ఇదేం అ'న్యాయం'!

8 Feb, 2018 09:14 IST|Sakshi

మత్స్యకారుల దీక్షలను పట్టించుకోరు గానీ..

కేంద్ర బడ్జెట్‌పైనిరసన పేరుతోవేషం వెర్రి

పక్కనే ఉన్న తన సామాజిక వర్గీయుల దీక్షాశిబిరం వైపు చూడని ఎమ్మెల్యే

దీక్షలపై మొదటినుంచీ ఆయనది ఇదే తీరు

సీఎం చీవాట్లతో మరింత దూరం

ఎమ్మెల్యే వాసుపల్లి తీరుపై గంగపుత్రుల ఆగ్రహం

వాసుపల్లీ.. మాకేమిచ్చావంటున్న మత్స్యకారులు

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.. ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న సమయం.. సందర్భం.. పక్కనే కొనసాగుతున్న మత్స్యకారుల దీక్షలను పట్టించుకోకపోవడం ఇప్పుడు వివాదానికి తావిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టి వారమైంది. ఇన్నాళ్లూ నోరుమెదపని వాసపల్లి ఈరోజే పనిగట్టుకొని కొంతమందిని వెంటేసుకొచ్చి నిరసన పేరుతో కాసేపు హడావుడి చేశారు.. ఆ పక్కనే తన సామాజికవర్గీయులే ఎస్టీ జాబితాలో చేర్చాలని 43 రోజులుగా చేస్తున్న దీక్షలను మాత్రం ఆయనగారు పట్టించుకోలేదు.. కనీసం శిబిరం వైపు కన్నెత్తి చూడలేదు.. బడ్జెట్‌ కేంద్రం పరిధిలోనిది.. తనకు ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ఏదో చేశానన్న మెహర్బానీ కోసం నిరసన తెలిపిన ఎమ్మెల్యే.. రాష్ట్ర పరిధిలోని అంశమైన మత్స్యకారుల ఎస్టీ సాధన డిమాండ్‌ను పట్టించుకోకపోవడం.. సీఎంను ఒప్పించ లేకపోవడం.. దీక్షలను ఉపేక్షించడంపై నిరసన వ్యక్తమవుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ నియోజకవర్గంలోనే మత్స్యకార జనాభా ఎక్కువగా ఉన్నా.. ఎమ్మెల్యే వాసుపల్లి అంటీముట్టనట్లు వ్యవహరించడం చర్చలకు తావిచ్చింది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదమైంది. కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా బుధవారం  నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తనదైన శైలిలో నిరసన చేపట్టిన ఎమ్మెల్యే.. ఆ పక్కనే ఉన్న మత్స్యకారుల దీక్షా శిబిరం వైపు తొంగిచూడకపోవడం విమర్శలపాలవుతోంది. తమను ఎస్టీ జాబితాలో చేర్పించాలంటూ పార్టీలకతీతంగా మత్స్యకారులు గత డిసెంబర్‌ 27 నుంచి నిరవధిక దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో దీక్షాశిబిరం జోలికి వెళ్లని వాసుపల్లి.. సీఎం చంద్రబాబునాయుడు నగరానికి వచ్చినప్పుడు మాత్రం ఏదో చేశానని చెప్పుకోవడానికి మత్స్యకార నాయకులను ఆయన వద్దకు తీసుకుని వెళ్లారు. కానీ సీఎం అందరి ముందు వాసుపల్లిని చెడామడా తిట్టేశారు. ఆయనతోపాటు మత్స్యకార నేతలపైనా బాబు విరుచుకుపడ్డారు. కనీసం వినతిపత్రం కూడా తీసుకోకుండా ‘తొక్క తీస్తా.. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు నా వద్ద చేస్తున్నారా’.. అంటూ వాసుపల్లి ముందే మత్స్యకారులపై మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్‌తో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మత్స్యకారులపై సీఎం అలా మాట్లాడినా  వాసుపల్లి ఏమీ స్పందించలేని పరిస్థితిలో మిన్నకుండిపోయారు. ఆ ఘటన దరిమిలా వాసుపల్లి మత్స్యకారుల దీక్షాశిబిరం జోలికి వెళ్లలేదు.

పోలీసులు వేధిస్తున్నా.. పట్టించుకోని ఎమ్మెల్యే
మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత దీక్షలతో నిరశన తెలియజేస్తున్న మత్స్యకారులపైకి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీక్షలకు అనుమతి లేదంటూ శిబిరాన్ని ఎత్తివేయాలని గత రెండు రోజులుగా నేతలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకారుల దీక్షలు భగ్నం చేసేందుకు కొంతమంది ప్రభుత్వ అనుకూల కుట్రదారులు దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. అటువంటి ఘటనలు ఇక్కడా చోటుచేసుకోవచ్చన్న నెపంతో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వాస్తవానికి అటువంటి పరిస్థితి విశాఖలో లేదు. గత 43రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రశాంతంగానే దీక్షలు కొనసాగుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఓ విధంగా మత్స్యకార నేతలను వేధిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులకు అండగా నిలవాల్సిన వాసుపల్లి అస్సలు పత్తా లేకుండా పోయారు. బుధవారం బడ్జెట్‌పై నిరసన చేపట్టిన సందర్భంగానైనా పక్కనే ఉన్న మత్స్యకారుల శిబిరం వద్దకు వస్తారని అందరూ భావించారు. కానీ ఎమ్మెల్యే అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలపాలవుతోంది.

వాసుపల్లి తీరు గర్హనీయం
ఓ వైపు పగపట్టిన విధంగా ప్రభుత్వ తీరు.. పోలీసుల ఆంక్షలతో నిరసనకారులు అల్లాడిపోతుంటే కనీసం దీక్షా శిబిరం వద్దకు రావాలన్న కనీస స్పృహ కూడా ఎమ్మెల్యే వాసుపల్లికి లేకపోయిందని వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు విమర్శించారు. న్యాయమైన డిమాండ్‌తో గంగపుత్రులు 43 రోజులుగా దీక్షలు చేస్తుంటే  ఎమ్మెల్యేగా, మత్స్యకార వర్గీయునిగా ఉన్న వాసుపల్లి ఏమాత్రం పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు.

తీరిక లేదేమో
దీక్షా శిబిరం వైపు తొంగిచూడని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ తీరుపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మత్స్యకార సంఘం నేత నీలకంఠం వ్యాఖ్యానించారు. బహుశా ఆయనకు తీరిక లేదేమో.. అందువల్లనే వచ్చి ఉండరు.. అని వ్యంగాస్త్రం సంధించారు.

మరిన్ని వార్తలు