మార్పుకు నాంది

20 Mar, 2018 01:34 IST|Sakshi

‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ దిశగా ఇది తొలి అడుగు

బెంగాల్‌ సీఎం మమతతో భేటీ అనంతరం కేసీఆర్‌

దేశంలో ఎన్నో వనరులు, అవకాశాలు ఉన్నా ప్రయోజనం లేదు

అందుకే ప్రత్యామ్నాయ ఎజెండా, రాజకీయ శక్తి అవసరమని వ్యాఖ్య

దేశంలో విప్లవాత్మకమైన మార్పు రావాలి: మమతా బెనర్జీ

కోల్‌కతాలో రెండు గంటల పాటు చర్చించిన ముఖ్యమంత్రులు

భావ సారూప్యత ఉన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని వెల్లడి

కోల్‌కతా : దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు దిశగా, ప్రత్యామ్నాయం దిశగా నాంది పడిందని, ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’వైపు అడుగులు మొదలయ్యాయని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, ప్రత్యామ్నాయ ఎజెండా అత్యవసరమని వ్యాఖ్యానించారు. తమది ప్రజలందరి ఫ్రంట్‌ అని, నిజమైన సమాఖ్య స్ఫూర్తిని అందించేందుకు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. సమ్మిళిత, ఉమ్మడి నాయకత్వంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ కొనసాగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సోమవారం కోల్‌కతాలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ఏర్పాటు అంశంపై ఆమెతో చర్చించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం కేసీఆర్, మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. 

మార్పు దిశగా ప్రారంభం.. 
దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఇది ప్రారంభమని, తాము సమాఖ్య స్ఫూర్తికి నిజమైన అర్థమిచ్చే ఫెడరల్‌ ఫ్రంట్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. ‘‘ఈ రోజు సమావేశానికి ప్రత్యేకత ఉంది. ఇది ఫెడరల్‌ ఫ్రంట్‌కు, మొత్తం మార్పుకు మొదలు. ఆ దిశగా ఈ రోజు ఫలవంతమైన చర్చలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం దిశగా మాతో కలసి వచ్చే అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతాం.. దేశంలో అద్భుతమైన మార్పు రావాల్సి ఉంది. మంచి మార్పు కావాల్సి ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినా.. ఏదైనా అద్భుతమైన మార్పు జరుగుతుందా? జరగదు.. ఇప్పుడు దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, ప్రత్యామ్నాయ ఎజెండా అత్యవసరం..’’అని స్పష్టం చేశారు.  

ఇది ప్రజల ఫ్రంట్‌.. 
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ ఫ్రంట్‌ కడుతున్నట్లు అపార్థం చేసుకుంటున్నారని, అయితే తమది సాదాసీదా ఎన్నికల ఫ్రంటు కాదని కేసీఆర్‌ చెప్పారు. తమది దేశ ప్రజల కోసం ఏర్పాటు కానున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ అన్నారు. ‘‘మాది ప్రజల ఎజెండా.. ఏదో నాలుగైదు రాజకీయ పార్టీల పొత్తు కాదు. భారత ప్రజాస్వామ్య శక్తులను ఐక్యపరిచే ప్రక్రియ. దేశం గుణాత్మక దిశగా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఎన్నో సహజ వనరులు, యువతతో మన దేశం అద్భుతమైన అవకాశాలను కలిగి ఉంది. కానీ కాంగ్రెస్, బీజేపీల మూస పాలనతో ప్రయోజనం లేకుండా పోతోంది. అందువల్ల ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాతో కూడిన ఎజెండా కావాలి. దానిని ముందుకు తీసుకెళ్లే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలి. భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతాం..’’అని వెల్లడించారు. 

