ఎన్నికల ‘ఫేస్‌’ మార్చేస్తున్నారా ?

19 Mar, 2018 22:27 IST|Sakshi

ఫేస్‌బుక్‌ యూజర్ల సమాచారం దుర్వినియోగం...

ట్రంప్‌నకు అనుకూలంగా పనిచేసిన ఎస్‌సీఎల్, సీఏ...

బీజేపీ, కాంగ్రెస్‌లతో సీఏ అనుబంధ సంస్థ మంతనాలు...

సాక్షి, హైదరాబాద్‌ : ఫేస్‌బుక్‌ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమాన్ని ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉపయోగించుకుంటున్నారా ?  ఫేస్‌బుక్‌ యూజర్స్‌ ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు వంటి  వ్యక్తిగత అభిప్రాయాలు, సమాచారాన్ని ఓ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చా ? 2016  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ అనుకూల ఎన్నికల ప్రచార వ్యూహాలు సిద్ధం చేసేందుకు... బ్రిటన్‌ బ్రెగ్జిట్‌ రెఫరెండం సందర్భంగా రాజకీయ ప్రచారానికి ఫేస్‌బుక్‌ సమాచారాన్ని ఉపయోగించినట్టు నిర్థారణ కావడం ప్రస్తుతం పెను సంచలనానికి కారణమైంది.

 ఓ యాప్‌ కోసం మాత్రమే ఉపయోగించాల్సిన ఫేస్‌బుక్‌ యూజర్స్‌ సమాచారాన్ని దుర్వినియోగం చేశాయనే ఆరోపణలపై బ్రిటన్‌కు చెందిన  స్ట్రేటజిక్‌ కమ్యునికేషన్‌ లాబరేటరీస్‌ (ఎస్‌సీఎల్‌) గ్రూపు, దాని రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ  కేంబ్రిడ్జి అనాలిటికాలను ఫేస్‌బుక్‌ సస్పెండ్‌ చేయడానికి ప్రాధాన్యత ఏర్పడింది.  బ్రెగ్జిట్‌ ఓటు విషయంలో కేంబ్రిడ్జి అనాలిటికా (సీఏ) సంస్థ పాత్రపై బ్రిటన్‌ విచారణ నిర్వహిస్తోంది. ఫేస్‌బుక్, సీఏ సంస్థలపై విచారణను చేపడుతున్నట్టు అమెరికా మసాఛుసెట్స్‌ అటార్నీజనరల్‌ మౌరా హీలి తెలిపారు.

అయితే ఈ వివాదం అంతటితోనే ఆగిపోలేదు.  దక్షిణాసియాపై ముఖ్యంగా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై సీఏ సంస్థ దృష్టి సారించినట్టు వార్తలొచ్చాయి. వచ్చే ఏడాది మనదేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలతో ఎన్నికల వ్యూహానికి కలిసి పనిచేసేందుకు  సీఏ , దాని భారత భాగస్వామి ఒవిలెనో బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఓబీఐ) సంప్రదింపులు జరిపినట్టు ఈ వార్తలను బట్టి తెలుస్తోంది.  వచ్చేఏడాది ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్‌లో అధికార అవామీ లీగ్‌ పార్టీతో,2020 ఎన్నికల కోసం శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సా పార్టీతో చర్చిస్తున్నట్టు వెల్లడైంది.

ఈ పరిణామాలతో ఫేస్‌బుక్‌ సమాచారాన్ని రాజకీయ ప్రచారానికి, ఓ పార్టీకి లేదా వ్యక్తికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలిచేందుకు దుర్వినియోగం చేస్తున్నారా  అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కేంబ్రిడ్జి అనాలిటికా వివాదం చినికి చినికి గాలివానగా మారి పెను ఉపద్రవంగా మారనుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

అసలు వివాదమేంటీ ?
డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారానికి నియమితమైన సీఏ సంస్థ  ఐదు కోట్లకు పైగా ఫేస్‌బుక్‌ యూజర్స్‌  వ్యక్తిగత డేటాను వారికి తెలియకుండానే దుర్వినియోగం చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఈ కంపెనీకి ట్రంప్‌ ప్రచార సమన్వయకర్త  స్టీవ్‌ బానన్, రిపబ్లికన్‌పార్టీకి భారీగా విరాళాలిచ్చే రాబర్డ్‌ మెర్సర్‌తో సంబంధాలున్నాయి. సోషల్‌ మీడియా, ప్రభుత్వ రికార్డులు, వినియోగదారులు చేసే వ్యయ సమాచారాన్ని  రాబట్టి దాని ద్వారా ప్రజల ఓటింగ్‌ స్వభావాన్ని, తీరును ఈ సంస్థ అంచనా వేస్తుంది.  

ఈ వివరాల ఆధారంగా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఏయే అంశాలపై దృష్టి పెట్టాలన్న దానిపై రాజకీయపార్టీలతో కలిసి పనిచేస్తుంది. ట్రంప్‌ గెలిచేందుకు ఈ సమాచారం దోహదపడినట్టు భావిస్తున్నారు. గ్లోబల్‌ సైన్స్‌ రిసెర్చి కంపెనీ అనే కంపెనీ పర్సనాలిటీ క్విజ్‌ యాప్‌ ద్వారా (దాదాపు 3 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు) సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని ఈ సంస్థ ఉపయోగించుకుంది. ఇది ఫేస్‌బుక్‌ విధానాలకు కూడా పూర్తి విరుద్ధం కావడంతో దుమారం రేగుతోంది.   ఇలా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వారికే పరిమితం కాకుండా మిత్రుల నెట్‌వర్క్‌లోకి ప్రవేశించడంతో 5 కోట్లకు పైగా యూజర్స్‌ అకౌంట్స్‌ వివరాలు తెలుసుకోగలిగారు. 

భారత్‌...
2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలతో  కలిసి పనిచేయడంపై ఓబీఐ ఆచితూచి స్పందించింది. తాము సీఏ సంస్థ భాగస్వామిగా ఉన్నామని,  భారత చట్టాలను ఉల్లంఘించే విధంగా ఏదైనా ఉంటే పునరాలోచిస్తామని ఓబీఐ సీఈఓ అమ్రిశ్‌ త్యాగి ఒక పత్రికకు తెలిపారు. ఇంతవరకు మనదేశంలో సీఏ సంస్థకు ఎలాంటి ప్రాజెక్టులు లేవని, అందువల్ల  సోషల్‌ మీడియాకు సంబంధించి  ఆ సంస్థ ఏదైనా చేసిందనేదే ఉత్పన్నం కాదన్నారు. రాజకీయపార్టీలతో ప్రాథమిక చర్చలే జరిపామని చెప్పారు.

అమ్రిశ్‌  తండ్రి  సీనియర్‌ జేడీ(యూ) నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు  కేసీ త్యాగి. 2010 బీహార్‌ ఎన్నికల్లో జేడీ(యూ–బీజేపీ కూటమితో ఓబీఐ కలిసి పనిచేసింది. ఆ తర్వాత 2012లో బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నితిన్‌గడ్కారీ ఉన్నపుడు యూపీ ఎన్నికల్లో అమ్రిశ్‌ కలిసి పనిచేశారు. ఓబీఐ సంస్థ రాజకీయపార్టీల కోసం పోలింగ్‌ బూత్‌స్థాయిలో పనిచేసింది. జనాభా వివరాలు, కులాల పరంగా ఓటింగ్, క్షేత్రస్థాయిలో రాజకీయపార్టీల అవకాశాలు వంటి వాటిపై కసరత్తు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు