ప్రచారానికి కౌంట్‌ డౌన్‌.. ఇక 36 గంటలే 

8 Apr, 2019 08:42 IST|Sakshi

మంగళవారం సా.5గంటలకు ప్రచారం పరిసమాప్తం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలతో తెరపడనుంది. ఇప్పటివరకు హోరెత్తిన మైకులు అప్పటి నుంచి మూగబోనున్నాయి. ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అందరికన్నా ముందుంది. ఓ పక్క ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మరోపక్క ఆయన తల్లి విజయమ్మ, ఇంకోపక్క ఆయన సోదరి షర్మిలమ్మ విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో వారంతా ఓ పక్క స్పష్టంగా చెబుతూనే.. మరోపక్క చంద్రబాబు గత ఎన్నికల హామీలను అమలుచేయకుండా ఎలా మోసం చేశారో వివరిస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఐదేళ్ల కాలంలో తాను చేసిన పనులను చెప్పకుండా కేవలం ప్రతిపక్ష నేతను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. అంతేకాక.. లేని పొత్తులు ఉన్నట్లు చూపి ఆ పార్టీపై అసత్య ఆరోపణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో.. విద్యావంతులు ఆయన ప్రచార శైలిని ఛీదరించుకుంటున్నారు. అలాగే, పొత్తులపైన, ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై వారి నుంచి తీవ్ర వ్యతిరేకతే వస్తోంది. ఇదే సమయంలో  వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్ధానాలను అమలుచేశాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పడంపై అన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా విద్యావంతుల్లో విశేష స్పందన లభిస్తోంది. 

చంద్రబాబు దుష్ప్రచారానికి విజయమ్మ చెక్‌
సీఎం చంద్రబాబు ప్రచార సభలు పేలవంగా.. ఎలాంటి స్పందన లేకుండా జరుగుతున్నాయి. మరోపక్క.. వైఎస్‌ జగన్‌తో పాటు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలమ్మ సభలకు జనం పోటెత్తుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అసత్యాలను వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ సూటిగా ప్రశ్నిస్తుండడాన్ని విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు. ఆయన చేస్తున్న అవాస్తవ పొత్తుల ప్రచారాన్ని విజయమ్మ చాలా సమర్ధవంతంగా తిప్పికొట్టమే కాకుండా ప్రజలతోనే మాకు పొత్తుంటూ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను ఆకట్టుకొంటున్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాక.. మోదీకి జగన్‌ భయపడుతున్నారంటూ చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా విజయమ్మ.. ‘నా కొడుకు కాంగ్రెస్, టీడీపీ కలిసి, సీబీఐ, ఈడీలతో దాడుల చేయించినప్పుడే భయపడలేదు. అలాంటిది ఇప్పుడు భయపడతాడా?’.. అంటూ ప్రశ్నిస్తున్న  తీరు ప్రజల్లోకి బాగా వెళ్లిందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తంచేస్తున్నారు. ఇక జగన్‌ సోదరి షర్మిలమ్మ కూడా తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారని, అంతేకాక.. చంద్రబాబు చెప్పే అబద్ధాలను వివరిస్తూ మాట్లాడుతున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

దిక్కుతోచని స్థితిలో బాబు
చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా తన ఐదేళ్ల పాలనలో ఈ పనులు చేసినందున తిరిగి తనకు ఓటు వేయమని అడగట్లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు అమలుచేయలేదు. ఈ విషయం బాబుకు కూడా తెలుసు. అందుకే వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలకు, దూషణలకు పాల్పడుతున్నారని ఉద్యోగస్తులు, అధికారులు చెబుతున్నారు. అలాగే మొన్నటి వరకు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పొత్తు కోసం తానే అడిగానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌తో లేని పొత్తును జగన్‌కు అంటకట్టేందుకు చంద్రబాబు చేస్తున్న అబద్ధపు విన్యాసాలనూ వారు ఛీదరించుకుంటున్నారు. అలాగే, మొన్నటి వరకు బీజేపీతో సంసారం చేసి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీతో జగన్‌ కలిసిపోయారంటూ చేస్తున్న ప్రచారాన్నీ విద్యావంతులు నమ్మట్లేదు. జగన్‌ తొలి నుంచీ హోదాపై ఓకే మాట మీద నిలబడితే బాబు రోజుకో యూటర్న్‌ తీసుకోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

మరిన్ని వార్తలు