అందరితో చర్చించాక నిర్ణయం 
ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, తామిద్దరమే (కేసీఆర్, మమతా బెనర్జీ) అంతా నిర్ణయించలేమని కేసీఆర్‌ చెప్పారు. ఇంకా భావ సారూప్యత ఉన్న మిత్రులతో చర్చించాల్సి ఉందని.. అందరితో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించాక ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. మొత్తంగా శుభారంభం జరిగిందని, దీనిని మరింత ముందుకు తీసుకుపోగలమనే విశ్వాసముందని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ పాలన అద్వితీయంగా జరుగుతోందని ప్రశంసించారు. 

ఇది శుభారంభం: మమతా బెనర్జీ 
మారుతున్న భారత రాజకీయాల నేపథ్యాన్ని, ఫ్రంట్‌ అంశాన్ని చర్చించామని.. ఇదొక శుభారంభమని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. కేసీఆర్‌ అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. ‘‘దేశంలో రాష్ట్రాలు బలంగా ఉంటే.. కేంద్రం కూడా బలంగా ఉంటుంది. ఏదో ఒక పార్టీ దేశాన్ని ఏలాలంటే.. దానికిష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తామంటే ఎలా? దేశంలో బలమైన ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరం ఉంది. మేం ఇప్పుడే చర్చను ప్రారంభించాం. ఇతర పార్టీలతో చర్చించాల్సి ఉంది. మేమందరం ఒక ఉమ్మడి కుటుంబంగా కలసి పనిచేయాల్సి ఉంది. అయితే ఇప్పుడే ఏదో జరగాలనే తొందరేమీ లేదు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను సిద్ధం చేసేందుకు, ప్రజాసంక్షేమం కోసం ముందుకు వెళతాం. ఇతర పార్టీలతో కూడా చర్చిస్తాం. దేశం కోసం కలసి పనిచేయడం కన్నా గొప్ప కార్యం ఏముంటుంది..’’అని మమత చెప్పారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పు రావాల్సి ఉందని.. దేశం కోసం పనిచేసే ఉమ్మడి, ఫెడరల్‌ నాయకత్వం ఉండాలని పేర్కొన్నారు. కాగా.. కోల్‌కతా పర్యటనలో కేసీఆర్‌ వెంట ఆయన కుమార్తె, ఎంపీ కవిత, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఉన్నారు. 

దీదీతో కేసీఆర్‌ భేటీపై ఆసక్తి! 
సీఎం కేసీఆర్‌ కోల్‌కతాలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశం కావడంపై సర్వత్రా ఆసక్తి కనిపించింది. సోమవారం పార్లమెంటు లాబీల్లో చాలా మంది ఎంపీలు ఈ అంశంపైనే చర్చించుకోవడం కనిపించింది. ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలవారితోపాటు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా థర్డ్‌ ఫ్రంట్, ఫెడరల్‌ ఫ్రంట్‌లపై అభిప్రాయాలు వెల్లడించారు. కొంతకాలంగా బీజేపీ పరిస్థితి దిగజారుతుండటం, అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా మెరుగుపడేలా లేకపోవడం వల్ల రాజకీయ శూన్యత కనిపిస్తోందనే భావన వచ్చింది. కానీ మూడో ఫ్రంట్‌ అంశంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేవలం నలుగురైదుగురి నుంచి ముప్పై మంది వరకు ఎంపీలున్న ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు కలసి ఫ్రంట్‌గా నిలవడం కష్టమని సీపీఐ ఎంపీ డి.రాజా పేర్కొన్నారు. వామపక్షాలు లేకుండా ఏర్పడే మూడో ఫ్రంట్‌కు రాజకీయ హేతుబద్ధత ఉండదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే స్థితిలో లేకపోవడంతో దేశంలో రాజకీయ అస్థిరతకు దారి తీస్తోందని బీజేడీ ఎంపీ భర్తృహరి మెహ్తాబ్‌ పేర్కొన్నారు. ఇక బీజేపీ ఎంపీలు మూడో ఫ్రంట్‌ యోచనను పూర్తిగా కొట్టిపారేశారు. అది విఫల యత్నమని త్వరలోనే వెల్లడవుతుందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు