కుటుంబ కథా చిత్రం

16 Apr, 2019 09:30 IST|Sakshi

ఐదుచోట్ల పోటీలో ములాయం కుటుంబ సభ్యులు

మూడుచోట్ల సునాయాసం.. రెండు స్థానాల్లో ఎదురీత 

కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గెలిచిన ఐదు సీట్లూ పార్టీ స్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు పోటీ చేసినవే. ఈసారి ఈ ఐదు స్థానాల్లో మూడు చోట్ల ఎస్పీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై పైచేయి సాధించినట్టు కనిపిస్తున్నారు. మిగిలిన రెండు సీట్లలో (కనౌజ్, ఫిరోజాబాద్‌) ములాయం కోడలు డింపుల్, ఆయన అన్న మనవడు అక్షయ్‌ యాదవ్‌ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో ములాయం సొంత స్థానం మైనపురీ, తూర్పు యూపీలోని ఆజమ్‌గఢ్‌ నుంచి పోటీచేసి గెలిచారు. మైన్‌పురీ సీటుకు రాజీనామా చేశాక జరిగిన ఉప ఎన్నికలో ఆయన అన్న రతన్‌సింగ్‌ యాదవ్‌ మనవడు తేజ్‌ప్రతాప్‌ విజయం సాధించారు. కోడలు డింపుల్‌ తమ కంచుకోటగా భావించే కనౌజ్‌ నుంచి మూడోసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. వరుసకు తమ్ముడైన ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌యాదవ్‌ కొడుకు అక్షయ్‌ యాదవ్‌ ఫిరోజాబాద్‌లో తొలిసారి విజయం సాధించారు. బదాయూన్‌ నుంచి ములాయం మరో అన్న అభయ్‌రాం కొడుకు ధర్మేంద్ర యాదవ్‌ ఎస్పీ టికెట్‌పై విజయం సాధించారు. ఈ ఐదుగురూ మళ్లీ తమ పాత నియోజకవర్గాల నుంచే ఎస్పీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే  ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ మిత్రపక్షం బీఎస్పీ ఎస్పీకి మద్దతు ఇవ్వడం. అంతేకాదు, కాంగ్రెస్‌  ఈ స్థానాల్లో ఒక్కచోటే అభ్యర్థిని నిలిపింది. 

కనౌజ్‌లో డింపుల్‌కు గట్టి పోటీ?
గతంలో రెండుసార్లు (2012 ఉప ఎన్నిక, 2014) కనౌజ్‌ నుంచి గెలిచిన డింపుల్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. ఎస్పీ, అధ్యక్షుడైన ఆమె భర్త అఖిలేశ్‌ అంతకు ముందు మూడు సార్లు, మామ ములాయం ఒకసారి విజయం సాధించిన స్థానం ఇది. 2019లో డింపుల్‌కు బీఎస్పీ మద్దతు ఉంది. కాంగ్రెస్‌ ఇక్కడ పోటీ పెట్టలేదు. ములాయం తమ్ముడు, మాజీ మంత్రి శివపాల్‌సింగ్‌ కూడా తన సొంత పార్టీ ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) తరఫున మొదట అభ్యర్థిని ప్రకటించి తర్వాత నామినేషన్‌ వేయించకపోవడంతో డింపుల్‌ సునాయాసంగా గెలవాలి. అయితే, 2014లో ఆమె సమీప బీజేపీ అభ్యర్థి సుబ్రత్‌ పాఠక్‌పై కేవలం 19 వేలకు పైగా ఓట్లతోనే విజయం సాధించారు. మళ్లీ బీజేపీ టికెట్‌పై పాఠక్‌ పోటీచేస్తున్నారు. ఈ ముఖాముఖి పోటీలో పాఠక్‌ నుంచి డింపుల్‌ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 1999 నుంచీ ఎస్పీ గెలుచుకుంటున్న కనౌజ్‌లో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 18.5 లక్షలు. వారిలో ముస్లింలు 3 లక్షలు, యాదవులు 2.5 లక్షలు, దళితులు మూడు లక్షలు, బ్రాహ్మణులు రెండు లక్షల మంది ఉన్నారు. బ్రాహ్మణుడైన బీజేపీ అభ్యర్థి పాఠక్‌ ఈసారి డింపుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఫిరోజాబాద్‌లో ముసలం
ఫిరోజాబాద్‌ ప్రస్తుత ఎంపీ అక్షయ్‌ తండ్రి, ములాయంకు వరుసకు సోదరుడైన రాంగోపాల్‌ 2014లో తన కొడుకుకు పార్టీ టికెట్‌ ఇప్పించడంలో విజయం సాధించారు. కాని, ములాయం తమ్ముడు శివపాల్‌ తన కొడుకు ఆదిత్యకు ఫిరోజాబాద్‌ టికెట్‌ వస్తుందని ఆశించారు. ఫలితంగా తమ్ముడు, వరుసకు తమ్ముడి మధ్య అప్పటి నుంచి విభేదాలు మొదలయ్యాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పగ్గాలు అఖిలేశ్‌ చేతుల్లోకి పోవడంతో ఇవి ముదిరాయి. పీఎస్పీ పార్టీ పెట్టిన శివపాల్‌ ఇప్పుడు తానే స్వయంగా ఫిరోజాబాద్‌లో అక్షయ్‌పై పోటీకి దిగి రాంగోపాల్‌పై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అక్షయ్‌కు ప్రధానంగా బీజేపీ అభ్యర్థి చంద్రసేన్‌ జాదోన్‌ నుంచి గట్టి పోటీ ఉంది. శివపాల్‌సింగ్‌ కూడా రంగంలో ఉండటంతో ఎస్పీ మద్దతుదారుల ఓట్లు చీలి బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఏర్పడింది. అయితే, తమ ఎన్నికల ప్రచారం లక్ష్యం శివపాల్‌ను గెలిపించడమేనని, ఆయన విజయం ఖాయమని పీఎస్పీ నేత రాందర్శన్‌ యాదవ్‌ చెప్పారు. శివపాల్‌ పోటీ వల్ల ఇక్కడ యాదవులు, ముస్లింల ఓట్లు చీలిపోయే మాట నిజమేగాని అక్షయ్‌ గెలుస్తారని జిల్లా ఎస్పీ నేత సుమన్‌ దేవి భర్త రఘువీర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంపీగా ఎన్నికయ్యాక అక్షయ్‌ నియోజవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో వారు కోపంతో ఉన్న మాట వాస్తవమే. కాని, ఈ సమస్య పరిష్కరించాం’ అని ఆయన వివరించారు. బీజేపీ అభ్యర్థి జాదోన్‌ ఎన్నికల బరిలో దిగడం ఇదే మొదటిసారి. 2014లో ఓడిన బీజేపీ అభ్యర్థి ఎస్పీ బాఘేల్‌ను ఇక్కడ పోటీకి దింపకపోవడంతో పార్టీలో అసంతృప్తి నెలకొన్నది. ఈ సీటులో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలపలేదు. 2009లో కనౌజ్‌తో పాటు ఫిరోజాబాద్‌ నుంచి కూడా ఎన్నికైన అఖిలేశ్‌ రాజీనామా చేశాక ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య డింపుల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన రాజ్‌బబ్బర్‌ చేతిలో ఓడిపోయారు.

