ఫెడరల్‌ ఫ్రంటే గేమ్‌ చేంజర్‌: ఎంపీ కవిత 

23 May, 2018 02:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ దేశ రాజకీయాల్లో గేమ్‌ చేంజర్‌గా నిలుస్తుందని ఎంపీ కె. కవిత అన్నారు. ఢిల్లీలోని ఇండియన్‌ విమెన్స్‌ ప్రెస్‌ కార్ప్‌లో మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఎన్నికలకు ఏడాదే గడువు ఉండటంతో ఇప్పటికైనా రైతులకు మేలు చేస్తుందేమో చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పరిగణనలోకి తీసుకోకుండా మోదీ సర్కార్‌ విధానాలు రూపొందించడం సరైంది కాదని చెప్పారు.

తమది బలమైన పార్టీ కాబట్టే బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్‌ ఏజెంటూ అంటూ టీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని, విధానాలు నచ్చి తమతో కలసి వచ్చే వారందరినీ స్వాగతిస్తామని చెప్పారు. రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకే సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, ఇది రైతులను వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు