లోక్‌సభ ఎన్నికలు: ముగిసిన పోలింగ్‌

6 May, 2019 06:55 IST|Sakshi

జమ్మూ కశ్మీర్‌, పశ్చిమ బెంగాల్‌  మినహా ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జమ్మూకాశ్మీర్‌ పుల్వామా జిల్లా అనంతనాగ్‌ పోలింగ్‌ కేంద్రంపై ఓ ఉగ్రవాది గ్రనేడ్‌ విసిరాడు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పశ్చిమ బెంగాల్‌లో వివిధ చోట్ల చెదురుమదురు ఘర్షనలు జరిగాయి. మొత్తంగా ఏడు రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ నియోజకవర్గాలకు ఐదో దశలో ఎన్నిక జరగ్గా, మొత్తం 674 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ 51 నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా దాదాపు 9 కోట్ల మంది ఓటర్లున్నారు. ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది.

సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 59.20 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఇక రాష్ట్రాల వారిగా  జమ్మూకాశ్మీర్‌ 17.07శాతం, బీహార్‌ 52.86 శాతం, మధ్య ప్రదేశ్‌ 61.03 శాతం, రాజస్తాన్‌ 58.04 శాతం, ఉత్తరప్రదేశ్‌ 52.03 శాతం, పశ్చిమ బెంగాల్‌73.46 శాతం, జార్ఖండ్‌ 58.24శాతం పోలింగ్‌ నమోదైంది.

పశ్చిమ బెంగాల్‌లోని పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 49,50ల వద్ద స్పల్ప ఘర్షణ చోటు చేసుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, హౌరా ఎంపీ ప్రసాన్‌ బెనర్జీని పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించకపోవడంతో ఎంపీకి, భద్రతా సిబ్బంది మధ్య చిన్న తోపులాట చోటు చేసుంది. 

రెండు చేతులు లేకపోయినా ఎవరి సహాయం తీసుకోకుండా పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటు వేసి ఓటు విలువను చాటారో దివ్యాంగురాలు. మధ్యప్రదేశ్‌కు చెందిన నిధి అనే దివ్యాంగురాలు నర్సింగపూర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు చేతులు లేకపోవడంతో కాలితో ఓటు వేశారు.


చిన్న చిన్న ఘర్షనలు  మినహా ఐదో దశ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తంగా 48.38 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఇక రాష్ట్రాల వారిగా  జమ్మూకాశ్మీర్‌ 12.86 శాతం, బీహార్‌ 44. 08 శాతం, మధ్య ప్రదేశ్‌ 48.76 శాతం, రాజస్తాన్‌ 49.50శాతం, ఉత్తరప్రదేశ్‌ 43.07 శాతం, పశ్చిమ బెంగాల్‌ 61.01 శాతం, జార్ఖండ్‌ 51.07 శాతం పోలింగ్‌ నమోదైంది.

కెప్టెన్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జార్ఖాండ్‌ రాష్ట్రంలోని రాంచీలో ఏర్పాటు చేసిన జవహార​ విద్యా మందిర్‌ పోలింగ్‌ బూత్‌లో  ధోని ఓటు వేశారు. 

మధ్యాహ్నం 1గంట వరకు జమ్మూకాశ్మీర్‌ 6.54శాతం, బీహార్‌ 24.49శాతం, మధ్య ప్రదేశ్‌ 31.46శాతం, రాజస్తాన్‌ 33.82శాతం, ఉత్తరప్రదేశ్‌ 26.53శాతం, పశ్చిమ బెంగాల్‌ 39.55శాతం, జార్ఖండ్‌ 37.24 శాతం పోలింగ్‌ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్‌ హింసాత్మకం కావటంపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది. తారకేశ్వర్‌ అనే పోలింగ్‌ అధికారిపై ఈసీ వేటు వేసింది.

బహుభాషా నటుడు ఆశుతోష్‌ రాణా మధ్యప్రదేశ్‌ నార్సింగ్‌పూర్‌ గదర్‌వారాలోని పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 105లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగులో వెంకీ, బంగారం తదితర సినిమాలలో ఆయన నటించారు. రాయ్‌బరేలీలోని బూత్‌ నెంబర్‌ 348, 349, 350లలో బీజేపీ పోలింగ్‌ ఏజెంటు, గ్రామాధికారి బీజేపీకి ఓటు వేసేలా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని రెండు పోలింగ్‌ కేంద్రాలలోకి గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ప్రవేశించారు. ఏ పార్టీకి చెందిన వారని ప్రశ్నించగా నీళ్లు నమిలారు. వారి వద్ద ఎటువంటి గుర్తింపుకార్డులు లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది.

లోక్‌సభ ఐదో విడత ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా రాజస్తాన్‌లోని ఓ పోలింగ్‌ కేం‍ద్రం వద్ద పొడవు మీసాల వ్యక్తి సందడి చేశాడు. దాదాపు 4అడుగులు కలిగిన అతడి మీసాలను చూసి పోలింగ్‌ కేంద్రం వద్ద ఉన్న జనాలు ఆశ్చర్యపోయారు.

తన నామినేషన్‌ను తిరష్కరించిన కారణంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తేజ్‌ బహుదూర్‌ యాదవ్‌ అనే బీఎస్‌ఎఫ్‌ జవాను సమాజ్‌ వాది పార్టీ తరుపున ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా వారణాసినుంచి నామినేషన్‌ వేశాడు. కానీ ఎన్నికల అధికారులు అతడి నామినేషన్‌ను తిరష్కరించారు. తేజ్‌ బహుదూర్‌ సమర్పించిన రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలలో వ్యత్యాసాలు ఉన్న కారణంగా అతడి నామినేషన్‌ తిరష్కరణకు గురైనట్లు రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు. తేజ్‌ బహుదూర్‌ కేసును ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ వాదించనున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఛాటర్‌పూర్‌లో ఓ వ్యక్తి శ్మశానం నుంచి నేరుగా పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఉదయం తండ్రి అంత్యక్రియలు ముగించిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా ఓటు వేశాడు.