ఆజంగఢ్‌లో అఖిలేశ్‌..
ఆజంగఢ్‌లో తొలిసారి పోటీచేస్తున్న అఖిలేశ్‌పై భోజ్‌పురీ నటుడు దినేశ్‌లాల్‌ యాదవ్‌ ‘నిరాహువా’ను బీజేపీ బరిలోకి దింపింది. అఖిలేశ్‌ సీఎంగా ఉన్న కాలంలోనే ఈ నటుడికి సీఎం చేతుల మీదుగా ‘యశ్‌భారతీ’ అవార్డు ప్రదానం చేశారు. ఇక్కడ మాత్రం శివపాల్‌యాదవ్‌ పార్టీ పీఎస్పీ తన అభ్యర్థిని పోటీకి దింపలేదు. ఇక్కడ అఖిలేశ్‌ విజయం నల్లేరు మీద నడకగా సాగిపోతుందని అంచనా.

మైన్‌పురీ నుంచి ములాయం మళ్లీ..
2014 ఎన్నికల్లో ములాయం సొంత నియోజకవర్గం మైన్‌పురీలో బీజేపీ ప్రత్యర్థి శత్రుఘన్‌సింగ్‌ చౌహాన్‌ను భారీ మెజారిటీతో ఓడించారు. అనంతరం ములాయం రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన అన్న మనవడు తేజ్‌ప్రతాప్‌ తన బీజేపీ ప్రత్యర్థి ప్రేంసింగ్‌ శాక్యాను మూడు లక్షల 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇప్పుడు మళ్లీ ములాయం ఇక్కడి నుంచే బరిలోకి దిగగా, ఆయనపై బీజేపీ నుంచి ప్రేంసింగ్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ పోటీలో లేదు.

బదాయూన్‌లో త్రిముఖ పోటీ
ములాయం అన్న మనవడు, సిట్టింగ్‌ సభ్యుడు ధర్మేంద్ర మళ్లీ పోటీ చేస్తున్న బదాయూన్‌లో బీజేపీ తరఫున యూపీ కేబినెట్‌ మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య కూతురు సంఘమిత్ర బరిలోకి దిగారు. 2014లో ఆమె బీఎస్పీ అభ్యర్థిగా మైన్‌పురీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2016లో సంఘమిత్ర తన తండ్రితోపాటు బీజేపీలో చేరారు. ఇక్కడ పీఎస్పీ అభ్యర్థిని నిలపకపోవచ్చని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎంపీ సలీం షేర్వానీ పోటీ చేస్తున్నారు. ఆయన 1996 నుంచి ఎస్పీ తరఫున మూడుసార్లు పోటీచేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరి ఇక్కడ నుంచి ఆ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు.  

మరిన్ని వార్తలు