గుజరాత్‌లో 13, హిమాచల్‌లో నలుగురు..

28 Dec, 2017 13:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 182 స్థానాలకుగాను 13 స్థానాల్లో మాత్రమే మహిళలు విజయం సాధించారు. ఇక హిమాచల్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురంటే నలుగురు మహిళలే విజయం సాధించారు. గుజరాత్‌లో ఏడు శాతం సీట్లను సాధించడం ద్వారా మహిళలు దేశవ్యాప్తంగా చట్టసభల ప్రాతినిథ్యంలో జాతీయ ఏడు శాతం సగటును నిలబెట్టగా, గుజరాత్‌ మహిళా ప్రతినిధులు మాత్రం ఐదు శాతం ప్రాతినిథ్యంతో సరిపెట్టుకున్నారు.

గుజరాత్‌ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ముగ్గురు ముస్లింలు విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరుగురు ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వగా అందులో ముగ్గురు విజయం సాధించారు. గుజరాత్‌లోని 182 స్థానాలకు వివిధ పార్టీల నుంచి 1828 మంది అభ్యర్థులు ఎన్నికల రంగంలోకి దిగగా, వారిలో 126 మంది మహిళలు ఉన్నారు. వారిలో కాంగ్రెస్, బీజేపీల తరఫున 22 మంది మహిళలు పోటీ చేయగా 13 మంది విజయం సాధించారు.

హిమాచల్‌లో నలుగురంటే నలుగురే
ఇటీవల జరిగిన హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  కేవలం నలుగురంటే నలుగురు మహిళలే ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి ముగ్గురు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకరు విజయం సాధించారు. బీజేపీ ఆరుగురు మహిళలకు టిక్కెట్లు ఇవ్వగా, కాంగ్రెస్‌ పార్టీ ముగ్గురికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. రాజకీయ పార్టీలు తక్కువ మంది మహిళలకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల విజయం సాధిస్తున్న వారి సంఖ్యా తక్కువగా ఉంటోంది.

1998 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో మహిళలే పురుషుల కన్నా ఎక్కువ శాతం ఓట్లు సాధిస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలు వారిని చిన్నచూపు చూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 44 సీట్లను, కాంగ్రెస్‌ పార్టీ 21 సీట్లను గెలుచుకున్నాయి.

దేశవ్యాప్తంగా చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం ఏడు శాతం ఉండగా, అక్షరాస్యతలో కేరళ తర్వాత రెండో స్థానంలోవున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో మహిళల ప్రాతినిధ్య శాతం ఐదుకు మించడం లేదు. 1967 నుంచి కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నుంచి 201 మంది మహిళలు పోటీ చేయగా వారిలో 38 మంది మాత్రమే విజయం సాధించారు.

మరిన్ని వార్తలు