ఉదయం 10 గంటల వరకు జమ్మూకాశ్మీర్‌ 1.36శాతం, బీహార్‌ 11.51శాతం, మధ్య ప్రదేశ్‌ 13.18శాతం, రాజస్తాన్‌ 14శాతం, ఉత్తరప్రదేశ్‌ 9.85శాతం, పశ్చిమ బెంగాల్‌ 16.56శాతం, జార్ఖండ్‌ 13.46 శాతం పోలింగ్‌ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో జాతీయ భద్రతా దళాలు తాగి ఉన్నాయని బరక్‌పూర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్జున్‌ సింగ్‌ ఆరోపించారు.

ఉదయం 9గంటల వరకు జమ్మూకాశ్మీర్‌ 0.80 శాతం, బీహార్‌ 11.51శాతం, మధ్య ప్రదేశ్‌ 11.43శాతం, రాజస్తాన్‌ 13.24శాతం, ఉత్తరప్రదేశ్‌ 9.82శాతం, పశ్చిమ బెంగాల్‌ 12.97శాతం, జార్ఖండ్‌ 13.46 శాతం పోలింగ్‌ నమోదైంది. బీహార్‌లోని చప్రాలో రంజిత్‌ పాశ్వాన్‌ అనే వ్యక్తిని ఈవీఎం మిసన్‌ను ధ్వంసం చేసిన కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అమేథి బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ.. ప్రియాంక గాంధీపై మండిపడ్డారు. ఐదేళ్ల క్రితం ప్రియాంకకు తన పేరు తెలియదని, కానీ కొద్దిరోజులుగా తన పేరును జపిస్తోందన్నారు. ఆమె భర్త రాబర్ట్‌ పేరు కంటే తన పేరే ఎక్కువ వాడుతోందంటూ ఎద్దేవా చేశారు. రాహుల్‌, ప్రియాంకాలు రాజకీయాలను సొంత లాభం కోసం వాడుతున్నారని, మనషుల ప్రాణాలంటే కూడా వారికి లెక్కలేదన్నారు. అమేథిలో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీ ట్రస్టీగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స చేయనందున ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడని తెలిపారు.

జమ్మూకాశ్మీర్‌ పుల్వామాలో ఓ ఉగ్రవాది పోలింగ్‌ కేంద్రంపై గ్రనేడ్‌ విసిరాడు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ బరక్‌పూర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్జున్‌ సింగ్‌ ఆరోపించారు. వారి దాడిలో తాను గాయపడినట్లు తెలిపారు. టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు.

బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి లక్నోలోని మాంటీసోరి ఇంటర్‌ కాలేజీ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ ఓటు వేసే హక్కు ఉందని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి, లక్నో బీజేపీ ఎంపీ అభ్యర్థి రాజ్‌నాథ్‌ సింగ్‌.. లక్నోలోని స్కాలర్స్‌ హోమ్‌ స్కూల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ గెలవటం ఖాయమని, నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవ్వబోతున్నారని జోష్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్స్‌, ఈవీఎంలు పనిచేయకపోవటంతో పోలింగ్‌ ఇంకా ప్రారంభంకాలేదు. జుమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వృద్ధులు, వికలాంగులు సైతం ఓటు వేయటానికి పోలింగ్‌ కేంద్రానికి తరలివస్తున్నారు.

కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోర్‌ ఆయన సతీమణి గాయత్రి రాథోర్‌ జైపూర్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా దంపతులు హజరీబాగ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. యశ్వంత్‌ కుమారుడు, కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా జార్ఖండ్‌నుంచి లోకసభ స్థానానికి పోటీ చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 6గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్టు చేశారు. కొన్ని పోలింగ్‌ బూత్‌లను ఎన్నికల అధికారులు అందంగా ముస్తాబు చేశారు. తమ సమస్యలను పరిష్కరించని కారణంగా కొన్ని గ్రామాల్లో ప్రజలు ఎన్నికల బహిష్కరించారు.

కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, స్మృతీ ఇరానీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తదితర ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో మరికాసేపట్లో పోలింగ్‌ జరుగుతుంది. మొత్తంగా ఏడు రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ నియోజకవర్గాలకు ఐదో దశలో ఎన్నిక జరగనుండగా, మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 51 నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా దాదాపు 9 కోట్ల మంది ఓటర్లున్నారు. ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

గత ఎన్నికల్లో ఈ 51 నియోజకవర్గాల్లోని 40 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు దక్కగా, మిగిలిన స్థానాలు తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి ఇతర పార్టీల వశమయ్యాయి. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో 14, రాజస్తాన్‌లో 12, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌ల్లో చెరో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 4 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌ నియోజకవర్గంతోపాటు అనంత్‌నాగ్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లోనూ పోలింగ్‌ జరగనుంది. మొత్తం 96 వేల పోలింగ్‌ స్టేషన్లను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఐదో దశ పోలింగ్‌ ముగిస్తే మొత్తంగా దేశంలో 424 స్థానాలకు పోలింగ్‌ అయిపోయినట్లే. మిగిలిన 118 స్థానాలకు ఆరో (మే 12), ఏడో (మే 19) దశల్లో పోలింగ్‌ జరుగుతుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు