రాజధానికి వ్యతిరేకం కాదు

23 Aug, 2019 03:56 IST|Sakshi

ఆ పేరుతో జరిగిన అక్రమాలకు వ్యతిరేకం

బాబు మాయా నగరం పైనే మా అభ్యంతరం

మీడియా ప్రతినిధులతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

మంత్రి బొత్స యధాలాపంగా అన్న మాటలపై ఏవేవో కథనాలు 

రాజధాని పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ కొనసాగుతుంది

సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, రాజధాని నగరం పేరుతో జరిగిన అక్రమాలపై, చంద్రబాబు మాయా నగరంపైనే తమ అభ్యంతరమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంపై మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ యధాలాపంగా అన్న మాటలపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయన్నారు. రాజధాని పేరుతో సాగిన అక్రమాలన్నింటిపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపురం నుంచి నెల్లూరు వరకు అందరికీ సమాన అవకాశాలు, ఉద్యోగాలు కల్పించడం ద్వారా సాంఘిక అసమానతలు లేకుండా చేయడానికి వికేంద్రీకరణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

సచివాలయంలో గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో గత ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడిందని, ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్, బలవంతపు భూసేకరణ, నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయన్నారు. రాజధానికి సంబంధించి గుంటూరు, నూజివీడు వంటి పేర్లను ఉద్దేశ పూర్వకంగా లీకులిచ్చిన గత ప్రభుత్వం.. మరోవైపు ప్రస్తుత రాజధాని ప్రాంతాల్లో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసిందన్నారు. 2014 జూన్‌ 2వ తేదీన రాజధాని ప్రకటించే నాటికి టీడీపీ నేతలు ఇప్పుడున్న రాజధాని ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేశారన్నారు. 391 చదరపు కిలోమీటర్లలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిజైనింగ్‌ను జురాంగ్‌ సుర్భానా సంస్థకు తొలుత అప్పగించిన టీడీపీ ప్రభుత్వం తర్వాత దాన్ని 217 ఎకరాలకు కుదించడం ద్వారా వారి బినామీలకు మేలు చేసిందన్నారు.

రాజధాని స్కాంపై విచారణ తప్పదు
చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జగ్గయ్యపేట సమీపంలో ఎకరం లక్ష రూపాయలు చొప్పున 400 ఎకరాలు కొనుగోలు చేశారని, అది ఇప్పుడు రూ.50 లక్షలు.. రూ.60 లక్షలు ధర పలుకుతోందని బుగ్గన అన్నారు. చివరకు డీ పట్టా భూములకు సంబంధించిన చట్టాలను మార్చి వాళ్లే భూములు కొనుగోలు చేశారని వివరించారు. శివరామకృష్ణ కమిటీ కొత్త రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని సూచించిన విషయాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టిందని, కృష్ణా పరీవాహక ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని ఆ కమిటీ చెప్పినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

ఇలాంటి అవకతవకలపై తమ ప్రభుత్వం పూర్తిగా సమీక్ష చేయాలని నిర్ణయించిందన్నారు. రాజధాని స్కాంపై విచారణ జరిపించి, ఆ నివేదిక అందాక ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని అధికారికంగానే చెబుతున్నామన్నారు. భూములు ఎవరికి కేటాయించారు.. వాటి అసలు యజమానులు ఎవరు.. బినామీలు ఎవరు.. తదితర అన్ని విషయాలు విచారణలో తేలుతుందన్నారు. ఇందులో ఎవరి ప్రమేయమున్నా ఉపేక్షించేది లేదని స్పష్టీకరించారు. లాండ్‌ పూలింగ్‌ పేరుతో టీడీపీ నేతలు పెద్ద వ్యాపారానికి తెరతీశారని, వాళ్లు ప్రకటించిన రాజధాని ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులకు ఎకరా రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అమ్మగా.. ప్రభుత్వ రంగ సంస్ధలకు మాత్రం ఎకరా నాలుగు కోట్ల రూపాయలకు విక్రయించారని ఆయన వివరించారు.

ఈ ప్రభుత్వం ఆ తప్పులు చేయదు
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయాలనుకోవడం లేదని బుగ్గన స్పష్టం చేశారు. న్యూయార్క్‌ కంటే రెట్టింపు, ముంబయి కంటే నాలుగు రెట్లు, సింగపూర్‌ కంటే ఆరు రెట్లున్న నగరాన్ని కట్టాలనుకున్నారా అంటూ.. ఆయిల్‌ బావులుంటేనే ఇలాంటివి సాధ్యమన్నారు. రాజధాని నిర్మాణం, నవరత్నాల వంటి భారీ పథకాలకు కేటాయింపులు ఎలా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. రూ.40 వేల కోట్లు అవసరమని, కేంద్రం రాష్ట్రానికి సాయం చేయాల్సి ఉందన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని అడుగడుగునా కేంద్రం ప్రశ్నించినందునే నిధులు రావడానికి ఆలస్యం అవుతోందని చెప్పారు.  దుబారా, అవినీతిని తగ్గించడం ద్వారా నవరత్నాలను సమర్థవంతంగా అమలు చేస్తామని బుగ్గన వివరించారు.

పీపీఏలను రద్దు చేస్తామనలేదు
ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) రద్దు చేస్తామని తాము చెప్పలేదని, వాటిపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని చెప్పామని బుగ్గన అన్నారు. జపాన్‌ ప్రభుత్వ రాయబార కార్యాలయం వాళ్ల వ్యాపారం కోసం లేఖ రాసిందని, అయితే తమ ప్రభుత్వం ఇక్కడి ప్రజల కోసం నిర్ణయం తీసుకుంటోందన్నారు. అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో 82 శాతం మంది స్థానికులే ఉన్నారని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారని బుగ్గన తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల కంపెనీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇస్తుందన్నారు. రూ.1600 కోట్లు పట్టిసీమకు వెచ్చించే బదులు ఆ డబ్బు పోలవరం నిర్మాణానికి ఉపయోగించి ఉంటే బావుండేదన్నారు.

రానున్న రెండు నెలల్లో పోలవరం పనులు చేయడానికి వీలుకాదని, ఆ లోగా టెండర్‌ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గత ఐదేళ్లలో ఇసుక అమ్మకాల్లో చాలా అక్రమాలు సాగాయని, ఇప్పుడు నో లాస్‌ నో ప్రాఫిట్‌ పాలసీలో భాగంగా ఏపీఎండీసీ ఆధ్వర్యంలో కొత్త విధానం తీసుకొస్తున్నామని బుగ్గన చెప్పారు. కొత్త పరిశ్రమల స్థాపన, వాణిజ్యాన్ని పెంచుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు.   

>
మరిన్ని వార్తలు