య కాగా.. ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారి ఉద్ధవ్‌ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇక, తండ్రీకొడుకులైన కాంగ్రెస్‌ నేతలు శంకర్‌రావు చవాన్‌, అశోక్‌ చవాన్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్‌ నుంచి మహారాష్ట్రకు ఎక్కువమంది సీఎంలు పనిచేశారు. ఇప్పటివరకు బీజేపీ నుంచి శివసేన నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులయ్యారు. ఇప్పుడు ఉద్ధవ్‌ శివసేన నుంచి సీఎం అయిన మూడో నేత కానున్నారు. ఇక, ఎన్సీపీ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ సీఎం పగ్గాలు చేపట్టలేదు.

మరిన్ని వార్తలు