ఉమ్మడి ఏపీలో తొలి ఎన్నికలు

26 Oct, 2018 03:09 IST|Sakshi

తెలంగాణలో 106 ఆంధ్రలో 194 సీట్లకు పోలింగ్‌

ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం 1956లో ఆంధ్రప్రదేశ్‌గా అవతరించాక 1962లోనే మొదటిసారి రాష్ట్రమంతటా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి ఏపీ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 300. అంతే సంఖ్యలో నియోజకవర్గాలు ఏర్పాటు చేయగా, ప్రతి స్థానానికీ ఒక్కరే ప్రాతినిధ్యం వహించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఏర్పాటైన ద్విసభ్య నియోజకవర్గాలు రద్దయ్యాయి. ఈ వర్గాలకు విడివిడిగా నియోజకవర్గాలను కేటాయించారు. కోస్తా, రాయలసీమలో 194 అసెంబ్లీ స్థానాలుండగా తెలంగాణలో 106 సీట్లున్నాయి. తెలంగాణలోని ఈ 106 స్థానాల్లో 18 ఎస్సీలు, రెండు ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. మిగిలిన 86 జనరల్‌ సీట్లు. ఏపీ తొలి (ఏకైక) దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పదవిలో ఉండగా లోక్‌సభతోపాటు ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఆంధ్ర ప్రాంతంతోపాటు తెలంగాణలో కూడా కమ్యూనిస్టులు మొదటిసారి సీపీఐ పేరుతో పోటీ చేశారు. రెండు చోట్లా సీపీఐ బలం తగ్గిందని ఈ ఎన్నికలు నిరూపించాయి. పంచాయతీరాజ్, సహకార వ్యవస్థల కారణంగా పాలకపక్షమైన కాంగ్రెస్‌ పునాదులు బలపడ్డాయి. తెలంగాణ ప్రాంతంలోని 106 అసెంబ్లీ స్థానాల్లో పాలకపక్షమైన కాంగ్రెస్‌కు 60 సీట్లు రాగా సీపీఐ పేరుతోనే పోటీ చేసిన కమ్యూనిస్టులకు 18 స్థానాలే దక్కాయి. కాంగ్రెస్‌ సీట్లు దక్కని తిరుగుబాటు అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు కలిపి 18 సీట్లు లభించాయి. మొదటిసారి పోటీ చేసిన స్వతంత్ర పార్టీకి 3, సోషలిస్టులకు 2 సీట్లు దక్కాయి. పత్తర్‌గట్టీ నుంచి మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) అధినేత సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ గెలిచి మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోని మొత్తం 300 సీట్లకుగాను కాంగ్రెస్‌ 177 స్థానాలతో ఘన విజయం సాధించింది. ఎన్నికల సమయంలో సీఎంగా ఉన్న సంజీవయ్యకు బదులు ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి మార్చి రెండో వారంలో ప్రమాణం చేశారు. 

నీలం కేబినెట్‌లో తెలంగాణ మంత్రులు..
ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్‌ నేతలు ఎన్‌. రామచంద్రారెడ్డి (డోర్నకల్‌), మర్రి చెన్నారెడ్డి (తాండూరు), మీర్‌ అహ్మద్‌ అలీఖాన్‌ (మలక్‌పేట్‌), డా. ఎం.ఎన్‌. లక్ష్మీనరసయ్య (ఇబ్రహీంపట్నం) కేబినెట్‌ మంత్రులుగా చేరారు. పీవీ నరసింహారావు (మంథని), టీఎన్‌ సదాలక్ష్మి (ఎల్లారెడ్డి), బీవీ గురుమూర్తి (సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌) సహాయ మంత్రులయ్యారు. 

