‘ఓటుకు కోట్లు’ కొలిక్కి వచ్చేనా?

29 Sep, 2018 05:47 IST|Sakshi

ఆసక్తి రేపుతున్న ఈడీ విచారణ

కేసు మళ్లీ తెరపైకి రావడంతో ఏపీ ప్రముఖుల్లో గుబులు

ఉదయ్‌సింహకు ఏపీ మంత్రి నుంచి వాట్సాప్‌ కాల్‌!

సాక్షి, హైదరాబాద్‌: ‘ఓటుకు కోట్లు’ కేసు కొలిక్కి వస్తుందా?
నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎవరు సమకూర్చారన్న వివరాలు బయటకు వస్తాయా?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసినట్లు చెబుతున్న ఆ సొమ్మును నగరానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఏ రాజ్యసభ సభ్యుడికి(ఏపీ) అప్పగించారు?
ఎమ్మెల్యే బ్యాంకు నుంచి తెచ్చిన ఆ ఖాతా ఎవరిది? 
ఆ అజ్ఞాత వ్యక్తి వివరాలు బయటకు వస్తాయా?

గత రెండు రోజులుగా ఈడీ అధికారులు సాగిస్తున్న విచారణ చూసిన తరువాత ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు ఇవి. ఓటుకు కోట్లు కేసులో నిందితులైన రేవంత్, సెబాస్టియన్, ఉదయ్‌సింహలను ఈడీ అధికారులు గురు, శుక్రవారాల్లో విచారించారు. ఉదయ్‌సింహను రేవంత్‌రెడ్డి ఇంటికి పిలిచి ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా ప్రశ్నలు సంధించినట్లు సమా చారం. తాను కేవలం రేవంత్‌ రమ్మంటే స్టీఫెన్‌సన్‌ ఇంటికి వెళ్లానే తప్ప ఆ డబ్బు ఎక్కడిదన్న వివరాలు తనకు తెలియదని ఉదయ్‌సింహ ఈడీ అధికారులకు చెప్పారు. అంతకుముందు సెబాస్టియన్‌ను విచారించినప్పుడు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ద్వారా ఫోన్‌ చేయించడం తప్ప తనకు ఇతర ఏ వివరాలు తెలియవని ఈడీ అధికారులకు చెప్పారు.

స్టీఫెన్‌సన్‌ కోసం రూ. 5 కోట్లు!
నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలతోపాటు ఆయనకు చెల్లించాల్సిన మిగిలిన మొత్తం (ఒప్పందం ప్రకారం) రూ. 4.50 కోట్లు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి ఇంటికి చేరవేసినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఏ బ్యాంకు ఖాతా నుంచి వాటిని విత్‌డ్రా చేశారు? ఎవరు ఆ రాజ్యసభ సభ్యుడికి ముట్టజెప్పారు వంటి వివరాలు ఇంకా బయటకు రావాల్సిఉంది. అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ఒకరు ఆ డబ్బును హైదరాబాద్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా రాజ్యసభ సభ్యుడి నివాసానికి చేరవేశారు. అక్కడి నుంచి రేవంత్‌రెడ్డి వాహనంలోకి రూ. 50 లక్షలు చేరింది. ఇంతవరకూ సమాచారాన్ని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తన విచారణలో తెలుసుకోగలిగింది. డబ్బును సమకూర్చిన ప్రస్తుత ఏపీ మంత్రి డ్రైవర్‌ను కూడా ఏసీబీ అప్పట్లో విచారించింది. అయితే బ్యాంకు ఖాతాల పరిశీలన, మనీలాండరింగ్‌ వంటి అంశాలు తమ పరిధిలో లేకపోవడంతో తదుపరి విచారణకు అవసరమైన వివరాలు అందజేయాలని ఈడీకి లేఖ రాసింది.

రెండేళ్ల క్రితమే లేఖ రాసినా ఈడీలో ఉన్న ఒక అధికారి ఈ లేఖను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టినట్లు ఇటీవల తేటతెల్లమైంది. అప్పట్లో లేఖ రాసినా ఆ కేసుకు సంబంధించి తమకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదంటూ తాజాగా మరో లేఖ రాయడంతో ఈడీ ఖంగుతిన్నది. వెంటనే విచారణ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే రేవంత్, సెబాస్టియన్, ఉదయ్‌సింహ నివాసాలపై దాడులు. ఓటుకు కోట్లు కేసు విచారణ చేస్తున్న సమయంలో ఈ ముగ్గురికీ సంబంధించి డొల్ల కంపెనీలు, నోట్ల రద్దు సమయంలో పెద్ద ఎత్తున నగదు మార్పిడి చేయడం వంటి వివరాలు బయటకు వచ్చాయి. దీంతో గడచిన 15 రోజులుగా వారి ఖాతాలు, ఇతరత్రా ఆస్తులు, కంపెనీల వివరాలు సేకరించిన ఈడీ... ఆదాయపన్ను అధికారులతో కలసి దాడులు నిర్వహించింది. వరుసగా రెండోరోజు రాత్రి వరకు కూడా రేవంత్‌ నివాసంలో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

వారికి టెన్షన్‌.. టెన్షన్‌..
ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరమీదకు రావడంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఏపీ ప్రముఖులు ఆందోళనకు లోనవుతున్నారు. స్టీఫెన్‌సన్‌కు నిధులు సమకూర్చిన ఏపీ మంత్రి నిందితుల్లో ఒకరైన ఉదయ్‌సింహతో మాట్లా డేందుకు శుక్రవారం ప్రయత్నించినట్లు తెలిసిం ది. రేవంత్‌ ఇంటి దగ్గర ఉన్న సమయంలోనూ ఆ మంత్రి ఉదయ్‌సింహకు వాట్సాప్‌ కాల్‌ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. 

>
మరిన్ని వార్తలు