ముగ్గురు ఏకగ్రీవం! 
ఈ ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ లేకుండా శాసనసభకు ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల నుంచి ఇదే సంస్థానానికి చెందిన కృష్ణరామ్‌ భూపాల్, వికారాబాద్‌ (ఎస్సీ రిజర్వ్‌డ్‌) నుంచి అరిగే రామస్వామి, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు నుంచి టి. రంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1957లో ఆర్మూర్‌ నుంచి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్‌ నేత టంగు టూరి అంజయ్య 1962లో హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎంఐఎం అధినేత సలావుద్దీన్‌ ఒవైసీ పత్తర్‌గట్టీలో కాంగ్రెస్‌ మంత్రి మాసూమా బేగంను ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గద్వాల సంస్థానానికి చెందిన సోమ్‌ భూపాల్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఆత్మకూరులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జయలక్ష్మీదేవమ్మను ఓడించారు. కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా ఎదిగిన డా. జి. సంజీవరెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ నుంచి మొదటిసారి కాంగ్రెస్‌ టికెట్‌పై ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు రెండోసారి కరీంనగర్‌ జిల్లా మంథని నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో పీవీకి సహాయ మంత్రిగా స్థానం లభించింది. 1957 ఎన్నికల్లో సుల్తాన్‌బజార్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వాసుదేవ్‌ కృష్ణాజీ నాయక్‌ (కాంగ్రెస్‌) మళ్లీ 1962లో కూడా విజయం సాధించి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన 1972 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఈ పదవిలో కొనసాగారు. హైకోర్టు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై ఎన్నికైన బి. రాందేవ్‌ పాతికేళ్ల తర్వాత ఎమ్మెల్సీగా మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రి అయ్యారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన నల్లగొండ జిల్లా దంపతులు ఆరుట్ల కమలాదేవి (ఆలేరు), రామచంద్రారెడ్డి (భువనగిరి) ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. మొదటి రెండు ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన కమ్యూనిస్టు నేత బొమ్మగాని ధర్మభిక్షం ఈసారి నల్లగొండ నుంచి పోటీ చేసి వరుసగా మూడోసారి విజయం సాధించారు.

అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి ఎన్‌. యతిరాజారావు వరంగల్‌ జిల్లా చెన్నూరు నుంచే ఈ ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. ఖమ్మం జిల్లా వేంసూర్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యా రు. అంతకుముందు ఆయన తమ్ముడు కొండల్‌రావు ఇదే స్థానం నుంచి విజయం సాధించారు. తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా డా. మర్రి చెన్నారెడ్డి 256 ఓట్ల స్వల్ప మెజారిటీతో చంద్రశేఖర్‌పై గెలిచారు. బుగ్గారం ఎస్టీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థి కనగాల బుచ్చయ్య కేవలం 42 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌కు చెందిన కొమురం రామయ్యపై విజయం సాధించారు. కాంగ్రెస్‌ టికెట్‌పై చేర్యాల నుంచి మహమ్మద్‌ కమలాద్దీన్‌ అహ్మద్‌ గెలుపొందారు. కొన్నేళ్ల తర్వాత పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఆయన కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన బీజేపీలో కూడా చేరారు. 

శాసనసభకు మహిళలు 8మంది
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఆరుగురు మహిళలు కాంగ్రెస్‌ తరఫున, ఇద్దరు సీపీఐ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ తరఫున కుముదినీదేవి (వనపర్తి) సుమిత్రాదేవి (హైదరాబాద్‌ తూర్పు–ఎస్సీ), రోడా మిస్త్రీ (జూబ్లీహిల్స్‌ జనరల్‌), ఎస్‌ఎల్‌ దేవి (అందోల్‌), రెడ్డి రత్నమ్మ (రామాయంపేట), టీఎన్‌ సదాలక్ష్మి (ఎల్లారెడ్డి–ఎస్సీ), సీపీఐ నుంచి కేవల్‌ ఆనందదేవి (మెదక్‌), ఆరుట్ల కమలాదేవి (ఆలేరు) విజయం సాధించారు.

ఓడిన ప్రముఖుల్లో కేవీ రంగారెడ్డి 
కవి, కమ్యూనిస్టు దిగ్గజం మఖ్దూం మొహియుద్దీన్‌ను మొదటి సాధారణ ఎన్నికల్లో ఓడించి తర్వాత మంత్రి పదవి చేపట్టిన మాసూమా బేగం పత్తర్‌గట్టీలో ఎంఐఎం అధినేత సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ చేతిలో ఓడిపోయారు. 1962కు ముందు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కొండా వెంకట (కేవీ) రంగారెడ్డి మేడ్చల్‌ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి వి. రామచంద్రరావు చేతిలో ఓడిపోయారు. 1957లో గెలిచిన కాంగ్రెస్‌ నేత జువ్వాడి చొక్కా రావు 1962లో కరీంనగర్‌లో సోష లిస్టు పార్టీ అభ్యర్థి అల్లిరెడ్డి కిషన్‌రెడ్డి చేతిలో పరాజయం చవిచూశారు. 1957లో హైదరాబాద్‌ బేగంబజార్‌ నుంచి గెలిచిన కాంగ్రెస్‌ మాజీ మంత్రి జేవీ నరసింగ్‌రావు ఈసారి ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేటలో స్వతంత్ర అభ్యర్థి జీవీ పీతాంబరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. వర్ధన్నపేట నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలో నిలిచిన పెండ్యాల రాఘవరావు స్వతంత్ర అభ్యర్థి కుందూరు లక్ష్మీనరసింహారెడ్డి చేతిలో ఓడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి (సీపీఐ) నాగారం స్థానం నుంచి 101 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిరెడ్డి రంగారెడ్డి చేతుల్లో ఓటమి చవిచూశారు.  

లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే ఆధిక్యం.. 
అసెంబ్లీతోపాటు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అంతర్భా గంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 43 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్‌ 34, సీపీఐ 7 స్థానాలు కైవసం చేసుకున్నాయి. స్వతంత్ర పార్టీ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. తెలంగాణ ప్రాంతంలోని 15 లోక్‌సభ స్థానాల్లో 3 ఎస్సీలకు, 3 ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ 13 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన అవిభక్త సీపీఐ రెండు సీట్లలో విజయం సాధించింది.  

డీకే సత్యారెడ్డిపై రామేశ్వరరావు గెలుపు.. 
1957లో మహబూబ్‌నగర్‌ నుంచి లోక్‌సభకు మొదటిసారి ఎన్నికైన జె. రామేశ్వరరావు (కాంగ్రెస్‌) 1962లో గద్వాల నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి డీకే సత్యారెడ్డిపై విజయం సాధించారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో సత్యారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. వనపర్తి సంస్థానానికి చెందిన రాజా రామేశ్వరరావు తర్వాత మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌ స్థానం నుంచి మొదటిసారి లోక్‌సభకు పోటీ చేసిన జీఎస్‌ మెల్కోటే (కాంగ్రెస్‌) తన సమీప ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్‌ వాహెద్‌ ఒవైసీపై విజయం సాధించారు. తర్వాత మెల్కోటే వరుసగా రెండుసార్లు ఇదే సీటు నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అబ్దుల్‌ వాహెద్‌ ప్రస్తుత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తాత. అలాగే కాంగ్రెస్‌ తరఫున సంగెం లక్ష్మీబాయి వికారాబాద్‌ నుంచి రెండోసారి లోక్‌సభకు పోటీ చేసి స్వతంత్ర పార్టీ అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. 

వరంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బాకర్‌ అలీ మీర్జా తన సమీప కమ్యూనిస్టు అభ్యర్థి, కార్మిక నేత సర్వదేవభట్ల రామనాథంపై కేవలం 784 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.1957 ఎన్నికల్లో ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్‌ నాయకురాలు టి. లక్ష్మీకాంతమ్మ 1962లో ఖమ్మం లోక్‌సభ సీటు నుంచి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె అంతకుముందు రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన కమ్యూనిస్టు నేత టీబీ విఠల్‌రావును ఓడించారు. తొలి పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణరెడ్డి మరోసారి నల్లగొండ నుంచే పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కంచెనపల్లి పెద్ద వెంకటరామారావును ఓడించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా